ఇద్దరూ కలిసే సింగరేణిని దెబ్బతీయబోతున్నారా ?
పదేళ్ళల్లో కేంద్రంలో కాని రాష్ట్రంలో కాని కాంగ్రెస్ అధికారంలో లేదు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, బీఆర్ఎస్ ప్రభుత్వాలే
ఇందులో అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేశంలోని బొగ్గు గనులను వేలంద్వారా మాత్రమే సంస్ధలు సొంతం చేసుకోవాలని నరేంద్రమోడి ప్రభుత్వం 2015లో కమర్షియల్ మైనింగ్ యాక్ట్ ను తీసుకొచ్చింది. అంతకుముందు ప్రభుత్వరంగ సంస్ధల పరిధిలోని బొగ్గుగనులు వాటి ఆధీనంలోనే ఉండేవి. యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాతే బొగ్గుగనులపై ప్రభుత్వరంగ సంస్ధలకు గుత్తాధిపత్యం పోయి ప్రైవేటుసంస్ధలతో పోటీ పడాల్సొస్తోంది. అంటే కొత్త ప్రక్రియ మొదలై సుమారు పదేళ్ళవుతోంది. ఈ పదేళ్ళల్లో కేంద్రంలో కాని రాష్ట్రంలో కాని కాంగ్రెస్ అధికారంలో లేదు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, బీఆర్ఎస్ ప్రభుత్వాలే కాబట్టి ప్రస్తుత పరిస్ధితికి ఈ రెండు పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలే కారణమని చెప్పాలి.
ఇపుడు విషయం ఏమిటంటే ఈరోజు శుక్రవారం దేశంలోని 60 బొగ్గు గనులకు వేలంపాట జరగబోతోంది. ఈ 60 గనుల్లో మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి గని కూడా ఉంది. ఒకపుడు ఈగని సింగరేణి పరిధిలోనే ఉండేది. మోడి ప్రభుత్వంచేసిన చట్టం పుణ్యమాని అన్నీ గనులతో పాటు శ్రావణపల్లి కూడా కేంద్రప్రభుత్వం పరిధిలోకి వెళిపోయింది. ఇపుడా గనిని సొంతం చేసుకోవాలంటే ప్రైవేటుసంస్ధలతో పాటు సింగరేణి కూడా వేలంపాటలో పాల్గొనాల్సిందే. ఇపుడు సమస్య ఏమిటంటే వేలంపాటలో పాల్గొంటే బొగ్గుగనుల ప్రైవేటీకరణకు సింగరేణి ఆమోదం తెలిపినట్లు. ఒకవేళ వేలంపాటల్లో పాల్గొనకపోతే కొత్త బొగ్గుగనులు దక్కవు. సింగరేణి వేలంపాటల్లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా వేలంపాటలు ఆగవు. కొత్త బొగ్గుగనులు దక్కకపోతే పదేళ్ళ తర్వాత నష్టపోయేది సింగరేణి మాత్రమే. ఈరోజు జరగబోయే వేలంపాటల్లో శ్రావణపల్లి గని కోసం సింగరేణి పాల్గొంటుందా ? పాల్గొనదా ? అన్న సస్పెన్స్ పెరిగిపోతోంది.
సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పెరిగిపోయి ఒకదానిపై మరోటి బురదచల్లేసుకుంటున్నాయి. నిజానికి ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్ పాత్ర ఏమీలేదు. మొత్తం పాత్రంతా బీజేపీ, బీఆర్ఎస్ ది మాత్రమే. గనులను ప్రైవేటుపరం చేసింది ఎన్డీయే ప్రభుత్వం, సింగరేణిని వేలంలో పాల్గొననీయకుండా గడచిన తొమ్మిదేళ్ళు అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. వేలంపాటలను కేటీయార్ వ్యతిరేకిస్తున్నారు. సింగరేణి వేలంపాటలో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్లే అనే విచిత్రమైన వాదన లేవదీశారు. పైగా తాము అధికారంలో ఉన్నపుడు బొగ్గుగనుల వేలంపాటను అడ్డుకున్నట్లు అబద్ధాలు చెప్పారు. విషయం ఏమిటంటే కమర్షియల్ మైనింగ్ యాక్ట్ కు 2015లో పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతిచ్చింది. అలాగే బొగ్గుగనుల వేలంపాటను తాము అడ్డుకున్నట్లు చెప్పటం పూర్తిగా అబద్ధమే. ఎలాగంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే అంటే 2022లోనే కోయగూడెం, సత్తుపల్లి-3 ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ను వేలంపాటల్లో అరబిందో కంపెనీ సొంతంచేసుకుంది.
అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు వేలంపాటలను అడ్డుకోలేకపోయింది, రెండు గనులు అరబిందో కంపెనీ సొంతం చేసుకోకుండా ఆపలేకపోయింది. అధికారంలో ఉన్నపుడు చోద్యంచూసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇపుడు బొగ్గుగనులు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని చెప్పటమే పెద్ద జోక్. మోడి ప్రభుత్వం తెచ్చిన మైనింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తు బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులో కేసు వేసుంటే చట్టాన్ని వ్యతిరేకించినట్లుండేది. కాని అధికారంలో ఉన్నంతకాలం కేసీయార్ ఆ పనిచేయలేదు. పోనీ తెలంగాణాలో ఉన్న గనులను సింగరేణికే సొంతం చేసేట్లుగా చట్టంలో ఏమైనా మినహాయింపులు తెచ్చుకున్నారా అంటే అదీలేదు. ఒడిస్సా, తమిళనాడు, గుజరాత్ లోని ప్రభుత్వరంగం సంస్ధలకు కొన్ని గనుల కేటాయించారని ఇపుడు కేటీయార్ గోలచేయటంలో అర్ధమేలేదు. పై రాష్ట్రాల్లో కొన్ని గనులను ప్రభుత్వ రంగసంస్ధలకే కేటాయించేట్లుగా మినహాయింపులు దొరికినపుడు మరి కేసీయార్ ప్రభుత్వం మాత్రం ఎందుకు ప్రయత్నించలేదు ? మోడి ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా కేసీయార్ కనీసం ప్రయత్నమన్నా చేసుంటే ఇపుడు వేలంపాటలను వ్యతిరేకించటంలో అర్ధముండేది.
ఇదే విషయమై ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బొగ్గుగనుల వేలంపాటలను ఆమోదించిందన్నారు. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గుగనుల వేలంపాటల్లో పాల్గొననీయకుండా యాజమాన్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవటం ద్వారా పెద్ద తప్పుచేసిందన్నారు. తెలంగాణా బొగ్గుగనుల వేలంపాటల్లో సింగరేణి యాజమాన్యాన్ని పాల్గొననీయకుండా చేసిన కేసీయార్ ప్రభుత్వం ఒడిస్సాలో వేలంపాటల్లో సింగరేణి యాజమాన్యాన్ని ఎందుకు పార్టిసిపేట్ చేయించారని నిలదీశారు. కేసీయార్ కుట్రవల్లే కోయగూడెం, సత్తుపల్లి-3 గనులు తన సన్నిహితులైన అరబిందో గ్రూపు, ప్రతిమ గ్రూప్ కంపెనీకి దక్కాయని ఆరోపించారు. తన సన్నిహిత కంపెనీలకు బొగ్గు గనులు దక్కేట్లుచేసి సింగరేణి యాజమాన్యాన్ని కేసీయార్ అప్పట్లో దెబ్బకొట్టారని మండిపోయారు. వేలంపాటల్లో పాల్గొనకపోతే గనులు దక్కవని తెలిసీ కేసీయార్ సింగరేణిని ఎందుకు వేలంపాటల్లో పాల్గొనకుండా ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గుజరాత్, తమిళనాడులో లిగ్నైట్, బొగ్గుగనుల్లో కొన్నింటిని ప్రభుత్వ రంగసంస్ధలకు నామినేషన్ మీద కేటాయించినట్లే తెలంగాణాలోని బొగ్గుగనులను సింగరేణికి కేటాయించేట్లుగా కేంద్రప్రభుత్వంతో మాట్లాడబోతున్నట్లు బట్టి చెప్పారు. తొందరలోనే ఈ విషయమై అఖిలపక్ష సమావేశం పెట్టి తీర్మానంచేసి నేతలతో కలిసి నరేంద్రమోడితో భేటీ అవబోతున్నట్లు బట్టి చెప్పారు. మోడి గనుక సానుకూలంగా స్పందించకపోతే వేలంపాటల్లో పాల్గొని బొగ్గుగనులను సొంతంచేసుకోవటం తప్ప సింగరేణికి వేరేదారలేదు.
సింగరేణిని ప్రైవేటీకరించటంలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నది నూరుశాతం అబద్ధం. అలాగే బొగ్గుగనుల వేలంపాటలను, సింగరేణిని ప్రైవేటుపరంకానీయకుండా అడ్డుకుంటామని కేటీయార్ చెప్పిందీ అబద్ధమే. అధికారంలో ఉన్న ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ, పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ రెండుపార్టీలు కలిసే సింగరేణిని ముంచుతున్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది.