ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమానికి సీఎం శ్రీకారం
x

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమానికి సీఎం శ్రీకారం

వన్ స్టేట్ వన్ వార్డు కుటుంబానికి ఐడితో పాటు డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.సంక్షేమ పథకాలు ఈ కార్డుల ద్వారా అమలు చేస్తారు.


ప్రజలకు బహుళ ప్రయోజనం కల్పించాలనే ఉద్ధేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వెల్లడించారు.సికింద్రాబాద్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లను ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

- పేదవాడికి రేషన్ కార్డులు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ డిజిటల్ ఫ్యామిలీ కార్డులను జారీ చేస్తున్నామని సీఎం చెప్పారు. ఆసుపత్రి రిపోర్టులు కూడా ఈ డిజిటల్ కార్డులో ఉండేలా పైలెట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు.

సంక్షేమ పథకాలు అందించేందుకు డిజిటల్ ఫ్యామిలీ కార్డు
30 శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్ కార్డు రూపంలో తీసుకువస్తున్నామని సీఎం ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో డిజిటల్ కార్డులు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే కుటుంబ పెద్దగా మహిళను పొందుపర్చామని సీఎం చెప్పారు.

మీ భరతం పడతాను
అభివృద్ధి పనులను అడ్డుకుంటే మీ భరతం పడతానని సీఎం రేవంత్ హెచ్చరించారు.మిమ్మల్ని వదిలేది లేదని, ఒక్కొక్కరిని చింతపండు చేస్తానని, మూసీని అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని రోజులు బతుకుతారు? అని సీఎం ప్రశ్నించారు. ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టిద్దాం, మూసీలో ఆ దోమలు, కాలుష్యంలో పెరిగే కంటే డబుల్ బెడ్రూం ఇస్తే విపక్షాల నేతలకు ఏం బాధ వచ్చిందని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.

పేదలకు సాయం చేసేందుకే ఈ ప్రాజెక్టు
పేదలకు ఇబ్బందులు కల్పించకుండా సహాయం చేయాలనే మంచి సంకల్పంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టును ఆపితే డబ్బు సంచులు వస్తాయి, ఆక్రమణలను తొలగిస్తే ఎవరైనా సంచులిస్తారా? గతంలో సంచులు తీసుకున్నళ్లకు తెలుసు అని రేవంత్ ఎద్దేవా చేశారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సంచులు దండుకున్నారు.

ఫాం హౌస్ లు కూల్చవద్దా?
మూసీ నగరానికి జీవనాధారం, సబితమ్మ నీ ముగ్గురు కుమారుల ఫాం హౌస్ లు కూల్చవద్దా? జన్వాడా ఫాం హౌ స్ కూల్చవద్దా? కేవీపీ రామచంద్రరావు ఫాం హౌస్ ను కూల్చాలా వద్దా అని సీఎం ప్రశ్నించారు. పెద్దోళ్లు ఫాం హౌస్ లు కట్టుకొని మురుగునీటిని గండిపేటలో కలుపుతారా అని ఆయన ప్రశ్నించారు. ఇంకుడు గుంతల్లేని ఇళ్లకు ఆస్తిపన్ను రెట్టింపు చేయమని అధికారులను ఆదేశించానన్నారు.సురక్షితమైన మంచి నగరంగా చేయాలంటే ఆక్రమణలను తొలగించాలని సీఎం అన్నారు. మూసీ మురుగు వల్ల జనం అవస్థలు పడుతున్నారు.

ఆక్రమణలను తొలగించాల్సిందే...
మూసీ,చెరువుల్లో ఉన్న ఇళ్లను, బఫర్ జోన్లలోని ఇళ్లను తొలగించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. మూసీ ఆక్రమణ దారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి వారికి తోవ ఖర్చులకు 25వేల రూపాయలు ఇచ్చామని సీఎం చెప్పారు.బీజేపీ ఎంపీలు ఈటెలతో పాటు మిగతా వారు తనను ప్రధాని వద్దకు తీసుకువెళితే తాను వస్తానని సీఎం చెప్పారు.25వేల కోట్లు ప్రధాని నుంచి తీసుకువద్దాం రమ్మని సీఎం కోరారు.

కుటుంబానికి ఓ ఐడీ
కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి కుటుంబానికి ఒకే కార్డు కుటుంబ సభ్యులకు ఒక ఐడి నంబర్ జారీ చేయనున్నారు.తెలంగాణ రాష్ట్రం లో 119 అసెంబ్లీ నియోజక వర్గం లో పరిధిలో గల గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామం నగర ప్రాంతంలో ఒక వార్డు లోని కుటుంబాలను సర్వే చేస్తారు.రోజుకు 30-40 గృహాలు సర్వే టార్గెట్ గా 5 రోజుల్లో సర్వే పూర్తి చేస్తారు.

ఫ్యామిలీ అందరికీ ఒకే ఆర్థిక స్టేటస్
డిజిటల్ ఫ్యామిలీ కార్డులో ఎప్పుడైనా కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పించారు.ఫ్యామిలీ అందరికి ఒకే పేజీ లో నమోదు.అడిషన్, డెలిషన్, అప్ డేషన్, విభజనను సర్వే రిపోర్ట్ టీమ్ గుర్తిస్తారు.కుటుంబ సభ్యులందరి తో ఫోటో క్యాప్చర్ చేస్తారు.


Read More
Next Story