Telangana|విభజన హామీల అమలుకు కేంద్రమంత్రుల చుట్టూ సీఎం ప్రదక్షిణలు
x

Telangana|విభజన హామీల అమలుకు కేంద్రమంత్రుల చుట్టూ సీఎం ప్రదక్షిణలు

తెలంగాణకు రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్ఛలేదు.రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రప్రభుత్వంపై తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు.

- రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామి ప్రకారం తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ సీఎం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి హస్తిన పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలిసి వారికి వినతిపత్రాలు సమర్పించారు.

- వివిధ శాఖల వారీగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి సీఎం కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా విభజన చట్టం హామీలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు.

- కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులను విడుదల చేయాలని సీఎం విన్నవించారు.

రూ.1800కోట్ల గ్రాంటు విడుదలకు వినతి

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కు విజ్ఞ‌ప్తి చేశారు. 9 జిల్లాలకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు గతంలో కేంద్ర ప్రభుత్వం అంగీక‌రించిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చి, ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.




ఏపీ నుంచి రూ.408 కోట్లు ఇప్పించండి

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌, లోకాయుక్త‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఇత‌ర ఉమ్మ‌డి సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌ను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రించిన విషయాన్ని సీఎం రేవంత్ ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సంస్థ‌ల విభ‌జ‌న పూర్త‌య్యే వ‌ర‌కు నిర్వ‌హ‌ణ‌కు రూ.703.43 కోట్ల‌ను తెలంగాణ భ‌రించింద‌ని, అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాటా కింద రూ.408.49 కోట్ల‌ను తెలంగాణ‌కు చెల్లించాల్సి ఉంద‌ని చెప్పారు. ఆ మొత్తం చెల్లించడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ్మ‌తి తెలిపినప్పటికీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ సైతం ఏపీకి లేఖ‌లు రాసినట్టు గుర్తుచేశారు.వ‌డ్డీతో స‌హా ఆ మొత్తం తెలంగాణ‌కు చెల్లించేలా కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని సీఎం కోరారు.

ప్రాజెక్టుల నిధులివ్వండి

ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ ఆర్థిక స‌హాయంతో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు సంబంధించి ఏపీ, తెలంగాణల మ‌ధ్య రుణాల పంపిణీ విష‌యంలో తెలంగాణ నుంచి రూ.2,547.07 కోట్ల రిక‌వ‌రీకి కేంద్రం ఏక‌ప‌క్షంగా ఆదేశాలు ఇచ్చింద‌ని, ఆ విష‌యంపై మ‌రోసారి స‌మీక్షించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీఎం కోరారు.2014-15 లో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌కు సంబంధించిన నిధుల‌ను కేంద్రం కేవలం ఏపీకి మాత్రమే కేటాయించిందని సీఎం గుర్తుచేశారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణ‌కు రూ.495.20 కోట్లు స‌ర్దుబాటు చేయాల్సి ఉంద‌ని, నిధులు ఇప్పించేలా ఆ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.

కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పండి

కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు విజ్ఞ‌ప్తి చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.ఢిల్లీలో రాష్ట్ర ఎంపీలతో కలిసి సీఎంగారు అశ్వనీ వైష్ణవ్ గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులపై వినతిపత్రాన్ని అందజేశారు.రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటును పేర్కొన్న విష‌యాన్ని ప్రస్తావించారు. కాజీపేట‌లో పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ (పీవోహెచ్‌) వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింద‌ని గుర్తుచేస్తూ ఆ త‌ర్వాత కూడా కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశాన‌ని చెప్పారు.

రైల్వే కొత్త లైన్లు నిర్మించండి

వికారాబాద్‌ - కృష్ణా స్టేష‌న్ ల మ‌ధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్య‌యంతో నూత‌న రైలు మార్గం నిర్మించాల‌ని, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య రవాణాకు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. ఆ మార్గం నిర్మిస్తే ద‌క్షిణ తెలంగాణ‌లో మారుమూల‌ వెనుక‌బ‌డిన ప‌రిగి, కొడంగ‌ల్‌ తదితర ప్రాంతాలన్నీ సిమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు అభివృద్దికి అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు.క‌ల్వ‌కుర్తి-మాచ‌ర్ల మ‌ధ్య నూత‌న రైలు మార్గం మంజూరు చేయాల‌ని సీఎం కోరారు. క‌ల్వ‌కుర్తి నుంచి వంగూరు-కందుకూరు-దేవ‌ర‌కొండ‌-చ‌ల‌కుర్తి-తిరుమ‌ల‌గిరి మీదుగా మాచ‌ర్ల వ‌ర‌కు తాము ప్ర‌తిపాదించే నూతన మార్గం ప్ర‌తిపాదిత గ‌ద్వాల‌-డోర్న‌క‌ల్‌, ఇప్ప‌టికే ఉన్న మాచ‌ర్ల మార్గాల‌ను అనుసంధానిస్తుంద‌ని సీఎం వివ‌రించారు.డోర్న‌క‌ల్‌-మిర్యాల‌గూడ (పాప‌ట‌ప‌ల్లి-జాన్ ప‌హాడ్‌), డోర్న‌క‌ల్‌-గ‌ద్వాల ప్ర‌తిపాదిత రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు మార్గాల అలైన్‌మెంట్‌ను పునఃప‌రిశీలించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

రీజిన‌ల్ రింగు రోడ్డుకు అనుమతివ్వండి

తెలంగాణ మణిహారంగా చేపడుతున్న159 కి.మీ.రీజిన‌ల్ రింగు రోడ్డు ఉత్త‌ర భాగానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్రజాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో స‌మావేశ‌మై రాష్ట్రానికి సంబంధించి పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను తెలియజేసి సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగాన్ని 161 AA జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించింద‌ని చెప్పారు.

నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి

ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీట‌ర్ల దూరం జాతీయ ర‌హ‌దారుల ప్ర‌మాణాలతో ఉంద‌ని, మిగిలిన 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో ఉంద‌ని. ఆ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైద‌రాబాద్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించే ప‌నుల డీపీఆర్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు.తెలంగాణ‌లోని రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాలన్నారు. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్‌-63 (16) వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల మ‌ధ్య‌గా వెళుతోంద‌ని, ఈ ర‌హ‌దారిని న‌గ‌రం వెలుప‌ల నుంచి నాలుగు చోట్ల క‌లుపుతూ బైపాస్ మంజూరు చేయాల‌ని కోరారు.

పర్వత్ మాల ప్రాజెక్ట్ మంజూరుకు వినతి

పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డికోరారు.గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాల‌ని, న‌ల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించండి

తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి ఇటీవ‌ల రాష్ట్రానికి ఏడు న‌వోద‌య విద్యాల‌యాలు కేటాయించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.అదే స‌మ‌యంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాల‌యం కూడా కేటాయించ‌లేద‌ని, కేంద్రియ విద్యాల‌యాల‌తో పాటు నవోద‌య పాఠ‌శాల‌లు లేని జిల్లాల‌కు వాటిని కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.




తెలంగాణ అభివృద్ధికి మద్ధతు ఇవ్వండి

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కృషి చేయాల‌ని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌), హైద‌రాబాద్ మెట్రో ఫేజ్- 2 తోపాటు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ల్లో సీవ‌రేజీ, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌, సింగ‌రేణి సంస్థ‌కు బొగ్గు గ‌నుల కేటాయింపు స‌హా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు.సీఎం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు అందించారు. ఈ సంద‌ర్భంగా మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 2022లోనే ప్ర‌క‌టించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, రాయ‌దుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్‌, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మియాపూర్‌-ప‌టాన్ చెరు, ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ మ‌ధ్య మొత్తం 76.4 కి.మీల నిర్మించ‌నున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దాన్ని చేప్ట‌టేందుకు స‌హ‌క‌రించాల‌న్నారు.

మూసీ ప్రాజెక్టుకు భూమి బదలాయించండి

మూసీరివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని 222.27 ఎక‌రాల భూమి రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ను ఇప్ప‌టికే కోరిన విష‌యాన్ని కిష‌న్ రెడ్డి దృష్టికి తెస్తూ ఆ విషయంలో చొరవ చూపాలని, మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల విషయంలో సహకారాన్ని కోరారు.తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ లో అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూప‌క‌ల్ప‌న చేశామని, రూ.4,170 కోట్ల వ్య‌య‌మ‌య్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదా ప్ర‌త్యేక ప‌థ‌కం కింద చేప‌ట్టాల‌ని కోరారు.దీర్ఘ‌కాలం పాటు సింగ‌రేణి సంస్థ మ‌నుగ‌డ కొన‌సాగించేందుకు గానూ గోదావ‌రి లోయ ప‌రిధిలోని బొగ్గు బ్లాక్‌ల‌ను సింగ‌రేణికి కేటాయించాల‌ని కోరారు. తెలంగాణ‌ను సెమీకండ‌క్ట‌ర్ మిష‌న్ లో చేర్చాల‌ని విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story