
సోషల్ మీడియా పోస్ట్‌లపై సీఎం ఫైర్
సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో నా పేరు ఉన్న ప్రతి చోట మీ పేరు పెట్టుకుని చూడండి. అన్నం ముద్ద గొంతు దిగుతుందేమో చూడండి అని రేవంత్ అన్నారు.
‘ఒక ట్యూబ్ ఛానెల్ పెట్టి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసి. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జర్నలిస్ట్‌లు అవుతారా?’’ అని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తనపై సోషల్ మీడియాపై పెట్టిన పోస్ట్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి.. వారికి జర్నలిస్ట్ ట్యాగ్ తగిలిస్తున్నారని మండిపడ్డారు. ఒక ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడితే జర్నలిస్ట్‌లు అయిపోతారా? అని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొందరు ‘భూ భారతి’ పేరుతో సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘భూభారతి’ పేరుతో పేదల భూములను హక్కు దారులకు అందించే ప్రయత్నం చేస్తున్నందుకు నాపై కోపం తెచ్చుకున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రేవంత్ ప్రభుత్వం.. మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందంటూ సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడారు. తనపై ఇంతటి స్థాయిలో అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
‘‘కొందరు పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి వారి చేత ఇష్టమొచ్చినట్లు వీడియోలు చేయిస్తున్నారు. అలా చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పోలీసులు కేసు పెట్టారు. వాళ్లు వీడియోలు పెట్టినందుకు పోలీసులు కేసు పెట్టలేదు. ఆ వీడియోల్లో ఉన్న భాష.. ఘోరాతిఘోరంగా ఉండబట్టే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక్కసారి ఆ భాషను వినండి ఎంత జుగుప్సాకరంగా ఉంది. ఎవరు పడితే వాళ్లు ఒక ట్యూబ్ ఛానెల్ పెట్టేసుకుని అందులో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే వాళ్లు జర్నలిస్ట్‌లు అయిపోతారా? వాళ్ల భాష వింటే రక్తం మరిగిపోతోంది. ప్రజా జీవితంలో ఉండబట్టి ఓపిక పడుతున్నాం. రాజకీయంగా నన్ను విమర్శిస్తే తీసుకుంటా. అలా కాదుని కుటుంబ సభ్యుల జోలికెళితే తోలు తీస్తా’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
‘‘నా భార్య, బిడ్డను తిడితే నాకు నొప్పిగానే ఉంటుంది. ఒక ఆడపిల్లలను అవమానిస్తుంటే మీకు ఏమీ అనిపించదా? ఏ సంస్కృతిలో ఉన్నామని ప్రశ్నిస్తున్నా. సీఎంగా చెప్తున్నా.. ఒక్కొక్కరికి తోలు తీస్తా. ప్రజా జీవితంలో ఉన్న మా గురించి మాట్లాడండి. విమర్శించండి. అంతేకానీ కుటుంబంలోని వాళ్ల గురించి వద్దు. నోటికొచ్చింది మాట్లాడి.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఒక పైశాచికానందం. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో నా పేరు ఉన్న ప్రతి చోట మీ పేరు పెట్టుకుని చూడండి. అన్నం ముద్ద గొంతు దిగుతుందేమో చూడండి’’ అని అన్నారు.