
ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు.. గెలుపే కాంగ్రెస్ టార్గెట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్‌లు దాఖలు చేయడానికి సోమవారం ఆఖరు తేదీ. దీంతో పార్టీల అభ్యర్థులంతా నేడు నామినేషన్లు వేస్తున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్‌లు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సీబీఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమి పాలవడంతో ఎలాగైనా ఈసారి పోటీలో నిలబడుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా స్పష్టం చేసింది.
శాసనభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు, బీఆర్ఎస్‌కు ఒకటి దక్కనున్నాయి. కాగా కాంగ్రెస్ తమకు అందిన నాలుగు స్థానాల్లో ఒకటి సీటును మిత్రపక్షం సీపీఐకి కేటాయింది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ భేటీ అయి నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐ, కాంగ్రస్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. అదే విధంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా కేటాయిస్తామని పొత్తు సమయంలో హామీ ఇచ్చింది. కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య ఒక ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్ రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 10మంది పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కపపుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటే దక్కింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలిచింది.