
Mallu Ravi, Congress leader
మల్లు రవికి సెంట్రల్ 'వర్శిటీ స్టూడెంట్స్ సవాల్!
మానుతున్న గాయాన్ని మల్లు రవి మళ్లీ రేపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విద్యార్థులు పోరుబాట పట్టేలా చేశారు.
(యం.వి.రామారావు)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూ వివాదం రోజురోజుకు జటిలం అవుతోంది. కాంగ్రెస్ నేత మల్లు రవి విద్యార్థుల ఉద్యమం రాజకీయ కుట్రగా అభివర్ణించడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ భూమిని వదులుకోమని స్పష్టం చేసారు. యూనివర్సిటీ లో ఉద్యమం చేసేవారు ఉత్తరాదివారని , వీరిలో తెలంగాణ విద్యార్థులు లేరనడం ఈ వివాదం మరింత వెడేక్కింది.
ఆయన మరో సంచలనం ప్రకటన చేసారు. ప్రభుత్వ భూమిని అడ్డుకుంటే అవసరమైతే యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని, ఇక్కడ 2000 ఎకరాల్లో ఎకోపార్కు ఏర్పాటు చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యలతో మరో ఉద్యమం తల ఎత్తే అవకాశం ఉంది. కేవలం పర్యావరణం కాపాడాలని విద్యార్ధులు ఉద్యమం చేస్తున్నారు. మల్లు రవి వ్యాఖ్యలతో పర్యావరణ ఉద్యమం కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది.
ఇందిరాగాంధీ హయాంలో హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసారు. రాజ్యాంగసవరణ చేసి మరీ బహుమతిగా ఇస్తున్నట్లు జీవో జారీ చేసారు. దానికి దాదాపు 2400 ఎకరాలు కేటాయించారు. కాని యూనివర్సిటీ అధికారులు అప్పటి నుంచి అధికారికంగా యాజమాన్య హక్కుకోసం మ్యుటేషన్ చేయించుకోలేదు.

యూనివర్సిటీలో దేశంలోని ఏ ప్రాంతం విద్యార్ధులైనా చేరే అవకాశం కల్పించింది. ప్రభుత్వం కేటాయించగానే యూనివర్సిటీ వెంటనే కాంపౌండ్ వాల్ కట్టింది. అప్పటినుంచి కాంపౌండింగ్ లోపల ఉన్న భూమి ప్రభుత్వానిదని ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తరువాత కాంపౌండ్ లోపలే అనేక అకడమిక్ సంస్ధలకు భూమి కేటాయించింది. బాలయోగి స్టేడియం,ట్రిపుల్ ఐటి, రెడ్డీలాబ్స్, ఆర్టీసీ డిపో తదితర సంస్థలు యూనివర్సిటీ స్థలంలోపల స్థాపించారు.
ఢిల్లీరావుకు భూమి ఎందుకిచ్చారు...
2004 ప్రాంతంలో చంద్రబాబు హయాంలో ఢిల్లీ రావుకు టీడీపీ ప్రభుత్వం 400 ఎకరాలు తక్కువ ధరకు అమ్మింది. దానికి ప్రత్యామ్నాయంగా మరో భూమి కూడా కేటాయించారని తెలిసింది. చాలా కాలం ఢిల్లీ రావు ఏమి పనులు చేయలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమి స్వాధీనం చేయాలని కోర్టుకు వెళ్ళారు. తక్కువ ధరకు భూమి అమ్మారని పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ భూమి గా 400 ఎకరాలను నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దాంతో ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున యంత్రాలతో చెట్లు కొట్టడం ప్రారంభించింది. దాంతో అక్కడ ఉన్న జంతువులు చనిపోతున్నాయి. ఇది పర్యావరణానికి హాని అని విద్యార్థులు ఉద్యమం ప్రారంభించి ప్రభుత్వానికి అడ్డు పడ్డారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు పర్యావరణాన్ని కాపాడతానని చెప్పిన రేవంత్ ఇలా చేయడమేమిటని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. దాంతో ప్రభుత్వం మంత్రివర్గ కమిటీ వేసింది. అయినా వేడి చల్లారలేదు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ NSUI తదితర విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్ధులకు ఇది ప్రభుత్వ భూమి, కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. ఇంతలో మల్లురవి ప్రకటన తో వివాదం మళ్లీ రగిలింది. యూనివర్సిటీని తరలిస్తామని చేసిన ప్రకటన విద్యార్థులలో ఆగ్రహం రేపింది. ఇప్పుడు విద్యార్ధుల ఉద్యమంలో ఉత్తరాది విద్యార్థులే ఉన్నారని మల్లు రవి వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇది కాంగ్రెస్సేతర పార్టీలకు అవకాశం ఇచ్చినట్లయింది.
రేవంత్ సర్కార్ 400 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మొదట ఈ భూమిని వాణిజ్యపరంగా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. కాని అలాచేస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని అన్ని వర్గాలు ఖండించడంతో ఎకో పార్కు నిర్మిస్తామని మాట మార్చింది. అవసరమైతే ప్రస్తుతం ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ 1600 ఎకరాల్లో సహా 2000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఎకో పార్కు నిర్మిస్తామని మాట మార్చింది. ఇప్పటికే బొంబాయి బేస్డ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం లోన్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం యూనివర్సిటీని ఫ్యూచర్ సీటీకి తరలిస్తామంటోంది. 50ఏళ్లుగా యూనివర్సిటీ కి కావలసిన నిర్మాణాలు, సదుపాయాలు సమకూర్చుకుని విద్యార్థులకు అందుబాటులో ఉన్నదాన్ని మార్చడం సాధ్యమవుతుందా, మళ్లీ పునర్నిర్మాణం పూర్తికావడానికి ఎంత కాలం పడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు విద్యార్థులు దీన్ని తరలించడాన్ని ఒప్పుకుంటారా,ఇది మరో మహోద్యమంగా మారినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ అధిష్టానం కల్పించుకుని రేవంత్ రెడ్డిని ఈ భూమి వ్యవహారంలో కొంతకాలం దూరంగా ఉండమని, విద్యార్ధులతో వివాదం వద్దని నచ్చచెప్పగలిగితే చల్లారే అవకాశం ఉంది. పట్టుదలకు పోతే విద్యార్థుల ఉద్యమం ఎలా మలుపుతిరుగుతుందో ఊహించలేం. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్ధుల పాత్ర మరచిపోరాదు. ఆ అనుభవంతోనైనా ఈ భూమి వివాదం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని. లేకపోతే ప్రభుత్వానికి తిప్పలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
(రచయిత సీనియర్ జర్నలిస్టు, మొబైల్ 8074129668)
Next Story