బీజేపీకి లబ్ధి చేకూర్చడమే బీఆర్ఎస్ టార్గెట్.. మంత్రి సీతక్క ఫైర్
x

బీజేపీకి లబ్ధి చేకూర్చడమే బీఆర్ఎస్ టార్గెట్.. మంత్రి సీతక్క ఫైర్

బీజేపీకి బీ టీంలా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు.


బీజేపీకి బీ టీంలా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే మహారాష్ట్రలో సీఎం రేవంత్ చేసిన ప్రచారంపై తెలంగాణలో విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణలో తేలిపోయిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర మహా గొప్పలు చెప్పుకుంటుందంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లు రేవంత్ మహారాష్ట్ర పర్యటనపై చురకలంటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతక్క స్పందించారు. మహారాష్ట్రలో బీజేపీ విజయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కేసుల నుంచి బయటపడటం కోసం బీఆర్ఎస్.. పాలలో నీళ్లలా బీజేపీతో అంటకాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిపై మంత్రి సీతక్క ఈరోజు సెక్రటేరియట్‌లో ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలో బీజేపీకి చేకూర్చడం కోసం బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బుదరజల్లుతోందని ఆరోపించారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రవేపెట్టిన పథకాలను కూడా అమలు చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తోందని, ఆఖరికి మహిలలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.

అప్పటి నుంచే ఈ అబద్ధాలు

‘‘మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చిన నాటి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో బీఆర్ఎస్ విష ప్ర‌చారం చేస్తుంది. పదే ప‌దే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో చేతిలో చిల్లి గ‌వ్వ లేకున్నా మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారు. ఓలా, ఉబ‌ర్ క్యాబ్‌లు, బైక్లు తెచ్చిన‌ప్పుడు ఆటో డ్రైవ‌ర్లు గుర్తుకు రాలేదా? కోట్లాదిమంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్ర‌లుల ప‌న్నుతోంది’’ అని ఆరోపించారు.

రైతులపై ఇప్పుడు ప్రేమ పుట్టిందా..

‘‘పంట రుణ‌మాఫీని చేయ‌ని బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల ప్రేమ కురిపించ‌డం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ హాయంలో 20 లక్షల మంది రైతుల‌కు రుణమాఫీ చేయ‌లేదు. బీఆర్ఎస్ చేసిన రుణ మాఫీ వ‌డ్డీల‌కు కూడా స‌రిపోలేదు. కానీ ప్ర‌జా ప్ర‌భుత్వం కేవలం 27 రోజుల్లోనే రూ.18 వేల కోట్ల పంట రుణాల‌ను మాఫీ చేసింది. బీఆర్ఎస్ ఏక కాలంలో క‌నీసం ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ కూడా చేయ‌లేదు. గ‌త ప్రభుత్వం రుణ మాఫీ చేయ‌క‌పోవ‌డంతో ఎంతో మంది రైతులు బ్లాక్ లిస్టులోకి వెళ్లారు. దీంతో ఇప్పుడు రుణ మాఫీ చేయాలంటే సాంకేతిక సమస్యలు త‌లెత్తుతున్నాయి. మేమే ఏక కాలంలో పంట రుణ మాఫీలు చేస్తుంటే బీఆర్ఎస్ స‌హించ‌లేక‌పోతుంది’’ అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్‌కు ఆ ఆలోచనే రాలేదు

‘‘50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సామాన్యుల గృహాల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న బీఆర్ఎస్ చేయ‌లేదు. మ‌హిళలకు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని ఆర్దిక‌ంగా బ‌లోపేతం చేస్తున్నాం. మ‌హిళ‌ల‌కు బీఆర్ఎస్ ఎగ్గోట్టిన వ‌డ్డీల‌ను మేమే చెల్లిస్తున్నాం. బీఆర్ఎస్, బీజేపీలు క‌లిసి రూ.400 ఉన్న గ్యాస్ ధ‌ర‌ను రూ.1200 చేశారు. అందుకే వంటింటి భారాన్ని తగ్గించేందుకు రూ.500కే సిలిండ‌ర్ ఇస్తున్నాం’’ అని వివరించారు.

బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలిచ్చింది..

‘‘పదేళ్లలో క‌నీసం లక్ష ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇవ్వ‌క‌పోయింది. కానీ ఆరు మాసాల్లోనే మేము 50 వేల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు ఇచ్చాం. మాకు ప్ర‌జ‌లు ఐదేల్ల మాండేట్ ఇచ్చారు. ఇంకా నాలుగు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. ఈ నాలుగేళ్లలో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తాం. గూడు లేని వాళ్లకు కాంగ్రెస్ గ‌త ప్ర‌భుత్వాలు ల‌క్ష‌ల ఇండ్లు ఇచ్చాయి. ఇప్పుడు కూడా రూ.5లక్షలతో కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అణ‌చివేత‌.. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు అవ‌స్త‌వాలు చెప్ప‌డ‌మే బీఆర్ఎస్ నైజం’’ అని చురకలంటించారు.

బీఆర్ఎస్ అప్పులకే సరిపోతోంది

‘‘ఎంత ఉప్పు తింటే మత దూప అన్న‌ట్టుగా గ‌త ప్రభుత్వం చేసిన రూ.7ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కే రూ.54వేల కోట్లు చెల్లించాం. బీఆర్ఎస్ ఎన్నో హ‌మీలిచ్చి మోసం చేసింది. దళిత సీఎం లేడు, ద‌ళితుల‌కు మూడెక‌ర‌లా భూమి లేదు. కానీ ఇప్పుడు ఎక్స్(ట్విట్టర్)లో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారు. అసత్య ప్రచారం చేసే విప‌క్షం ఉండ‌టం తెలంగాణ దౌర్భాగ్యం. కేటీఆర్ ట్విట్టర్ టిల్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నిజాలు తెలుసుకోండి

‘‘పంచాయ‌తీ భ‌వ‌నం తాక‌ట్టు అని హ‌రీష్ రావు ప్ర‌చారం చేయ‌డం స‌రికాదు. అస‌లు నిజాలు తెలుసుకోకుండా ట్విట్లు పెట్టి ఎందుకు గౌర‌వం పొగొట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే రూ.7 ల‌క్ష‌లు చెల్లించాం. ప‌నులు పూర్త‌య్యాకా మిగిలిన బిల్లులు చెల్లిస్తాం. బీఆర్ఎస్ హ‌యాంలో తాలు, తరుపు పేరుతో మిల్ల‌ర్లు రైతుల‌ను నిండా ముంచారు. అక్ర‌మ మిల్ల‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. అందుకే మిల్ల‌ర్ల‌తో కుమ్మ‌క్కై అల‌జ‌డులు సృష్టించే కుట్రలు చేస్తున్నారు. ధర్నా చౌక్‌లు ఎత్తేసిన వారే ధ‌ర్నాల‌ను ఎగ‌దోస్తున్నారు’’ అని మండిపడ్డారు.

గతం మరువకండి

‘‘అధికారంలో ఉన్న‌ప్పుడు సీఎం, మంత్రులు స‌చివాల‌యానికి రాలేదు. ప్ర‌జ‌ల‌కు ఎన్న‌డు అందుబాటులో లేరు. కాని మేమే నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాము. దేశంలో సామాజిక న్యాయాన్ని, లౌకిక వాదాన్ని నిల‌బెట్టే శ‌క్తుల‌ను గెలిపించేందుకు ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌చారం చేస్తున్నాం. మీరు ప్ర‌భుత్వ సొమ్ముతో ఇత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయ పర్య‌ట‌న‌లు చేశారు. మేము రాజ్యంగాన్ని ప‌రీర‌క్షించేందుకు, న్యాయాన్ని బ‌తికించేందుకు సొంత ఖ‌ర్చుల‌తో ప‌ర్యటిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం తప్ప పరిపాలనకు ఏవ‌రు అర్హులు కారు అనే బ్ర‌మ‌ల్లో బీఆర్ఎస్ ఉంది’’ అని అన్నారు.

బీఆర్ఎస్‌ను నిలదీయాలి

‘‘కుల‌గ‌ణ‌ను అడ్డుకుంటున్న‌ బీఆర్ఎస్ ను బీసీ సంఘాలు నిల‌దీయాలి. కుల‌గ‌ణ‌న‌కు అడ్డుప‌డుతున్న బీఆర్ఎస్ వైఖ‌రిని కుల సంఘాలు ఎండ‌గ‌ట్టాలి. విదేశాల నుంచి ర‌ప్పించి బీఆర్ఎస్ కుటుంబ స‌ర్వే చేసి ప్ర‌జ‌ల‌కు న‌యా పైసా ప్ర‌యోజ‌నం చేయ‌లేదు. జనాభా లెక్కలు తెలిస్తేనే సంక్షేమ వాటా సాధ్యమవుతుంది. ఇంటింగి స‌మ‌గ్ర స‌ర్వేను బ‌హిష్క‌రించ‌డం అంటే మన హక్కులను, అభివృద్దిని వదులుకోవడమే అవుతుంది. మేమెంతో.. మాకంత అన్న నినాదం నిజం కావాలంటే స‌మ‌గ్ర సర్వేలో వివ‌రాలు న‌మోదు కావాలి’’ అని వివరించారు.

ప్రజలే బేరీజు వేసుకోవాలి

‘‘క్లబ్బులు, ప‌బ్బులు బంద్ అయ్యాక కొంతమంది అరాచ‌కంగా తయారవుతున్నారు. విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు. గ‌త పదేండ్లలో జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌జ‌లు బేరీజు వేసుకోవాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి..ఎంత రుణ మాఫీ జరిగిందో ప్ర‌జ‌లు ఆలోచించాలి. మీకు అంద‌బోయే ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ స‌ర్వే వ‌ద్దంటోంది. ఒక్క కేసీఆర్ కుటుంభానికి ల‌బ్ది జ‌ర‌గాల‌నే.. స‌ర్వేను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇంటింటి సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందో ప్ర‌జ‌లు ఆలోచించుకోవాలి’’ అని అన్నారు.

Read More
Next Story