తెలంగాణ తల్లి వైపు మళ్ళిన రేవంత్ ఫోకస్
x

తెలంగాణ తల్లి వైపు మళ్ళిన రేవంత్ ఫోకస్

విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం వైపు మళ్లినట్లు అనిపిస్తోంది.


విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం వైపు మళ్లినట్లు అనిపిస్తోంది. "రాష్ట్రానికి ఏం చేశాడని రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు? తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే, మేం అధికారంలోకి వచ్చాక తొలగిస్తాం. తెలంగాణ తల్లికి కాంగ్రెస్ చేసిన అవమానాన్ని రాష్ట్రం మర్చిపోదు" అంటూ బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది.. అంటూ బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం సెంటిమెంట్ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లకుండా అలర్ట్ అయ్యారు. "పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. అయ్య విగ్రహం పెట్టాలని కేటీఆర్ ఆలోచిస్తున్నాడు. అందుకే డ్రామా మొదలెట్టాడు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది" అని రాజీవగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు నిర్వహించిన సభలో పొద్దున్న మాట్లాడిన రేవంత్ సాయంత్రానికే రంగంలోకి దిగేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సీఎం రేవంత్ స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇదివరకే చెప్పారు. విగ్రహ ఏర్పాటునకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగా సచివాలయ ఆవరణలో ఉన్న పరిస్థితిని స్వయంగా తిరిగి పరిశీలించారు.

ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Read More
Next Story