పొంగులేటి ఇంట్లో సోదాలు వాళ్ల పనే: అద్దంకి దయాకర్
x

పొంగులేటి ఇంట్లో సోదాలు వాళ్ల పనే: అద్దంకి దయాకర్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈరోజు ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల వెనక కచ్ఛితంగా బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు.


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈరోజు ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి తెలంగాణలో ల్యాండ్ అయిన 16 ఈడీ బృందాలు ఈరోజు తెల్లవారుజాము నుంచే పొంగులేటి నివాసంలో తనిఖీలు ప్రారంభించాయి. సీఆర్‌పీఎఫ్, పోలీసుల భద్రత నడుమ ఈ సోదాలు జరిగాయి. పొంగులేటి ఇంటితో పాటు మంత్రి పొంగులేటి కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే పొంగులేని నివాసంలో టీడీఎస్ స్కాంకు సంబంధించే సోదాలు జరుగుతున్నాయని, అందులో పొంగులేటి పాత్ర కూడా ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతోనే ఈడీ రంగంలోకి దిగిందంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొంగులేటి నివాసంలో జరుగుతున్న ఈడీ సోదాలు పూర్తి రాజకీయ ప్రేరేమితమైనవేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశంతో బీజేపీనే పక్కా ప్లాన్ ప్రకారం.. ఈ సోదాలు స్కెచ్ వేసిందంటూ విమర్శలు గుప్పించారు.

భయపెట్టాలనే ఈ దాడులు

ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలను భయపెట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, అందుకోసం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వినియోగిస్తోందంటూ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలను ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో చేపట్టిన సోదాలు కూడా ఇందులో భాగమే. తమ రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం భయపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ’’ అని అన్నారాయన.

కాంగ్రెస్ నేతలే టార్గెట్..

ఇది తెలంగాణలోనే కాదని, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రణాళికలనే బీజేపీ అమలు చేసిందని వివరించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై ఈడీ దాడులకు పాల్పడ్డారని, ఆఖరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా ఈడీ, ఐటీ దాడులతో సతమతం చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తమకు బలమైన ప్రత్యర్థిగా ఉండొచ్చన్న నేతలపై, రాజకీయ వ్యతిరేక పార్టీల కీలక నేతలే టార్గెట్ బీజేపీ.. ఈడీ, ఐటీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ఈ చర్యలకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈడీ సోదాలకు ఆ ప్రాజెక్టే కారణమా..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీల్లో హైదరాబాద్ రీజియన్ ఈడీ అధికారులు ఒక్కరు కూడా పాల్గొనలేదని తెలుస్తోంది. ఈ సోదాల్లో సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఢిల్లీ నుంచే వచ్చారని సమాచారం. అయితే నారాయణ్‌పట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను పొంగులేటికి చెందిన రావ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారం అధికమైన నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించే ఈరోజు ఆయన ఈడ సోదాలను ఎదుర్కొన్నట్లు చర్చ జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎప్పుడు తేలతాయో చూడాలి.

Read More
Next Story