హైదరాబాద్ నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి నేటి సాయంత్రం 6.05 గంటలకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే లక్షమంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి సన్నిధిలో కొత్తగా ఫౌంటెయిన్ నిర్మించారు.విగ్రహ ఆవిష్కరణ అనంతరం జయ జయహే తెలంగాణ రచించిన కవి అందెశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను సన్మానించనున్నారు.17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం, పీఠం మూడు అడుగులు కలిపి మొత్తం 20 అడుగుల ఎత్తుతో తయారు చేశారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, ప్రముఖ శిల్పి ఎంవీ రమణారెడ్డి చెప్పారు. తెలంగాణ సాధారణ మహిళలాగా పోరాట పటిమ ప్రస్పుటించేలా విగ్రహాన్ని తయారు చేశామని వారు పేర్కొన్నారు. కిరీటాలు, ఆభరణాలు వంటి ఆడంబరాలు లేకుండా సాధారణ తెలంగాణ మహిళగా తెలంగాణ తల్లి ఆకృతిని రూపొందించామని వారు వివరించారు. పనికి వెళ్లే పోరాటంలో భాగంగా మహిళ కొంగును నడుముకు చుట్టుకుంటుందని చెప్పారు.
తెలంగాణ తల్లి అభయహస్తం
తెలంగాణ సాధారణ మూతృమూర్తిలా, తెలంగాణ ఉద్యమంలో నడుం బిగించిన మహిళల రూపాన్నితీర్చిదిద్దారు. మెడలో కంటె, బంగారు గొలుసు,చేతికి ఆకుపచ్చ గాజులు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు,ఏడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు, కుడి చేత్తో అభయహస్తం, కొంగు ముడితో ఆకుపచ్చని చీర, తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్గాల భాగస్వామ్యానికి గుర్తుగా విగ్రహ పీఠంలో పిడికిళ్లతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే భావనతో... తెలంగాణ ఆకుపచ్చగా సుభిక్షంగా ఉండాలనే భావనతో సీఎం సూచనపై ఆకుపచ్చ రంగు చీరను తెలంగాణ తల్లికి రూపొందించామన్నారు.నెలరోజుల పాటు వంద మంది శ్రమించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని విగ్రహరూపకర్తలు చెప్పారు. ఆకృతి గీసిన తర్వాత కాంస్య విగ్రహం తయారీకి నెలన్నర రోజుల సమయం పట్టింది. బెంజ్, బీఎండబ్ల్యూ కార్లకు వాడే రంగులు వేశామని వారు పేర్కొన్నారు.
విగ్రహ రూపం మార్చడం మూర్ఖత్వం
తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది : నందిని సిధారెడ్డి
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినందు వల్ల తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలో రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సర్వమతాల సహజీవనానికి గుర్తుగా ఉన్న కాకతీయ తోరణం, సామరస్యానికి ప్రతీక అయిన చార్మినార్, పాలపిట్ట, జమ్మిచెట్టు తొలగించారని ఆయన చెప్పారు.ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కాదని కుడి చేయిని అభయహస్తంగా, రాజకీయ సంకేతంగా చూపింంచారని నందిని సిధారెడ్డి ఆరోపించారు. అభయ హస్తం ముద్రలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించమని ఆయన ప్రకటించారు.