రెండు రాష్ట్రాలను కదిలించిన సోషల్ మీడియా పోస్ట్
x

రెండు రాష్ట్రాలను కదిలించిన సోషల్ మీడియా పోస్ట్

ఓ సంఘటన సోషల్ మీడియాలో పెను దుమారంగా మారింది. సీఎం, మంత్రులను సైతం స్పందించేలా చేసింది.


ఓ సంఘటన సోషల్ మీడియాలో పెను దుమారంగా మారింది. సీఎం, మంత్రులను సైతం స్పందించేలా చేసింది. ఉభయ రాష్ట్రాల పోలీసు శాఖను రంగంలోకి దించింది. అసలు విషయం ఏంటంటే... తెలుగులో ప్రముఖ యూట్యూబర్ డార్క్ కామెడీ పేరుతో.. ఇతర యూట్యూబర్లతో కలిసి లైవ్ షో చేస్తూ... సినిమాల రివ్యూలు, ప్రముఖుల వీడియోలపైనా, చిన్న పిల్లల వీడియోలపైనా అసభ్య కామెంట్స్ చేస్తుంటాడు. ఆ గ్యాంగ్ పనంతా అదే. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఇతరుల హ్యాండిల్స్ లో అసభ్య కామెంట్స్ పెడుతుంటాడు.

రెండు రోజుల క్రితం ఓ నెటిజెన్ తండ్రీకూతుళ్ల రిలేషన్ పై దిగజారుడు కామెంట్స్ చేస్తున్నారని, చైల్డ్ అబ్యూజ్ చేస్తూ డార్క్ కామెడీ అంటున్నారని... వీడియో క్లిపింగ్స్ షేర్ చేస్తూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సాయి ధరమ్ తేజ్.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగురాష్ట్రాల సీఎం లను, డిప్యూటీ సీఎం లను, ఇతర మంత్రులను, పోలీసు అధికారులను కోరారు.

ఆయనతో పాటు పలువురు సెలెబ్రిటీలు, జర్నలిస్టులు, ప్రముఖులు, సామాన్యులు గళం విప్పారు. ఆ యూట్యూబర్ అలాగే వీడియో లో ఉన్న ఇతర సభ్యులపైనా యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్స్ లేవనెత్తారు. రెండు రాష్ట్రాల్లోనూ లిఖితపూర్వక ఫిర్యాదులు, ఆన్లైన్ ఫిర్యాదులు చేశారు. చిన్నపిల్లలపై సెక్సువల్ జోక్స్ చేయడం చిన్న విషయం కాదని, వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ సదరు యూట్యూబర్ ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు కావడంతో.. ఎవరూ ఏం చేయలేరనే ధైర్యంతోనే ఇలాంటి వీడియోలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా, సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, పోలీసు అధికారులు స్పందించారు. తమ ప్రభుత్వంలో పౌరులకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని, అందులోను చిన్నపిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతోపాటు సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు సాయి ధరమ్ తేజ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, క్షుణ్ణంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ డీజీపీ కూడా స్పష్టం చేశారు.

Read More
Next Story