కేసీఆర్ లేఖతో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డికి అవమానం
x

'కేసీఆర్ లేఖతో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డికి అవమానం'

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.


విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా నియమించిన కమిషన్ కు కనీస గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఝానం లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన నర్సింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే.. వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరాని చర్య అన్నారు.

తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఛీ కొట్టి ఓడించినా కేసీఆర్ లో అహంకారం తగ్గలేదు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న ఆయన వాదనలో పస ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదు? కోర్టులో తన వాదనలను ఎందుకు విన్పించలేదు? అని బండి సంజయ్ నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అనేక అక్రమాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన ద్రుష్టికి వచ్చిన సమాచారం ఆధారంగా వివిధ రూపాల్లో క్రాస్ ఎగ్జామిషన్ చేస్తుంది. అందులో భాగంగా అంతర్గతంగా, బహిరంగంగా విచారణ చేసే అధికారం ఆ కమిషన్ కు ఉంది. దీనిని తప్పుపట్టడం హాస్యాస్పదం అన్నారు బండి సంజయ్.

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయాలను జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అనేక అవినీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతోందే తప్ప ఈఆర్సీ పై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ గారు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు.

కేసీఆర్ తన లేఖలో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పేర్కొనడం దుర్మార్గం. నర్సింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే ఆనాడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్రానికి జస్టిస్ శ్రీక్రిష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగ పర్చాలని ఆదేశాలు జారీ చేసి ఆ కమిటీలోని 8వ ఛాప్టర్ అంశాలను బట్టబయలు చేయించిన ధైర్యశాలీ జస్టిస్ నర్సింహారెడ్డి అని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉంటూ పోరాడిన ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు బయటకు రాకుండా వర్శిటీ గేటు ఎదుట ముళ్లకంచెలు వేసి నిర్బంధిస్తే... ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి. అలాంటి వ్యక్తి చిత్తశుద్ధిని శంకించేలా కేసీఆర్ వ్యవహరించడం, చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వితండవాదం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

చేసిన తప్పులను, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారని, ఏ స్థాయి వ్యక్తుల ప్రతిష్టనైనా దెబ్బతీసేందుకు వెనుకాడరనేదానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం అని బండి సంజయ్ అన్నారు. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్డిపొందాలనుకుని భావిస్తే... ‘కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఝానం లేకుండా మాట్లాడతారా? అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని బండి ఎద్దేవా చేశారు.

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి జరిగాయనేది బహిరంగ రహస్యం. ఈ విషయంలో కేసీఆర్ తప్పు చేయలేదని భావిస్తే నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తే సరిపోయేది. కానీ అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుపట్టడం, కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుండి వైదొలగాలంటూ నర్సింహారెడ్డి కి సూచించడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది. తక్షణమే కేసీఆర్ ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

"విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంతోపాటు కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ అక్రమాలపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ తోపాటు అప్పటి మంత్రులు, అధికారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే విషయంలో ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తోసహా బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? చేసిన తప్పులను ఒప్పుకోకుండా చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం నియమించిన కమిషన్ నే తప్పుపడుతూ.. నిష్పాక్షికంగా విచారణ జరుపుతున్న కమిషన్ ఛైర్మన్ ను తప్పుకోవాలంటూ బెదిరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్ తోసహా విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారందరినీ అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More
Next Story