బాలానగర్ సీతాఫలానికి జీఐ ట్యాగ్ దిశగా అడుగులు
x
బాలానగర్ సీతాఫలం...తెలంగాణకు దక్కనున్న జీఐ ట్యాగ్

బాలానగర్ సీతాఫలానికి జీఐ ట్యాగ్ దిశగా అడుగులు

తెలంగాణ మధుర ఫలానికి దక్కనున్న మైలురాయి


తెలంగాణలో (Telangana) సీతాఫలాల సీజన్ ఆరంభం అయింది...సీతాఫలాల్లో బాలానగర్ రకం(Balanagar custard apple) తియ్యదనంలో ప్రసిద్ధి చెందింది.బాలానగర్ కస్టర్డ్ యాపిల్‌కు జీఐ ట్యాగ్ (GI Tag) లభించనుండటంతో త్వరలో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించనుంది.


ఏమిటి దీని ప్రత్యేకత
బాలానగర్ కస్టర్డ్ యాపిల్ మందపాటి తొక్కతోపాటు అధిక గుజ్జు కంటెంట్ ఉంటుంది. తక్కువ విత్తనాలతో సహజ తీపి రుచితోపాటు , దీర్ఘకాలం నిల్వ ఉండే లక్షణం బాలానగర్ సీతాఫలానికి సొంతం.ఇంతటి ప్రత్యేకత, గుర్తింపు పొందిన బాలానగర్ కస్టర్డ్ యాపిల్ కు అధికారికంగా ఈ ఏడాది జూన్ 23వతేదీన క్లాస్ 31 కింద భౌగోళిక సూచిక (GI) రిజిస్ట్రేషన్ కోసం శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు.హైబ్రిడ్ రకం సీతాఫలాలు మార్కెట్ ను ముంచెత్తుతున్న నేపథ్యంలో బాలానగర్ సీతాఫలాల ప్రత్యేకత, ప్రాధాన్యాన్ని పరిరక్షించుకునేందుకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేశామని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



ఎక్కడ పండుతున్నాయంటే...

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ ప్రాంతంలో పండుతున్న సీతాఫలం భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ట్యాగ్) కోసం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.బాలానగర్ సీతాఫలాల సాగు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆరు మండలాలతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది.

గిరిజనులకు ఉపాధి
ప్రతీ ఏటా ఆగస్టు నుంచి నవంబరు నెలాఖరు వరకు సీతాఫలాల సీజన్ వస్తుంది. ఈ సీజనులో మధుర మైన ఈ సీతాఫలాలను ప్రధాన రోడ్లకు ఇరువైపులా బుట్టల్లో పెట్టి విక్రయిస్తుంటారు.ఈ సీతాఫలాల విక్రయంతో గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. అధిక గుజ్జుతోపాటు తియ్యగా ఉన్న బాలానగర్ రకం సీతాఫలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ సీతాఫలాలు బాలానగర్ ప్రాంతం నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

నాబార్డు సాయంతో జీఐకు దరఖాస్తు
నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)నిధుల సహాయంతో మూడు కీలక రైతు ఆధారిత సంస్థల తరపున జీఐ ప్రాక్టీషనర్ సుభాజిత్ సాహా ఈ దరఖాస్తును దాఖలు చేశారు.తెలంగాణ ఉద్యానవన శాఖ జీఐ దరఖాస్తు సంఖ్య 1569తో దాఖలు చేశారు. ఈ జీఐ ట్యాగ్ పొందడానికి చేపట్టిన ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూ.12.70 లక్షల నిధులు కేటాయించింది.ఈ అప్లికేషన్‌ను సాంకేతికంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం తరపున డాక్టర్ సైదయ్య పిడిగాం పరిశోధనలు జరపడంలో కీలక పాత్ర పోషించారు.డాక్టర్ సైదయ్య శాస్త్రీయ డాక్యుమెంటేషన్‌ను సంకలనం చేయడంతో పాటు పండ్ల యొక్క ప్రత్యేకమైన వ్యవసాయ-స్వరూప లక్షణాలను ధృవీకరించారు.

ఇతర సీతాఫలాలకు జీఐ ట్యాగ్
భారతదేశంలోని బీడ్ కస్టర్డ్ యాపిల్ (మహారాష్ట్ర), సియోని సీతాఫల్ (మధ్యప్రదేశ్), కాంకేర్ కస్టర్డ్ యాపిల్ (ఛత్తీస్‌గఢ్) కు జియోగ్రాఫికల్ ట్యాగ్ ఇప్పటికే లభించింది. తెలంగాణలోని బాలానగర్ సీతాఫలానికి జీఐ ట్యాగ్ వస్తే జీఐ ట్యాగ్ పొందిన 4వ కస్టర్డ్ యాపిల్‌గా నిలవనుంది. జీఐ ట్యాగ్ సీతాఫలాలు భారతదేశ గొప్ప ప్రాంతీయ జీవవైవిధ్యాన్ని చాటిచెబుతాయి.



జీఐట్యాగ్ రావాలంటే...

జీఐట్యాగ్ రావాలంటే దరఖాస్తు చేయడం,బాలానగర్ సీతాఫలంపై పరిశోధనలు చేసి దీని సాంకేతిక ప్రత్యేకతలతో నివేదిక రూపొందించారు.బాలానగర్ సీతాఫలం సాగు విస్తీర్ణం, దిగుబడిపై డేటాను సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు జీఐ రిజిస్ట్రీకి నివేదిక సమర్పించారు. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి చెందిన శాస్త్రవేత్తల బృందం తుదిదశగా కన్సాలిడేటివ్ గ్రూప్ మీటింగ్ పెట్టి వారికి వచ్చిన అనుమానాలపై ప్రశ్నలు తెలంగాణ ఉద్యాన శాస్త్రవేత్తలను అడిగి నివృత్తి చేసుకోనున్నారు. ఈ తుది సమావేశం అయితే బాలానగర్ సీతాఫలానికి జీఐ ట్యాగ్ వస్తుందని దీనిపై పరిశోధణలు చేసిన తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తెలంగాణ జీఐ ట్యాగ్ బ్రాండింగ్ వస్తువులివే...
పోచంపల్లి ఇక్కత్ చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, చేర్యాల్ స్రోల్ పెయింటింగ్, నిర్మల్ కొయ్య బొమ్మలు, చిత్రాలు, నిర్మల్ ఫర్నచర్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ , గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు. నారాయణ్ పేట్ చేనేత చీరలు, పుట్టపాక తెలియా రుమాల్, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్ , లాడ్ బజార్ లక్క గాజులు, తాండూర్ కందిపప్పునకు జీఐ ట్యాగ్ లభించింది. దీంతోపాటు భవిష్యత్ లో ఆర్మూర్ పసుపు, నల్గొండ దోసకాయలు, సిద్దిపేట అల్లం, అనాత్ ఈ షాహీ ద్రాక్ష, వరంగల్ చపాటా మిర్చి, కొల్లాపూర్ మామిడికాయలకు కూడా జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణలోని కొండా బాపూజీ ఉద్యోన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని బాలానగర్ కస్టర్డ్ యాపిల్ కు జీఐ ట్యాగ్ లభిస్తే రాష్ట్ర 19వ భౌగోళిక సూచికగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. తెలంగాణ ఉద్యానవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ప్రఖ్యాత బాలానగర్ కస్టర్డ్ యాపిల్ నిలవనుంది. జీఐ ట్యాగ్ వచ్చాక చట్టపరమైన రక్షణతోపాటు బ్రాండ్ గుర్తింపు లభించనుంది.తియ్యదనంలో, నాణ్యతలో, సహజతలో అధికంగా ఉండే ఈ పండు దేశీ విత్తనాల విలువను చాటిచెబుతూ హైబ్రిడ్ రకాలకు గట్టి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. బాలానగర్ సీతాఫలానికి జీఐ ట్యాగ్ లభిస్తే, అది రైతులకు మేలు, వైద్యరంగానికి వరం, ఆర్ధికంగా రాష్ట్రానికి బలమైన ఆదాయంగా మారే అవకాశం ఉందని ఆశించవచ్చు.



Read More
Next Story