Honour Killing | రంగారెడ్డిలో అక్కను చంపిన తమ్ముడు.. పరువు కోసమా? ఆస్తి కోసమా?
x

Honour Killing | రంగారెడ్డిలో అక్కను చంపిన తమ్ముడు.. పరువు కోసమా? ఆస్తి కోసమా?

తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న సోదరిని తమ్ముడే అతి కిరాతకంగా హతమార్చాడు.


తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న సోదరిని తమ్ముడే అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. స్వగ్రామానికి వెళ్లి వస్తున్న క్రమంలో అక్కపై దారికాచి దాడి చేశాడు తమ్ముడు. అనంతరం పోలీసుల దగ్గర లొంగిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మృతురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య ఘటనను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పరువు హత్యలకు కట్టడి చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలు హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే నాగమణిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

నాగమణి.. శ్రీకాంత్ అనే వ్యక్తి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారిద్దరూ ఈ ఏడాది నవంబర్ 10న యాదగిరిగుట్ట ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళి తర్వాత నుంచి వీరిద్దరూ హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా డిసెంబర్ 1 ఆదివారం నాడు సెలవు కావడంతో నాగమణి స్వగ్రామం రాయపోలు గ్రామానికి వెళ్లింది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 2 ఉదయం సమయంలో నాగమణి హయత్‌నగర్‌కు తిరుగుప్రయాణమైంది. ఆమె కోసం ఆమె తమ్ముడు పరమేష్ దారికాచాడు. అక్క రాగానే ముందుగా కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత కొడవలితో నాగమణి మెడపై నరికాడు. ఈ ఘటనలో నాగమణి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్క మరణిచిందని రూఢీ చేసుకున్న తర్వాత పరమేష్.. పోలీసులు దగ్గర లొంగిపోయాడు. అయితే నాగమణికి తమ్ముడు పరమేష్ ఒక్కడే కుటుంబీకుడని, తల్లిదండ్రులు లేరని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతే కాకుండా నాగమణి.. శ్రీకాంత్‌ను రెండో ప్రేమ వివాహం చేసుకుందని, మొదటి భర్తతో విడిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు నాగమణి.. శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకోవడే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

నాగమణి 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆమె, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ కూడా రాయపోల్ ప్రాంతానికి చెందిన వారే. భర్తతో విడిపోయిన నాగమణి.. శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. కాగా ఈ కులాంతర వివాహాన్ని పరమేష్ జీర్ణించుకోలేకపోయాడు. దాంతో సరైన సమయం చూసి దారికాచి మరీ అక్కపై దాడి చేసి హతమార్చాడని పోలీసులు వివరించారు.

ఆస్తి కోసమే హత్య

కాగా నాగమణి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ్ముడు పరమేష్.. అక్కను ఆస్తికోసమే హతమార్చాడన్న వాదన వినిపిస్తోంది. మొదటి వివాహం తర్వాత తమ వారసత్వ భూమిని నాగమణి.. తమ్ముడు పరమేష్‌కు రాసిచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్‌తో వివాహం తర్వాత ఆ భూమిలో వాటా ఇవ్వాలని తమ్ముడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో వాటా ఇవ్వడం ఇష్టం లేకనే అక్కను అతి కిరాతకంగా చంపాడని స్థానికులు చెప్తున్నారు.

మాది ఎనిమిదేళ్ల ప్రేమ: నాగమణి భర్త

‘‘ఎనిమిది సంవత్సరాలుగా నాకు నాగమణికి మధ్య ప్రేమ. మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు నాలుగు సంవత్సరాలు తన హాస్టల్‌లోనే ఉంది. ఆ సమయంలో నేనే ఆమెకు కావలసిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాము. మేము పెళ్లి చేసుకున్నప్పటినుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరిస్తూ వచ్చారు. ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడు. రాయపోల్ నుండి హయత్ నగర్ బయలుదేరేముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పాను. ఆయన వెళ్లే లోపే రక్తపు మడుగులో నాగమణి కొట్టుకుంటుంది’’ అని శ్రీకాంత్ వివరించారు.

Read More
Next Story