మైన్స్ వేలం వేయండి.. తెలంగాణకి కేంద్రం డెడ్ లైన్
x

మైన్స్ వేలం వేయండి.. తెలంగాణకి కేంద్రం డెడ్ లైన్

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డెడ్ లైన్ ఇచ్చింది. మైన్స్ వేలం వేయాలని సూచించింది. లేదంటే మేమే రంగంలోకి దిగాల్సి ఉంటుందని లేఖ ద్వారా హెచ్చరించింది.


కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డెడ్ లైన్ ఇచ్చింది. జూన్ 30 వరకు మైన్స్ వేలం వేయాలని సూచించింది. లేదంటే మేమే రంగంలోకి దిగాల్సి ఉంటుందని లేఖ ద్వారా హెచ్చరించింది. తొమ్మిదేళ్ల నుండి తెలంగాణ ప్రభుత్వం కనీసం ఒక్క మినరల్ బ్లాక్ కి కూడా ఆక్షన్ నిర్వహించలేదని కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. జూన్ 30 వరకు కనీసం ఆరు బ్లాకులైనా వేలం వేయాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వానికి 11 బ్లాకుల జియలాజికల్ రిపోర్ట్ పంపినట్లు ఆధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, వీటిలో ఐదు ఇనుప ఖనిజం బ్లాకులు, ఐదు సున్నపురాయి బ్లాకులు, ఒక మాంగనీస్ బ్లాకు ఉన్నట్లు పేర్కొన్నాయి.

అయితే కేంద్ర గనుల శాఖ తెలంగాణ ప్రభుత్వానికి పలుసార్లు వేలం వేయమని గుర్తు చేసినప్పటికీ ఒక్క బ్లాకుని కూడా వేయలేదు. దీంతో జూన్ నెలాఖరులోగా కనీసం ఆరు బ్లాకులకు ఆక్షన్ నిర్వహించాలని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సూచించింది. అలా జరగకుంటే ఆ ప్రక్రియను కేంద్రమే నిర్వహిస్తుందని లేఖలో వార్నింగ్ ఇచ్చింది.

కాగా, 2015లో మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. 2021లో నిబంధనలు సవరించగా... ఆ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన డెడ్ లైన్ లోపు వేలం ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయనట్లయితే వేలం నిర్వహించే అధికారం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశంలోని 354 ప్రధాన మినరల్ బ్లాకులను వేలం వేశారు. 48 చోట్ల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం పెరిగింది.

తెలంగాణలో మేజర్, మైనర్ మినరల్ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఈమధ్యనే వెల్లడించాయి. ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలిపాయి. ఇందులో 3 సున్నపురాయి బ్లాకులు కాగా, మరో 12 చిన్నతరహా ఖనిజాలని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనుల్ని 20 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం.

Read More
Next Story