
సీతమ్మ వారికి బంగారు చీరను నేస్తున్న హరిప్రసాద్
భద్రాద్రి సీతారాముల కల్యాణానికి బంగారు చీర బహుమతి
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణానికి సీతారాములకు పట్టు వస్త్రాలను సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ బహుమతిగా అందించనున్నారు.
చేనేతకు కేంద్రంగా మారిన సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాచలంలోని రామాలయం సన్నిధిలో జరగనున్న సీతారాముల కల్యాణానికి హరిప్రసాద్ సీతమ్మ వారికి బంగారు చీరను అందించనున్నారు. వైవిధ్యమున్న బంగారు, వెండి చీరలు నేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నెన్నో అవార్డులు పొందిన సిరిసిల్ల కార్మికుడు హరిప్రసాద్ ప్రత్యేకంగా డిజైన్ చేసి చేనేత మగ్గం పై నేసిన బంగారు పట్టుచీరను అందించనున్నారు. కల్యాణం సందర్భంగా రాముల వారికి కూడా పంచెను తన చేత్తో నేసి బహుమతిగా అందిస్తున్నానని హరిప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పది రోజులు శ్రమించి...
సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ పదిరోజుల శ్రమించి సీతమ్మ వారికి ప్రత్యేక బంగారు పట్టు చీరను నేశారు. చీర వేయడానికి 10 రోజుల పాటు శ్రమించానని హరిప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూలవిరాట్ దేవతామూర్తులను వచ్చే విధంగా నేశారు. చీర కింది బార్డర్లో శంకు చక్ర నామాలు హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా పొందుపరిచి నేశారు. అంతేకాకుండా చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా నేయడం విశేషం.
వన్ గ్రామ్ గోల్డ్ జరి పట్టు దారంతో...
చీరలో వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టు దారాన్ని ఉపయోగించి ఏడు గజాల చీరను ఎనిమిది వందల గ్రాములు ఉండేవిధంగా నేశారు. ఇలా దేవతామూర్తులకు అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని మా చేనేత కళను ప్రోత్సహించాలని హరిప్రసాద్ కోరారు. ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణానికి మా సిరిసిల్ల నేతన్నకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరిప్రసాద్ ప్రత్యేకంగా కోరుకున్నారు.గత మూడు సంవత్సరాలుగా సీతారాముల కల్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్న హరి ప్రసాద్ ను పలువురు అభినందించారు. సీతమ్మ వారికి సిరిసిల్ల నేత కార్మికుడు బంగారు పట్టుచీరను బహుమతిగా ఇవ్వడం గొప్ప విశేషమని కోరుట్లకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోనే రాజేంద్రప్రసాద్ ప్రశంసించారు.
Next Story