
Car Accident | చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద శనివారం కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఐదుగురు యువకులు మరణించారు.
యాదాద్రి జిల్లా జలాల్ పూర్ దగ్గర కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతి చెందడంతో విషాదం అలముకుంది. శుక్రవారం రాత్రి ఆరుగురు యువకులు కారులో బయలుదేరగా, కారు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే చెరువులోకి దూసుకెళ్లిందని చెబుతున్నారు.
- హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఎల్బీనగర్ కు చెందిన వంశీ (23), దిగ్నేశ్ (21), హర్ష (21), బాలు (19), వినయ్ (21)లుగా గుర్తించారు. కారులో ఉన్న మణికంఠ యాదవ్ కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
- పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కారును కూడా చెరువు నుంచి బయటకు లాగారు.జలాల్ పూర్ మలుపు వద్ద సూచిక ఏర్పాటు చేయక పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చేశారు.గ్రామస్థుల నిరసనతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
- ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా యువకులే కావడం అందరినీ కలిచివేసింది. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో సంఘటన స్థలం మార్మోగింది. మద్యం తాగడం, అతివేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
Next Story