పౌరహక్కుల నేత గొర్రెపాటి మాధవరావు మృతి
పౌర హక్కుల సంఘం నాయకుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు డిసెంబర్28, 2024న నిజామాబాదులో మరణించారు.
పౌర హక్కుల సంఘం నాయకుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు డిసెంబర్28, 2024న తెలంగాణలోని నిజామాబాదులో మరణించారు. ఆయన వయస్సు 67 ఏళ్లు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న గొర్రెపాటి మాధవ రావు పలు ప్రజాస్వామిక పోరాటాలలో పాల్గొన్నారు. న్యాయవాదిగా పౌరుల హక్కులకు భంగం వాటిల్లినపుడు గొంతెత్తారు. వామపక్ష అభిమానిగా పేరున్న మాధవరావు గతంలో అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యం పేరిట నియంత్రత్వం పోకడలు సరికాదని వాదించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్సీ)లో క్రియాశీలకంగా పని చేశారు. ప్రముఖ పౌరహక్కుల సంఘం నాయకుడు బాలగోపాల్ ఏపీసీఎల్సీతో విభేదించి బయటికి వచ్చి మానవ హక్కుల వేదిక ఏర్పాటు చేసినపుడు మాధవరావు కూడా అందులో చేరారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన చురుగ్గా పని చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో కొలువులకై కొట్లాట సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జీ, అరెస్టుల సమయంలో ఆయన పోలీసుల తీరును విమర్శిస్తూ ఘాటైన పదజాలంతో వేసిన కరపత్రం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.
మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా ఉరిశిక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సదస్సులు, సెమినార్లు నిర్వహించారు. రాజ్యంగం కల్పించిన బతికేహక్కు కోసం పోరాడారు. ఉరిశిక్షను జ్యుడిషియల్ మర్డర్ గా అభివర్ణించేవారు.
1983లో సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మాధవరావు నిజమాబాద్ లోని ఎల్లమ్మగుట్టలో ఉంటున్నారు. ఆయన మంచి చదువరి. వేలాది పుస్తకాలతో మంచి గ్రంథాలయం ఉంది. కొంతకాలం కిందట ఆయన తన కుమార్తెకు అతినిరాడంబరంగా వివాహం చేశారు.
అటువంటి మాధవరావు మరణం పట్ల ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంతిమ యాత్ర డిసెంబర్ 29న జరుగుతుంది. ఆయన భౌతికఖాయాన్ని ఆదివారం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల వారికి విద్యార్థుల పరిశోధనల కోసం అందజేస్తారు. ఆయన కళ్లను లయన్స్ క్లబ్ వారికి దానం చేశారు.
గొర్రెపాటి మాధవరావు వృత్తి, ప్రవృత్తి రీత్యా న్యాయవాది అయినా మంచి రచయిత కూడా. పదునైన కళాత్మక వాక్య నిర్మాణం, స్పష్టమైన మానవీయ దృక్పథం ఉన్న రచయిత. రాగద్వేషాలకి అతీతంగా ప్రేమాస్పదులై ఉంటారు అనడానికి ఉదాహరణ గొర్రెపాటి మాధవరావు అని ఆయన మిత్రుడు, రైతు ఉద్యమ నేత కన్నెగంటి రవి అన్నారు.
గొర్రెపాటి మాధవరావు అంతరంగాన్ని ఆయన రచనలు ప్రతిబింబిస్తాయి. ఆయన రాసిన కవితల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ వచన కవిత ఇది. అర్థం లేనిదే ప్రేమ అనే శీర్షికన ఆయన దాన్ని రాశారు. ఇలా సాగుతుంది.
ఓసారి రాధ కృష్ణుణ్ణి అడిగిందట..
కృష్ణా కోపం అంటే ఏమిటి అని.
వేరేవాళ్ళ తప్పుకి శిక్షను మనకి మనమే విధించుకోవడం అని
రాధ మరో ప్రశ్న వేసింది:
ప్రేమకీ స్నేహానికీ తేడా ఏమిటీ అని
ప్రేమ బంగారం అయితే స్నేహం వజ్రం అని కృష్ణుడి జవాబు
అదెలా అని అడిగిన రాధతో కృష్ణుడు అంటాడూ:
బంగారం ముక్కలయినా దానికి పూర్వ రూపం ఇవ్వొచ్చు,
వజ్రం ముక్కలైతే ఇక అంతే.
రాధ ఆడుతోంది: కృష్ణా నేను ఎక్కడెక్కడ ఉన్నాను?
కృష్ణుడు చెబుతున్నాడు: నా మనసులో, నా మాటలో, నా మురళిలో, నా గానం లో, నా హృదయ లయలో . ఇన్నేల నా తనువూ మనసూ సమస్తమూ నీవే రాధా
రాధకి ఓ డౌట్ వచ్చింది.
అయితే కృష్ణా మరి నేను లేనిది ఎక్కడ?
నిట్టూరుస్తూ కృష్ణుడు అన్నాడు:
నా విధి రాతలో.
అయితే కృష్ణా ప్రేమకు అసలు అర్థం? ఏమిటంది రాధ
అర్థమే ఉండేదయితే అది ప్రేమ ఎలా అవుతుంది? ఎందుకవుతుంది? అన్నాడు కృష్ణుడు
(ఎక్కడో ఎప్పుడో విన్న దానికి అక్షర రూపం)
....గొర్రెపాటి మాధవరావు
Next Story