‘ఫామ్ హౌస్ కేసంతా కాంగ్రెస్ కుట్రే’.. హరీష్ ఆరోపణలు
x

‘ఫామ్ హౌస్ కేసంతా కాంగ్రెస్ కుట్రే’.. హరీష్ ఆరోపణలు

మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నివాసంలో రేవ్ పార్టీ నిర్వహించారన్న కేసు రెండు రోజులు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.


మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నివాసంలో రేవ్ పార్టీ నిర్వహించారన్న కేసు రెండు రోజులు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఇదంతా కూడా బీఆర్ఎస్‌పై కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. ఫాంహౌస్ ఘటన వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్ర దాగుందని ఆరోపించారు. అంతేకాకుండా పార్టీ జరిగింది రాజ్ పాకాల కొత్త నివాసంలో అయితే ఫామ్ హౌస్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇల్లు కొన్న సమయంలో అందరినీ పిలవలేకపోవడం ఇప్పుడు పిలిచి చిన్న పార్టీ పెట్టుకుంటే దానికి రేవ్ పార్టీ అన్న ట్యాగ్ వేసి తీవ్ర రచ్చ చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి.. ఫ్యామిలీ ఫంక్షన్, రేవ్ పార్టీకి మధ్య తేడా కూడా తెలియదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రేవంత్‌కి విషం ఫుల్.. విజన్ నిల్

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి విజన్ అనేదే లేదని, ఆ క్యాటగిరీలో అంతా శూన్యమే అంటూ చురకలంటించారు. ‘‘రేవంత్ రెడ్డి నెత్తి నిండా విషమే ఉంది. విజన్ మాత్రం రవ్వంత కూడా లేదు. బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వానికి కాకుండా రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా పనిచేస్తున్నారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడం ఏమాత్రం మంచి పద్దతి కాదు. ఫామ్‌హౌస్ ఫంక్షన్‌లో కేటీఆర్ సతీమణి లేరు. హత్యా రాజకీయాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీనే రోడ్డుపైకి వచ్చి వాళ్ల నాయకత్వాన్ని ఎండగడుతున్నారు. మూసీ విషయంలో నల్గొండ రైతులతో న్యాయం చేస్తున్నారు. పోలీసులు కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లే తెలంగాణ ఆదాయం పడిపోయింది. తెలంగాణ తిరోగమనం చెందుతోంది’’ అని విమర్శించారు.

ఆ దమ్ము లేకనే ఈ ప్రయత్నాలు

‘‘రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే కేటీఆర్‌పై బురదజల్లడానికి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు బీజేపీ నేత, కేంద్ర సహాయకమంత్రి బండిసంజయ్. అసలు రేవ్ పార్టీలో వృద్ధులు, పిల్లలు ఉంటారా సంజయ్? నువ్వే చెప్పు? మూసీ విషయంలో పేదల పక్షాన కొట్లాడుతున్నందు వల్లే రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. తమ వైఫల్యాలను బీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచుతోందని, అందుకే బీఆర్ఎన్ నేతలు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తిరలేపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి రేవంత్‌ వెన్నులో వణుకుపుడుతోంది. బండి సంజయ్ కూడా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా బండి సంజయ్ వకాల్తా పుచ్చుకోవడం సరికాదు’’ అని ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ ఏమన్నారంటే..

జన్వాడ ఫామ్ హౌస్ వార్తలపై బండి సంజయ్ ఇవాళ స్పందించారు. సుద్దపూస కబుర్లు చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఏమంటాడని అన్నారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గు చేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బడానేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని సంజయ్ అన్నారు.

Read More
Next Story