నిరుద్యోగులకు రేవంత్ చిట్కా..
x

నిరుద్యోగులకు రేవంత్ చిట్కా..

ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా తెలంగాణలో నిరుద్యోగ సమస్య సమసిపోదంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా తెలంగాణలో నిరుద్యోగ సమస్య సమసిపోదంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వారి కష్టాలను గుర్తించే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామని ఆయన వివరించారు. మాసబ్‌ట్యాంక్‌లో నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే నిరుద్యోగులకు సీఎం రేవంత్ ఓ చిట్కా చెప్పారు. ఆ చిట్కా పాటించడం ద్వారా ఉద్యోగాలు పొందడం కాస్తంత సులభతరం అవుతుందని, అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఓ వినూత్న కోర్సుకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు రేవంత్. ఈ స్కిల్ ప్రోగ్రామ్ నిరుద్యోగ యువతకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందని, వారి నైపుణ్యాలను పెంచుతుందని అన్నారు.

నిరుద్యోగులు ఇలా చేయాలి..

‘‘నిరుద్యోగులు చదువులు పూర్తి చేసుకుని వచ్చి ఉద్యోగాల వేటలో తలమున్కలైపోతున్నారు. ఎంత ప్రయత్నించినా రిజెక్షన్లే ఎదురవుతున్నాయి. ఉద్యోగాల కోసం వెతికే సమయంలో నిరుద్యోగులు డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా గుర్తించుకోవాలి. బయట మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉందో చూసి అందులో నైపుణ్యాన్ని పెంచుకోవాలి. తద్వారా మీరు మీ నైపుణ్యాన్ని సప్లై చేసి ఉద్యోగం రాబట్టొచ్చు. ఇందులో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇప్పటికే ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న అంశంపై పలు పరిశ్రమలతో చర్చించాం. సదరు సంస్థల సూచనల మేరకే ఈ వినూత్న కోర్సుకు శ్రీకారం చుట్టాం. ఈ కోర్సు ద్వారా ఎందరో నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది’’ అని చెప్పారు.

నిరుద్యోగం సమసిపోదు..

‘‘తెలంగాణలో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య సమసిపోదు. దీని తీవ్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. దీంతో 2 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయినా లక్ష మంది నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి అవకాశాలపై అనేక పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాం. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని వారిని అడుగుతున్నాం. నిరుద్యోగులు డిమాండ్-సప్లై ఫార్ములా గుర్తించుకోవాలి. డిగ్రీ చదివేవారు తమ భవిష్యత్తు దిశగా ఆలోచించి అడుగులు వేయాలి. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఉద్యోగాలు అధికంగా ఉన్నాయి. ఆఖరికి నాయకుడిగా రాణించాలన్నా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. దాంతో పాటుగా అదనపు కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను అధికంగా పొందవచ్చు’’ అని సీఎం సూచించారు.

నిరుద్యోగులు వాటికి దూరంగా ఉండాలి..

‘‘కారణం ఏదైనా ఎక్కువ కాలం ఉద్యోగం, ఉపాధి లభించని సమయంలోనే నిరుద్యోగ యువత చెడు వ్యసనాల వైపు అడుగులు వేస్తుంది. బీటెక్ పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగం లేకపోవడంతో డ్రగ్స్, మత్తుపదార్థాలు అనే విష వలయంలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్య నిర్మూలనకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ సమస్యను ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించలేదు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి. వారు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కొత్త దారుల్లో ఉపాధిని ప్రయత్నాలు చేయాలి’’ అని చెప్పారు.

యాక్షన్ తీసుకోవడానికి వెనకాడం..

‘‘కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక వసతులు కూడా ఉండటం లేదు. కళాశాలలు ఇలాగే కొనసాగితే వాటి గుర్తింపు రద్దు చేయడానికి కూడా వెనకాడం. దీనిని గుర్తెరిగి కళాశాలలు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అతి త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల అవుతున్నా ఇంకా 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అతి త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎంత చదువుకున్నా సరే.. నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి’’ అని తెలిపారు.

Read More
Next Story