‘రాష్ట్ర క్షేమం కోసమే’.. మూసీ అంశంపై సీఎం రేవంత్ అప్పీల్..
x

‘రాష్ట్ర క్షేమం కోసమే’.. మూసీ అంశంపై సీఎం రేవంత్ అప్పీల్..

మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి.. గాంధీ భవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్ట్ ఎవరినీ ముంచడానికి చేపట్టింది కాదన్నారు.


మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి.. గాంధీ భవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్ట్ ఎవరినీ ముంచడానికి చేపట్టింది కాదని, రాష్ట్ర క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్ట్ అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆదుకోవడం ఎలా అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అనాథలను చేయదని, కావాలంటే నెహ్రూ, రాజీవ్ గాంధీ పాలనలు దీనిని స్పష్టం చేస్తాయని అన్నారు.

కాంగ్రెస్ విజన్‌తో దేశాభివృద్ధి సాధ్యమని, సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కంప్యూటర్లు వద్దని పోరాడిన వారు ఉన్నారని, కానీ ఇప్పుడు కంప్యూటర్ లేకుంటే పని కావట్లేదని వివరించారు. కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరిగాయని, ఆదాయం రెట్టింపు అయిందని గుర్తు చేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను భూస్వాములు, దొరలు వ్యతిరేకించారని, ఎప్పుడు ఏది తీసుకొస్తున్నా వ్యతిరేకించే వాళ్లు తప్పకుండా ఉంటారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు కూడా మూసీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రుల ముసుగులో రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న బందిపోటు దొంగలు వ్యతిరేకిస్తున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన వారు కొందరు నూతన ప్రభుత్వం ఏం తెచ్చినా అడ్డుకోవాలన్న ధోరణితోనే ఉంటారని, అలాంటి బందిపోటు దొంగలను తాను పట్టించుకోనని అన్నారు. తమ ప్రభుత్వం అద్దాల మేడల కోసం, అందాల భామల కోసం ఏ పని చేయడం లేదని, ప్రజల కోసమే తాము ఈ చర్యలు చేపడుతున్నామని అన్నారు.

కళ్ళారా చూసినా మారరా..!

‘‘పిల్లను ఇచ్చిన పాపానికి మిడ్ మానేరు ఊరినే ముంచారు. హైడ్రా అనేది ఏమైనా భూతమా, ఫార్మ్ హౌస్‌లో నుంచి బయటకు రాని దొరా వచ్చి కబలించడానికి, బఫర్ జోన్‌లో 10వేల ఇళ్లు ఉన్నాయి. వారిని ఎలా ఆదుకోవాలి. వారికి మంచి జీవితాన్ని ఎలా అందించాలి అని ఎమ్మెల్యేలతో చర్చించాలని మంత్రులకు చెప్పాం. బుల్డోజర్లు మాపైనుంచి పోనివ్వాలంటే మాపైనుంచి అంటూ కొందరు తెగ పోటీ పడుతున్నారు. నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా? వర్షం పడితే చెన్నై, విజయవాడ పరిస్థితి ఏమైందో చూశారు కదా? హైదరాబాద్ గతి కూడా అలా కావాలన్నదే మీ ఆశ? కళ్ల ముందే వర్షాలకు నగరాలు నీటమునగడాన్ని చూశాం. అదే గతి పడుతుంది సామీ.. అన్నా వినరేం. ఇలా చేస్తే నాకేమైనా వస్తుందా? ఏదైనా ఉప్పెన వస్తే అంతా కొట్టుకుపోతాం? వద్దు అంటే చెప్పండి వదిలేద్దాం. టెండర్ క్యాన్సిల్ చేసి పంపేస్తాం. నల్గొండ వాళ్ల బాధలు ఎవరికీ పట్టవా? నల్గొండ వాళ్లంతా అడుతున్నారు. నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటా కుదరదు. నన్ను బ్లేమ్ చేస్తున్నది కొందరు దొంగలు, దగాకోర్టు.. వాళ్ల మాటలు నేను పట్టించుకోను. మూసీ ప్రాజెక్ట్‌కు రూ.లక్షనర కోట్లు అని అంటున్నారు.. ఇదేమైనా కాళేశ్వరమా అంతలా ఖర్చు పెట్టడానికి?’’ అని ప్రశ్నించారు.

యూట్యూబ్‌లతో అధికారం రాదు..

‘‘కొందరు యూట్యూబ్‌లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారు. మూసీలో ఉన్న మురికి కంటే వాళ్ల మెదళ్లలోనే ఎక్కువ బురద ఉంది. వాళ్ల తలలు మొత్తం విషంతో నిండిపోయాయి. రచ్చ బండ నిర్వహిద్దాం. కేసీఆర్.. నీ నియోజక వర్గానికే వస్తా. రచ్చ బండ దగ్గర కూర్చుని మాట్లాడదాం. మాకెటువంటి అభ్యంతరం లేదు. ప్రజలు ఇచ్చిన బాధ్యత కాబట్టి ప్రజలకు మేలు చేయాలన్నదే మా ఆలోచన. మూసీ సుందరీకరణ కాదు.. ప్రక్షాళన. దుబాయ్ వెళ్లి జుట్టు మొలిపించుకునే టట్టు కాదు. నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు. అలాంటి నగరం హైదరాబాద్ అవుతుంది. అటువంటి నది పాలకుల నిర్లక్ష్యం వల్ల మురికి కూపమైంది. మూసీకి పునర్జీవం పోస్తాం. సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కరిని తరలించాలని ఆలోచన చేస్తున్నాం’’ అని విరించారు.

అసెంబ్లీలో మాట్లాడదాం..

‘‘మూసీ ప్రాజెక్ట్‌పై ప్రతి ఒక్కరూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఎన్నాళ్లు మాట్లాడతారో, ఎంతలా మాట్లాడతారో, ఏమని మాట్లాడతారో మాట్లాడండి. అతి త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో మూసీ ప్రక్షాళన అంశంపై చర్చిద్దాం. అందులో మీ వాదనలు ఏంటో విని.. వాటికి బదులిస్తాం. అక్కడ చూసుకుందాం’’ అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

Read More
Next Story