బీఆర్ఎస్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్
x

బీఆర్ఎస్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్

రైతులకు అండగా ఉండటమే బీఆర్ఎస్ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. రైతాంగంతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తామని చెప్పారు.


బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త నిర్వచనం చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా అని అన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన రైతన్నలు ఆత్మహత్యే తమకు అంతిమ పరిష్కారం అనుకుంటున్నారని, కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతన్నలను ఈ ప్రభుత్వం రోడ్డు పాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం భేటీ అయింది. ఈ భేటీ అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతోపాటు మిగిలిన రైతన్నల్లో కూడా ఆత్మవివ్వాసం నింపడంం కోసం శుక్రవారం నుంచి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఛైర్మన్‌గా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్రంలో 2023 వరకు ఉన్న పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తుందని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా చేసిందని, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయతో చెరువుల బాగు వంటి అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం కోసం కాళేశ్వరం, సీతారామ, పాలమూరు వంటి ప్రాజెక్ట్‌లను నిర్మించామని అన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించే రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చామని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రైతున్నలను నానా అవస్థలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేవారు.

రైతాంగానికి అండగా ఉంటాం..

‘‘ఏడాదిగా ఏం జరిగింది? ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అని నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్‌కు రైతుల పట్ల ఉండే ఆవేదన, ఆర్తి ఈ రాష్ట్ర పాలకుల్లో ఇసుమంత కూడా లేదు. కేసీఆర్ ఆదేశం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తుంది. రైతు సంఘాలు, రైతులతో ఎప్పటికప్పుడు చర్చలు చేస్తుంది. ఈ నెల 24 నుంచి కమిటీ పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని షురూ చేస్తుంది. వ్యవసాయదారులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా ఎంత వరకు వస్తుంది? సాగునీరు, కరెంట్ పరిస్థితి ఏంటి? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వంటి అంశాలను సేకరిస్తారు. రైతాంగంతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తాం’’ అని చెప్పారు.

Read More
Next Story