చెయ్యెత్తి చీర్స్ కొట్టు తెలుగోడా!
2024 లో తెలంగాణ మరొక రికార్డు. తలసరి వార్షిక మందు ఖర్చులో ఇండియాలో నెంబర్ 1
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) అధ్యయనం ప్రకారం, దేశవ్యాప్తంగా ఏడాదిలో మద్యం పై ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ టాప్. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
తెలంగాణ తెలుగోడు మద్యం పై సగటు తలసరి వ్యయం రూ. 1,623 ఖర్చు చేస్తున్నాడు. ఇది దేశంలో అత్యధికం. ఆంధ్రప్రదేశ్ తెలుగోడు రూ. 1,306 ఖర్చుచేస్తూ రెండో స్థానంలో నిలబడ్డాడు. పంజాబ్ ప్రజలు రూ. 1,245 ల తలసరి ఖర్చుతో మూడో స్థానంలో ఉన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 34,145 కోట్ల ఆదాయం పొందింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 37,000 కోట్లకు పెరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రూ. 40,000 కోట్లు మించి ఆదాయం ఆశిస్తోంది.
ఆదివారం నుండి డిసెంబర్ 31 ఆర్థరాత్రి దాటి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేనాటికి మద్యం విక్రయం రూ. 1,000 కోట్లకు పైగా ఉండాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని విధాలు చర్యలు తీసుకుంటున్నారు.
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు డిసెంబర్ 31 న అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అదనంగా, బార్లు, పబ్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయానికి అనుమతి పొందాయి. మద్యం ఇప్పటికే సంబంధిత క్లబ్లు మరియు పబ్లకు తరలించబడింది. ప్రభుత్వం రాత్రి 1 గంట వరకు ఈవెంట్లను నిర్వహించడానికి అనుమతినిచ్చిన కారణంగా మద్యం విక్రయం భారీగా ఉంటుందని అంచనా.
ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా 11 రోజుల్లో రూ. 1300 కోట్ల విలువైన మద్యం లాగించేసి ప్రభుత్వ గర్వపడేలా చేశారు ప్రజలు.
తెలంగాణలో యువకుల జనాభా పెరుగుతుండటం, పట్టణీకరణ బాగా సాగుతూ ఉండటం, ఏదో ఒక ఉపాధితో నాలుగుపైసలు సంపాయిస్తూ ఉండటంతో రాష్ట్రం యువకుల్లో పార్టీ చేసుకోవాలనే కోరిక, చీర్స్ కొట్టాలనే ఆసక్తి పెరుగుతోంది. మద్యం సేవించడాన్ని రాష్ట్రంలో యువకులు, మహిళలు అనే తేడా లేకుండదా అంతా మాంచి వినోదంగా చూస్తున్నారు. ఈ ధోరణి హైదరాబాద్లో ప్రత్యేకంగా స్పష్టంగా కనబడుతోందంటున్నారు పరిశీలకులు.
మరొక గర్వకారణమేమంటే, మహిళలలో మందు కొట్టే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఉద్యోగ రంగంలో ప్రవేశించి ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తూ ఉండటంతో వాళ్లలో సాంస్కృతిక పరివర్తన మొదలయింది. వాళ్ల మనసు కూడా మద్యం వైపు మరలుతూ ఉంది. వాళ్లు కూడా మద్యపాన సేవనాన్ని ఒక సాంస్కృతిక వినోదంగా చూస్తున్నారు. ఇలా తెలంగాణ యువకులు,మహిళలు రాష్ట్రంలో మద్యం పరిశ్రమ వృద్ధికి బాట వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని బాగా పెంచుతున్నారు. తెలంగాణలో సుమారు 43 శాతం పురుషులు, 11 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్లు అంచనా. గత ఎనిమిది నెలలో తెలంగాణ ప్రభుత్వానికి రు. 20,903 కోట్ల ఆదాయం వచ్చింది వీళ్లందరి సహకారం వల్లే. ఇందులో లిక్కర్ అమ్మకాల ద్వారా రు. 10,295 కోట్ల ఆదాయం వస్తే,వ్యాట్ ద్వారా మరొక రు. 10607కోట్ల రాబడి వచ్చింది.
సాధారణంగా జూన్ నెలలో లిక్కర్ సేల్స్ విపరీతంగా ఉంటాయి. గత మూడు సంవత్సరాలలో జూన్ లో మనోళ్ల తెగ పార్టీ చేసుకున్నారు. జూన్ రాబడి 2002లో ఉన్న 2800 కోట్ల నుంచి 2024లో కోట్లకు చేరుకుంది. అయితే, 2023 డిసెంబర్ నెల రు. 4297 కోట్లతో ఆల్ టైమ్ టాపర్ గా నిలబడింది. 2024 డిసెంబర్ ఈ రికార్డును బ్రేక్ చేస్తుందేమో చూడాలి.