రాజ్ పాకాల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చురకలు
x

రాజ్ పాకాల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చురకలు

కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల ఇంట్లో పార్టీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళికి మన ఇంట్లో చిచ్చు బుడ్లు కాలిస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌లో మాత్రం సారాబుడ్లే లేస్తాయంటూ చురకలంటించారు.


కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల ఇంట్లో పార్టీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళికి మన ఇంట్లో చిచ్చు బుడ్లు కాలిస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌లో మాత్రం సారాబుడ్లే లేస్తాయంటూ చురకలంటించారు. దీపావళి దావత్ అంటే అలా చేయాలని తమకు తెలియదని, ఇప్పుడే తెలిసిందంటూ ఎద్దేవా చేశారు. ఏమీ చేయకపోతే.. పార్టీలో ఏం జరగకపోతే.. రాజ్ పాకాల ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు రేవంత్. అంతేకాకుండా ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని, అది నిజంగానే ఫ్యామిలీ ఫంక్షన్ అయితే అందులో క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు వచ్చిందని నిలదీశారు రేవంత్ రెడ్డి. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగింది ముమ్మాటికీ ఫ్యామిలీ ఫంక్షన్ కాదని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. అయితే ఈ పార్టీలో 14 మంది మహిళలతో సహా 35 మంది ఉన్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్నవారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఒక వ్యక్తి కొకైన్ అనే మత్తుమందు తీసుకున్నట్లు నిర్ధారణ కావటంతో కేసు నమోదు చేశారు. ఏ1 గా కార్తీక్, ఏ2 గా రాజ్ పాకాల పేర్లను కేసులో చేర్చారు. ఈ ఫామ్ హౌస్ 30 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ సందర్బంగానే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరినీ ఫినీష్ చేస్తా..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ఎక్స్‌పైర్ అయిన మెడిసన్ అని విమర్శించారు. ఒక్క సంవత్సరంలోనే కొడుకు చేత తండ్రిని ఫినీష్ చేశానని, ఇప్పుడు బావతో బామ్మర్దిని కూడా ఫినిష్ చేస్తానని అన్నారు. ఆ తర్వాత హరీష్ రావును ఎలా డీల్ చేయాలో ఆలోచిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగానే కేటీఆర్, హరీష్ రావులకు ఓ ఛాలెంజ్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. వాడపల్లి నుంచి వికారాబాద్‌ వరకు పాదయాత్ర చేస్తానని, కేటీఆర్ హరీష్ రావు కూడా ఇందులో పాల్గొనాలని సవాల్ చేశారు. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను ఆ పాదయాత్రలో అడుగుదామని కోరారు. ఇదిలా ఉంటే రాజ్‌పాకాల పార్టీ కేసుపై కేటీఆర్ ఇప్పటికే స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కూడా ఇదంతా కూడా రేవంత్ కుట్రలో భాగమేనని ఆరోపించారు.

హరీష్ రావు ఏమన్నారంటే..

మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నివాసంలో రేవ్ పార్టీ నిర్వహించారన్న కేసు రెండు రోజులు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఇదంతా కూడా బీఆర్ఎస్‌పై కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. ఫాంహౌస్ ఘటన వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్ర దాగుందని ఆరోపించారు. అంతేకాకుండా పార్టీ జరిగింది రాజ్ పాకాల కొత్త నివాసంలో అయితే ఫామ్ హౌస్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇల్లు కొన్న సమయంలో అందరినీ పిలవలేకపోవడం ఇప్పుడు పిలిచి చిన్న పార్టీ పెట్టుకుంటే దానికి రేవ్ పార్టీ అన్న ట్యాగ్ వేసి తీవ్ర రచ్చ చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి.. ఫ్యామిలీ ఫంక్షన్, రేవ్ పార్టీకి మధ్య తేడా కూడా తెలియదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే కేటీఆర్‌పై బురదజల్లడానికి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు బీజేపీ నేత, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్. అసలు రేవ్ పార్టీలో వృద్ధులు, పిల్లలు ఉంటారా సంజయ్? నువ్వే చెప్పు? మూసీ విషయంలో పేదల పక్షాన కొట్లాడుతున్నందు వల్లే రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. తమ వైఫల్యాలను బీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచుతోందని, అందుకే బీఆర్ఎన్ నేతలు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తిరలేపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి రేవంత్‌ వెన్నులో వణుకుపుడుతోంది. బండి సంజయ్ కూడా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా బండి సంజయ్ వకాల్తా పుచ్చుకోవడం సరికాదు’’ అని ఎద్దేవా చేశారు.

Read More
Next Story