బాలికల హాస్టళ్లలో తనిఖీలతో హడలెత్తిస్తున్న మహిళా కమిషన్ ఛైర్మన్
x

బాలికల హాస్టళ్లలో తనిఖీలతో హడలెత్తిస్తున్న మహిళా కమిషన్ ఛైర్మన్

బాలికల కాలేజీ హాస్టళ్లలో వరుస తనిఖీలతో మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద హడలెత్తిస్తున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నివేదికను సీఎంకు సమర్పించారు.


హైదరాబాద్ నగరంలోని చైతన్య, నారాయణ మహిళా కళాశాలలు, బాలికల హాస్టళ్లలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద వరుస ఆకస్మిక తనిఖీలు చేశారు.

- లక్షలాది రూపాయలను ఫీజులు, హాస్టళ్ల ఖర్చుల పేరిట వసూలు చేసి విద్యార్థినులకు అసౌకర్యాల మధ్య కళాశాలలు నడుపుతున్న చైతన్య, నారాయణ కళాశాలల నిర్వాహకులపై శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కళాశాల విద్యార్థినులు తమ పాఠశాలల్లోని అసౌకర్యాలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద వరుస తనిఖీలు చేపట్టారు.

నారాయణ కాలేజీలో దుస్ధితి
బాచుపల్లిలోని నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద అసౌకర్యాలను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కళాశాల హాస్టల్ భవనంలో లీకేజీలు.దుర్గంధం వెదజల్లుతున్న వాష్ రూమ్స్,విరిగిన డోర్స్, మగ్గులు లేని బాత్ రూంలను చూసిన శారద దీనిపై హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు.ఇలా ఉంటే రోగాలు రావా అని నిర్వాహకులను ప్రశ్నించారు. ఏమిటీ రూములు, డోర్స్ లేవు, లాక్స్ లేవు, వాటర్ కూడా పోవు, వాష్ రూం వాటర్ లీకేజీలు, మనుషులు ఉండే స్థలమేనా అని శారద ప్రశ్నించారు.సరిగా వండని అన్నం పెడుతున్నారు, ఈ భోజనం ఎలా జీర్ణమవుతుందని ఆమె అడిగారు.

ఈ బ్రాంచి విద్యార్థినులను మరో బ్రాంచీకి మార్చండి
బాచుపల్లి బ్రాంచి నుంచి ఇంకో బ్రాంచికి విద్యార్థినులను వెంటనే మార్చేయాలని మహిళా కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద ఆదేశించారు. ‘‘ మీకు ఏ సమస్య ఉన్నా నాకు కాల్ చేయండి, ఫిర్యాదు చేశారని ఎవరైనా వేధించినా నాకు సమాచారమివ్వండి’’ అంటూ శారద విద్యార్థినులను తన ఫోన్ నంబరు చెప్పారు. ఉమెన్ కమిషన్ ఫిర్యాదు నంబరు 9490555533 లేదా 181 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె విద్యార్థినులకు సూచించారు.

విద్యార్థినుల ఫిర్యాదులపై...
గత కొన్ని రోజులుగా నారాయణ కాలేజీలో సమస్యల పట్ల పలు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద బాచుపల్లి లోని నారాయణ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్, హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .

విద్యార్థినుల ఫిర్యాదు
తమ నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి వసతులు లేకుండా హాస్టళ్లు నడుపుతున్నారని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. అసౌకర్యాల మధ్య నడుపుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరారు.ప్రైవేటు కాలేజీ హాస్టళ్లే కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను కూడా తనిఖీలు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు.గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబంధించిన సమస్యలు పలు మీడియాలో రావడం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు.

శ్రీ చైతన్య కళాశాలకు సమన్లు
శ్రీచైతన్య యాజమాన్యానికి మహిళా కమిషన్ సమన్లు పంపింది. పిల్లల భద్రత పైన రాజీపడే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదు అని ఈ సందర్భంగా శారద చెప్పారు.మీరు ఎలా ఉన్నారని విద్యార్థినులతో శారద ప్రశ్నించారు. హాస్టల్ గదులను చూశారు. ఈ హాస్టల్ జైలులాగా ఉందని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. వెలుతురు, గాలి రాదు. ఒక్క రూంలో అన్నీ బెడ్స్ వేసి ఉంచుతారా? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా? లీకేజీలు ఏమిటీ? నేను టోటల్ సమాచారంతో వచ్చాను నేను ఊరకే రాలేదు. పైనుంచి కూరల్లో నీళ్లు పడుతున్నాయి. రెండు రోజులు పిల్లల్ని రూంలో వేసి లాక్ చేశారు ఎందుకని శారద ప్రశ్నించారు.తెలంగాణ లోని అమ్మాయిలు ఈ కాలేజీల పేరిట అనారోగ్యాల పాలవుతున్నారని ఆమె చెప్పారు. లక్షలు పోసి చేర్పించి మన పిల్లల్ని మనమే చంపుకుంటున్నామని శారద ఆవేదన వ్యక్తం చేశారు.


Read More
Next Story