మరో హైదరాబాద్ గా వరంగల్..!
x

మరో హైదరాబాద్ గా వరంగల్..!

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, హనుమకొండ కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.


వరంగల్ ని హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వరంగల్ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, హనుమకొండ కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూ సేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులను కోరారు.

నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించిన సీఎం... ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్ టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల సంక్షేమం విషయంలో రాజీపడొద్దని, నిర్వాసిత కాలనీలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతీ 20 రోజులకు ఒకసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని అధికారులను ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమెంటన్న సీఎం... నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సీఎం తేల్చి చెప్పారు.

Read More
Next Story