చొప్పదండి ఎమ్మెల్యే భార్య సూసైడ్
x

చొప్పదండి ఎమ్మెల్యే భార్య సూసైడ్

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట తీవ్ర విషాదం నెలకొంది.


చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య ఆత్మహత్య చేసుకుని మరణించారు. గురువారం సాయంత్రం అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో సత్యం భార్య రూపాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఈ విషయం అర్థరాత్రి వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గత కొన్నేళ్లుగా ఉన్న విబేధాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబసభ్యుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. రూపాదేవి మృతిపై కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

12 ఏళ్ళ క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు, కూతురుని పట్టుకుని ఎమ్మెల్యే సత్యం బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. విగతజీవిగా పడిఉన్న భార్య మృతదేహం చూసి రోదిస్తూ సత్యం స్పృహ కోల్పోయారు. దీంతో అనుచరులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

అయితే, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య రూపాదేవి వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం అల్వాల్ నుంచి ఆయన చొప్పదండికి వెళ్లారు. సాయంత్రం సమయంలో రూపాదేవి ఆయనకి వీడియో కాల్ చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నాని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆమెని వారించి వెంటనే అల్వాల్ కి బయలుదేరారు. కానీ, ఆయన వచ్చేసరికే రూపాదేవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె సూసైడ్ వార్త ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య కావడంతో ఆత్మహత్య కేసు చర్చనీయంశంగా మారింది. ఆమె ఆత్మహత్య కి కారణం ఏమై ఉండొచ్చు అనే విషయం చర్చలకు దారి తీస్తోంది.

కాగా, చొప్పదండి ఎమ్మెల్యేకి భార్యావియోగం పట్ల పలువురు ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేని పరామర్శించారు.

Read More
Next Story