రెండింటి మధ్య కేసీయార్ ఇరుక్కున్నారా ?
ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందాలు కేసీయార్ మెడకు చుట్టుకునేట్లే కనబడుతోంది. బీఆర్ఎస్ నేతలకూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నట్లుయి.
ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందాలు కేసీయార్ మెడకు చుట్టుకునేట్లే కనబడుతోంది. బీఆర్ఎస్ నేతలకూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నట్లుయి. లేఖపోతే కారుపార్టీ నేతలు ప్రభుత్వంపై ఇంతగా ఎదురుదాడులకు దిగరు. విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది.
నరసింహారెడ్డి కమిషన్ ముందు విద్యుత్ శాఖలో పనిచేసిన, చేస్తున్న ఉన్నతాధికారులు, విద్యుత్ రంగ నిపుణులు అనేకమంది విచారణకు హాజరై తమ వాగ్మూలాలు ఇచ్చారు. ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలుపై డిస్కం ఉన్నతాధికారులు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణలో ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు వల్ల రాష్ట్రప్రభుత్వంపై రు. 6 వేల కోట్ల అదనపు భారం అనవసరంగా పడిందన్నారు. విద్యుత్ కొనుగోలు నిర్ణయం కేసీయార్ దే అన్నట్లుగా చెప్పారు. యూనిట్ 3.90 రూపాయలకు కొన్నట్లు కేసీయార్ చెప్పినా నిజానికి చెల్లించింది 5.90 రూపాయలని ఉన్నతాధికారులు వివరించారు. ఛత్తీస్ ఘడ్ నుండి 2017 నుండి 2022 మధ్యలో కొన్న 17 వేల యూనిట్ల విద్యుత్ వల్ల ప్రభుత్వంపై అదనంగా రు. 6 వేల కోట్ల భారంపడిందని అధికారులు కమిషన్ కు చెప్పారు.
అధికారుల వాగ్మూలాలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. అధికారులను ప్రస్తావించకుండా కాంగ్రెస్, బీజేపీలపై రెచ్చిపోతున్నారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతు ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలులో ఒక్కరూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. అవినీతి జరిగిందని చెప్పించి కేసీయార్ ను అరెస్టుచేయాలనే కుట్ర జరుగుతున్నట్లు మండిపడ్డారు. కేసీయార్ అరెస్టు చేయించే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోయినట్లు ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ నుండి 17వేల యూనిట్ల కొనుగోలుకు రు. 7 వేల కోట్లు చెల్లిస్తే ఇందులో రు. 6 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని రెడ్డి లాజిక్ మాట్లాడారు. డిస్కం అధికారులు రు. 6 వేల కోట్ల అవినీతి జరిగిందని ఎప్పుడూ చెప్పలేదు. ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై రు. 6 వేల కోట్ల అదనపుభారం పడిందని మాత్రమే చెప్పారు. అదనపు భారమని ఉన్నతాధికారులు చెబితే అవినీతని జగదీష్ రెడ్డి చెప్పటమే విచిత్రంగా ఉంది.
ఏదేమైనా కేసీయార్ నిర్ణయం వల్ల తెలంగాణా ప్రభుత్వంపై రు. 6 వేల కోట్ల అదనపుభారం పడిందని చెప్పింది స్వయంగా ఉన్నతాధికారులే. కాబట్టి కచ్చితంగా అదనపుభారం పడే ఉంటుందనటంలో సందేహంలేదు. మంత్రులు లేకపోతే బీజేపీ నేతలో చేసిన ఆరోపణలైతే రాజకీయంగా కొట్టేయచ్చు. కాని అదనపుభారం గురించి చెప్పింది ఉన్నతాధికారులే కాబట్టి కమిషన్ సీరియస్ గా తీసుకుంది. దీన్నే కారుపార్టీ నేతలు సహించలేకపోతున్నారు. పనిలోపనిగా యాదాద్రి, భద్రాద్రిలో కేసీయార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయటాన్ని కూడా విద్యుత్ రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇంతమంది వాగ్మూలాలకు అదనంగా జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా కేసీయార్ ఎటాక్ చేస్తు లేఖరాయటం, దాన్ని మీడియాకు లీక్ చేయటాన్ని కమిషన్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని పక్కనపెడితే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం నిర్మాణాలపైన కూడా ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటి, ఇరిగేషన్ రంగ నిపుణులు ఇచ్చిన వాగ్మూలాలు కేసీయార్ నే తప్పుపడుతున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీకి సంబంధమే లేదన్నారు. మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టమని కమిటీ చెప్పలేదని కమిటీలోని ఇంజనీర్లు కమిషన్ తో చెప్పారు. తాము వద్దని చెప్పినా వినకుండా కేసీయారే మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించినట్లు కూడా ఆరోపించారు. జరుగుతున్నది చూస్తుంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ల విచారణ మధ్య కేసీయార్ ఇరుక్కున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. కేసీయార్ పై వెంటనే కేసు బుక్ చేసి అరెస్టుచేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. కేసీయార్ అరెస్టుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అందుకనే కేసీయార్ అరెస్టుకు సంబంధించి ఎప్పుడేమవుతుందో అనే టెన్షన్ కారుపార్టీ నేతల్లో పెరిగిపోతున్నట్లుంది.