ఉదయం కవితకు శుభాకాంక్షలు, సాయంత్రం కాంగ్రెస్ కండువా
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. జూబిలీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 21 న తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన చేరికపై చర్యలకు సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతున్నవేళ నిన్న రాత్రి 11 గంటల సమయంలో సంజయ్ సైలెంట్ గా కాంగ్రెస్ లో చేరిపోయారు.
అయితే ఆదివారం మధ్యానమే ఆయన "మాజీ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనిల్ బావ గార్లకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు" అంటూ ట్విట్టర్ వేదికగా కవితకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ గెలుపుకోసం తీవ్ర ఎండలో సన్ స్ట్రోక్ బారిన పడినా కూడా కవిత ప్రచారం చేశారు. కవిత జైల్లో ఉండగా శుభాకాంక్షలు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా పార్టీ ఫిరాయించడం మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణిస్తున్నారు. ఆయన పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్..
తెలంగాణలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహ రచనలు చేస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపినట్టు తెలుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఎన్నికలపైనే కాంగ్రెస్ నేతలు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఎలక్షన్స్ పూర్తయ్యాయి. డబుల్ డిజిట్ రానప్పటికీ గత రెండు లోక్ సభ ఎన్నికలకంటే ఈసారి హస్తం పార్టీ బాగా పుంజుకుంది. మరోవైపు బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లోనూ పార్టీలో భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లాయని చెప్పొచ్చు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునే పనిలో ఉన్న కాంగ్రెస్ అసంతృప్త నేతలను తమవైపుకు తిప్పుకుంటోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ లను పార్టీలో చేర్చుకున్నట్లు స్పష్టం అవుతోంది.
కేసీఆర్ నేర్పిందే కదా..!!
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో పార్టీ మారడం సిగ్గుచేటు అంటూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరడానికి వీల్లేదంటూ పోచారం ఇంటివద్ద బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, కే వాసుదేవ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, ఇతర నాయకులు ఆందోళన కూడా చేశారు. "కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ నాయకులు పార్టీ మారితే డిస్ క్వాలిఫై చేయమంటారు, కానీ అదే పని వాళ్ళు తెలంగాణలో చేసి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు" అని కేటీఆర్ ట్వీట్ ద్వారా విమర్శలు గుప్పించారు. మళ్ళీ ఐదేళ్ళలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, అప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సరైన గుణపాఠం ఉంటుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కాగా, వీరి విమర్శలకు కాంగ్రెస్ కూడా పదునుగానే కౌంటర్ ఇస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేశాడో గుర్తు లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నవారంతా టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ నుండి మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడంతో టీడీఎల్పీని ఆ పార్టీలో విలీనం చేసినట్లు అయింది. వైసీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు సైతం కారు పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తమ నేతలని లాక్కుంటోందంటూ ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి సింపతీ దక్కడం లేదు.
వరుసగా పార్టీ మారుతోన్న నేతలు...
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను వీడిన తొలి ఎమ్మెల్యే ఈయనే. ఆపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హస్తం గూటికి వెళ్లి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంటు ఎన్నికల ముందు పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరిలో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా కడియం శ్రీహరి, కడియం కావ్య ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపొందారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేత బీఆర్ఎస్ ను వీడగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.