కవితకి బెయిల్... ఎవరి ఉపకారం?
x

కవితకి బెయిల్... ఎవరి ఉపకారం?

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెకి బెయిల్ మంజూరు చేయడంపై కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. కవితకి బీజేపీ ఉపకారం వల్లే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ అంటుంటే... మీ సహకారంతోనే వచ్చిందని కాంగ్రెస్ ని బీజేపీ విమర్శిస్తోంది. ఇలా ఇరు పక్షాల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకుంటుంటే... ఈ సమయంలో మీరు కించపరిచేలా కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు హితవు పలుకుతున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్..

కవిత కు బెయిల్ ఊహించిందే.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే వచ్చిందంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై.. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు. హరిశ్, కేటీఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని ఎద్దేవా చేశారాయన. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు. "తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుంది" అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

కాంగ్రెస్ కి కంగ్రాట్స్...

కవితకి బెయిల్ లభించడంపై బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ చొరవ, కేసీఆర్ చాతుర్యంతోనే ఆమెకి బెయిల్ వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "కవిత బెయిల్‌ కోసం పోరాడిన కాంగ్రెస్‌ తరఫు న్యాయవాదులకు శుభాకాంక్షలు. అలుపెరగని మీ శ్రమకి ఫలితం లభించింది. ఈ బెయిల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల సమిష్టి విజయం. కవిత బెయిల్‌పై బయటకు రావడం, ఈ కేసును వాదించిన లాయర్‌ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కేసీఆర్‌ చతురత ప్రదర్శించారు. తొలుత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని అధికార కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ ది అద్భుతమైన రాజకీయ చతురత. క్రైమ్‌లో భాగస్వాములకు అభినందనలు' అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ సెటైర్లు వేశారు.

బండికి కేటీఆర్ కౌంటర్...

బండి సంజయ్ చేసిన కామెంట్స్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. "మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యుండి సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి... భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Read More
Next Story