పుస్తకాల తోపుడు బండి ఆగిపోయింది... సాధిక్ అలి ఇక లేరు!
తోపుడు బండి సాదిక్‌గా ప్రసిద్ధి చెందిన సాదిక్ అలి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మాస్టర్స్ చేశారు.సాధిక్ అలి MA అవుతూండగానే ఉదయం లో చేరారు..
(మహమ్మద్ గౌస్)
తోపుడు బండి సాదిక్‌గా ప్రసిద్ధి చెందిన సాదిక్ అలి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మాస్టర్స్ చేశారు.సాధిక్ అలి MA అవుతూండగానే ఉదయం లో చేరారు.. వృత్తిలో భాగం కాక పోయినా అప్పుడప్పుడూ ఉదయం సండే స్పెషల్ అనుబందం లోనూ, శివరంజని అనే పత్రిక లోనూ ర్రస్తుండే వారు. భార్య ఉష వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అతడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతూ, ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతూ అక్కడ వచ్చే డబ్బును ప్రచురణకర్తల నుండి పెద్దమొత్తంలో పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసేవారు. అలాగే ఎక్కువ మంది దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చే వారు. వాటిని తన తోపుడుబండి, సమాజిక సేవ కార్యక్రమాలకు ఖర్చు చేసేవారు.
తోపుడు బండి, పుస్తకాలూ, 1000 కిలోమీటర్లూ వంద రోజుల్లో ప్రతీ గ్రామాన్నీ సందర్శిస్తూ వెళ్ళాలి... కాలినడకన ప్రయాణం 40 డిగ్రీల పైనే ఉన్న ఎండ సాధ్యమా...? సాధిక్ అలీ కి తనకి తాను ప్రశ్నించుకోవటం ఇష్టం, ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటం అంతకన్నా ఇష్టం... 1000 కిలోమీటర్ల యాత్ర సాధ్యమా అన్న ప్రశకి సమాధానం కోసం బయలేరిన అతను చివరికి వరంగల్ నడిబొడ్డున నిలబడి సమాధానాన్ని పట్టుకున్నాడు... సాధ్యమే...! అరిచాడు.., దిక్కులు పగిలి పోయేలా.... అరిచాడు "ఔనూ..! సాధ్యమే... మనిషన్న వాడు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే.." హైదరాబాద్ ఉప్పల్ నుంచీ రంగా రెడ్డి, మెదక్,నల్గొండ జిల్లాలమీదుగా ఒక్కొక్క ఊరిలో అక్షరాలు చల్లుకుంటూ, పుస్తకాలు మొలిపించుకుంటూ... నడిచాడు ...
ఒకప్పుడు అతనొక జర్నలిస్ట్,తర్వాత ఒక బిజినెస్ మ్యాన్,ఆ తర్వాత ఒక ఉధ్యమ కారుడు పోలవరం చుట్టుపక్కల గిరిజన తండాల్లోని ప్రతీ గుడిసెనీ తన ఇల్లు చేసుకొని,ప్రతీ మనిషినీ తన వాడు చేసుకొని బతికిన ఈ మనిషి ఇప్పుడు పుస్తకాల మీద పడ్డాడు ఉధ్యమ కారుడి బుద్ది కదా కాస్త తీవ్రంగానే విరుచుకు పడ్డాడు. ఒకే సంవత్సరంలో ఎప్పుడూ అమ్ముడుపోనన్ని తెలుగు కవిత్వ పుస్తకాలని ఠక్కున అమ్మి పారేసాడు. హైదరాబాద్ లోని గల్లీ గల్లీ తిరిగి… మరీ తెలుగు కవిత్వమా ఎవరు కొంటారిప్పుడు? అన్న వాళ్ళ చేత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి “కొత్త పుస్తకాలేం వచ్చాయ్?” అని అడిగి మరీ కొనే దాకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో సాధిక్ అలీ తోపుడు బండి సత్తా ఏమిటో ఒక్క సారి అందరికీ అర్థమైంది లక్షల రూపాయల అమ్మకాలు కవిత్వం,కథా,సాహిత్య వ్యాసాలూ ఇలా అదీ ఇదీ అనికాదు తెలుగు సాహిత్యానికి మళ్ళీ పాత వైభవం వచ్చేసినట్టే…. ప్రతీ ఒక్కరూ అనుకున్న మాట.. ఇప్పుడు తెలుగు కవులు కూడా కాస్త ధైర్యంగా పుస్తకాలు ప్రింట్ కివ్వొచ్చు అనుకున్నారు…
తోపుడుబండి ఆలోచన ఆలోచన ఇప్పటిది కాదు 44 ఏళ్ళ కింద ఒక పుస్తకం చదివారు సాధిక్ అలి. ఆ పుస్తకం పేరూ,రచయిత పేరూ రెండూ గుర్తు లేవు లేవు కానీ అందులో ఉన్న ఒక పేరా అతన్ని విపరీతంగా ఆకర్షించింది. అన్దులో హీరో ఒక కల కంటాడు... తోపుడు బండిలో పుస్తకాలు అమ్ముతున్నట్టు.. మెలకువ వచ్చాక సాహిత్యానికి ఎప్పటికైనా ఆ దశ వస్తుందా అనుకొని నిట్టూరుస్తాడు... ఆ లైన్లు సదిక్ ను కట్టి పడేసాయి.. అలా ఆ కల అతనికి రావటం మొదలయ్యింది. 2015 విజయ వాడ బుక్ ఫెయిర్ నుంచి తిరిగి వస్తూ తాను "వాసిరెడ్డి పబ్లికేషన్స్" వాసిరెడ్డి వేణుగోపాల్ గారూ సూర్యా పేట దాబా దగ్గర ఆగారు.. అక్కడ మళ్ళీ ఈ ఆలోచన ని అమల్లో పెట్టటం గురించి ఆలోచించారు.. హైదరాబాద్ వచ్చాక అరవింద్ కుమాక్ కొల్లి కూడా వారితో జతకలిసాడు. కలిసి పని చేసాం ఫలితం 2015 ఫిబ్రవరి 22 న తోపుడు బండి మొదలు పెట్టారు.అలా మొదలయ్యాక కోంపల్లి వెంకట్ గౌడ్,.నకుల్,షారూఖ్ ఇలా వీళ్ళంతా సాదిక్ మీద ఉన్న ప్రేమతో వచ్చి కలిసారు.
తెలుగు సాహిత్యం ఒకప్పుడు రాజ లాంచనాలతో పల్లకీల్లో మోయబడింది,గజారోహణాలు చేయించుకుంది…సాహితీ కారులకి కనకాబిషేకాలు జరిపించింది… ఐతే ఇప్పుడు కాలం మరింది తెలుగు సాహిత్యం సామాన్యుడికి కాస్త దూరం జరిగింది.అకడమిక్ పుస్తకాల వెనుకకు జరిగింది…కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్,మత సాహిత్యం ఇలా మరికొన్ని నెమ్మదిగా సాహిత్యాన్ని పక్కకు నెట్టాయి. ఒక దశలో తెలుగు కవిత్వ పుస్తకం వేయాలీ అంటే పబ్లిషర్లు కూడా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది… ఐతే ఇప్పుడు మరో చిన్న ఆశ తోపుడు బండిలా మరోసారి మొదలైంది. ఏమో తెలుగు సాహిత్యం మళ్ళీ కవులనీ రచయితలనీ ధనవంతులను చేయొచ్చు… ప్రతీ ఊరిలోనూ ఒక గ్రంథాలయం మొదలవ్వొచ్చు…. సాధిక్ అనే ఒక మనిషి ఈ కలని నిజం చేయొచ్చు…
తోపుడు బండి మనకు కొత్తేం కాదు భారతీయ ఫుట్ పాత్ వ్యాపారంలో వీటి పాత్ర తక్కువేం కాదు.టిఫిన్ సెంటర్లూ,మినీ బట్టల దుకాణాలూ, వాచీలూ, చెప్పులూ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తోపుడుబళ్ళెక్కి నగరాల్లో సంవత్సరానికి కొన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.కూరగాయల దగ్గరి నుంచీ పాత సామాన్లు మోయటం వరకూ తోపుడు బండి దిగువ వర్గాల జీవితంలో ఒక భాగమైపోయింది. భారత దేశంలోని ప్రతీ మధ్య తరగతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సంధర్బంలో తోపుడు బండి మీద ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు. ఒక రకంగా తోపుడు బండి సామాన్యుడి “అక్షయ పాత్ర”. తోపుడు బండ్ల మీద జరగని వ్యాపారం లేదు. మీరు ఆదివారాలు చార్మినార్ ప్రాంతానికి వెళితే ఎలక్ట్రానిక్ ప్రింటర్లూ,కంప్యూటర్ విడి భాగాలూ,మానిటర్లూ తోపుడు బళ్ళ మీద అమ్మే మనుషులు కనిపిస్తారు. ఇవన్నీ సరే..! మరి పుస్తకాలు..!? ఇప్పటివరకూ మనం పాత పుస్తకాలనీ,పాత వార్తా పత్రికలనూ “కొనే”తోపుడు బళ్ళనే చూసాం. కానీ కొత్త పుస్తకాలను అమ్మే బండిని చూసారా?. ఇప్పుడు సాహిత్యం కూడా తోపుడు బండెక్కింది…సాహిత్యం సామాన్యుడి ముందుకే వచ్చేందుకు సిద్దమైంది. ఐతే ఈ పల్లకీ కి బోయీ ఒక్కడే.. రాజుల దగ్గరికి కాదు సాహితీ అభిమానులదగ్గరికి…పల్లె గుడిసెల ముంగిళ్ళకి… సాధిక్ అనే ఒక సారథి సాహితీ రథాన్ని తీసుకు వెళుతున్నాడు…
తోపుడు బండి తనకంటూ ఒక అస్తిత్వాన్ని సంపాదించుకుంది. పుస్తకాలు వేస్తే ఇప్పుడు జనం చదువుతున్నారా?? అన్న అనుమానం ఉన్న యువకవులు కూడా పుస్తకాలు పంచటమే కాదు ఇప్పుడు అమ్మగలం అన్న నమ్మకానికి వచ్చేసారు, పుస్తకాలకీ కవిత్వానికీ ఉన్న 'గిరాకీ' అర్థమయ్యింది. ఇప్పటివాళ్ళకి కవిత్వం ఎక్కడ ఎక్కుతుందండీ..! అంటూ ఆశ్చర్యపోయిన వేళ్ళు అలా ముక్కుమీదే ఉండిపోయాయ్... కొన్ని వందల కవిత్వ పుస్తకాలని ఈజీగా అమ్మి పారేసాడు. అందులో యువకవులు రాసిన పుస్తకాల శాతం తక్కువేం కాదు, కొన్నవాళ్ళలో యువత శాతమూ 'చాలాఎక్కువ'కు ఏమాత్రం తగ్గలేదు. పుస్తకం రాయటమే కాదు పుస్తకాన్ని అమ్మటం కూడా ఒక ఆర్ట్ అన్న మాట సైలెంట్ గా చెప్పి తాను కామ్అయిపోయాడు.. ఇక మొదలైంది సాహితీకారుల రాక.., కవులూ, రచయితలూ, జర్నలిస్టులూ ఒక్కొక్కరూ తోపుడుబండి బాటపట్టారు. కానీ ఆసరికి తోపుడు బండి దారి మారిపోయింది...
అక్కడితో ఇక తోపుడు బండి ఆగలేదు…సాధిక్ ఆపలేదు “తోపుడు బండి పబ్లికేషన్స్” మొదలయ్యింది. కవిత్వంతో పాటు మిగిలిన సాహిత్యమూ బండెక్కి కూచుంది.ఇప్పుడు ఇంకో గ్రంథాలయోధ్యమం మొదలయ్యింది.100 రోజుల్లో 1000 కిలోమీటర్ల ప్రయాణానికి తోపుడు బండి సిద్దమైంది మరిన్ని కొత్త పుస్తకాలతో సింగారించుకుంది.ప్రతీ పల్లె లోనూ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయటం కోసం,ప్రజల్లో పఠనాభిలాష పెంచటం కోసం తోపుడు బండి ప్రస్థానం మొదలయ్యింది.సాధిక్ మరోసారి బండి తోసుకుంటూ సాగనున్నాడు… ఒక్కడుగా మొదలౌతాడు రోడ్డుమీదకొచ్చేలోపు భానోజీ రావు వచ్చి చేరతాడు,నాలుగడుగులేసే సరికి సంతోష్ అనే కుర్ర్రాడొస్తాడు. కాసేపట్లోనే షారూఖ్ వస్తాడు.. ఇక ఆ తర్వాత వస్తూనే ఉంటారు… సాహితీ వేత్తలూ, జర్నలిస్ట్ లు, మంత్రులూ…ఇలా వస్తూనే ఉంటారు తోపుడు బండిని ఒక సారి ఆప్యాయంగా స్పర్శించి పుస్తకాలు కొనుక్కుని వెళ్ళిపోతారు.
రోడ్డు మీద స్పీడ్ గా వెళ్ళే ఒక కారు సడన్ గా స్లో అయిపోయి పార్క్ చేయబడుతుంది,మనుషులు దిగుతారు కాసేపటికి కొన్ని పుస్తకాలను బ్యాక్ సీట్లో వేసుకొని కారు వెళ్ళిపోతుంది.. ఒక బైక్ మీద అబ్బాయీ అమ్మాయీ తోపుడు బండిని వింతగా,ఆనందం గానూ చూస్త్తూ స్లో ఔతారు కాసేపు సాధిక్ భాయ్ తో మాట్లాడి ఒక సెల్ఫీ,కొన్ని పుస్తకాలూ తీసుకొని వెళ్ళిపోతారు.. ఐతే ఆఖరున అక్కడ మిగిలేది తోపుడు బండీ సాధిక్ లు ఇద్దరే.. ఈ ఇద్దరికీ తోడు ఒక ఆశయం. అంతే ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఒక ప్రవాహంలా…
ఎప్పుడైనా మీకు అతను కనబడొచ్చు.. తోపుడు బండి పక్కన అలా నిలబడి ఒక తాత్వికుడిలా శూన్యం లోకి చూస్తూనో…లేదా కార్లో కూచొని రెండు నిమిషాలు రిలాక్స్ గా ఒక దమ్ము కొడుతూనో… లేదంటే అక్కడే పుట్ పాత్ మీదే కూచొని భోజనం చేస్తూనో…సామాజికుడి నుంచి పనికి రాని కుహనా మర్యాదలని వదిలేసిన ఒక మౌని లా కనిపిస్తాడు. ఒక సారి బండి దగ్గరికి వెళ్ళండి అతనితో మాట్లాడండి… ఒక సెల్ఫీ తీసుకోండి…ఒక పుస్తకం కొనండి.. ఆ కొద్దిసేపూ హాయిగా మిమ్మల్ని నవ్వించి మనసుని ఆనందంతోనూ చేతిని కొన్ని అక్షరాలతోనూ నింపి మిమ్మల్ని సాగనంపుతాడతను…మీరు వెళుతూంటే చిరునవ్వుతో మీకు చెయ్యి ఊపి మళ్ళీ బండిని తోసుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటాడు.
(ఆకాశవాణి మాజీ అధికారి గోపిచంద్ సౌజన్యంతో)
Next Story