Revanth Reddy | ‘జైలుకెళ్లడానికి కేటీఆర్ తపనపడుతున్నారు’..
x

Revanth Reddy | ‘జైలుకెళ్లడానికి కేటీఆర్ తపనపడుతున్నారు’..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జైలుకు వెళ్లడానికి తపనపడుతున్నారంటూ దుయ్యబట్టారు.


బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జైలుకు వెళ్లడానికి తపనపడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఈరోజు రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. అదానీ అందించిన రూ.100 కోట్ల విరాళంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా స్కిల్ యూనివర్సిటీ(Skill University)కి అదానీ గ్రూప్(Adani Group) అందిస్తున్న రూ.100 కోట్ల విరాళాన్ని తమ ప్రభుత్వం స్వీకరించడం లేదని, ఇదే విషయాన్ని తెలుపుతూ సదరు సంస్థకు లేఖ రాయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేదకాకుండా తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దని కూడా ప్రతిపక్షాలను హెచ్చరించారు.

ప్రభుత్వాన్ని వివాదాల్లోకి లాగొద్దు..

‘‘అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు తీసుకుందని కొందరు కొన్ని రోజులుగా తెగ ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. అదే విధంగా అదానీ నుంచి కూడా చట్టబద్దంగానే పెట్టుబడులను అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది. అదానీ, టాటా, అంబానీ.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. సీఎస్ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ఇచ్చింది. దీనిని ప్రాజెక్ట్‌ల కోసం సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని వారిని హెచ్చరిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్చించాలని స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాం. సదుద్దేశంతో ప్రారంభించిన ఈ వర్సిటీని వివాదాల్లోకి లాగొద్దు’’ అని రేవంత్ అన్నారు.

జెలుకెళ్లాలన్న తపనతోనే

‘‘అదానీతో మా ప్రభుత్వమే ఏదో వ్యాపారం చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం.. అదానికి ఎన్నో ప్రాజెక్ట్‌లు ఇచ్చింది. అదానితో అంటకాగింది. అదానీ వద్ద కమీషన్లు తీసుకున్నది ఎవరు. అదానీని కలిసింది కేసీఆర్, కేటీఆర్ కాదా? కేటీఆర్ ఇప్పుడు జైలుకు వెళ్లాలలని తహతహలాడుతున్నారు. జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని అనుకుంటున్నారు కాబోలు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి ఐదు నెలల ఉండి వచ్చారు. జైలుకెళితే సీఎం అవుతారంటే.. ఈ రేసులో ముందు కవిత ఉంటారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటుకు గట్టి పోటీ ఉంది’’ అని రేవంత్ రెడ్డి చురకలంటించారు.

ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా

‘‘నేను ఢిల్లీకి వెళ్తున్నానంటూ కొందరు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు ఏం తెచ్చావ్ అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నా. కానీ ఈ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావడం కోసం ఢిల్లీకి వెళ్తున్నా. పార్లమెంటు సమావేశాలపై ఎంపీలతో మంగళవారం చర్చిస్తాం. అందుబాటు ఉన్న కేంద్ర మంత్రులకు కలిసి రాష్ట్ర సమస్యల్ని వివరిస్తా. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 28సార్లు ఢిల్లీకి వెళ్లానంటూ కొందరు విమర్శిస్తున్నారు. నేను వారి మాదిరగా పైరవీలు చేయడానికో, బెయిల్ తెప్పించుకోవడానికో వెళ్లలేదు. వెళ్లడం లేదు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం కోసమే వెళ్తున్నా. ఈ విషయంలో తగ్గేది లేదు. ఎన్నిసార్లైనా వెళ్తా’’ అని ఘాటుగా బదులిచ్చారు.

Read More
Next Story