ఫేక్ అన్నారు.. కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ అవార్డ్ ఇచ్చేసింది
x

ఫేక్ అన్నారు.. కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ అవార్డ్ ఇచ్చేసింది

ఆమె యాక్సెంట్ పై ట్రోలింగ్స్ చేసిన వాళ్లే ఇప్పుడు మన తెలుగమ్మాయి అంటూ గర్వంగా చెప్పుకునేలా నటనతో మెప్పించింది.


"అమ్మ చేసింది మిస్, లైట్ గానే ఉంటుంది". ఇది ఓ కుకింగ్ ఆయిల్ యాడ్. ముప్పై సెకండ్ల ఈ యాడ్ లో నటించిన అవంతిక అనే బాలనటి తన హావభావాలతో, క్లాసికల్ డ్యాన్స్ తో అందరినీ మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం టీమ్ కంట్లో పడి సినిమా చాన్స్ కొట్టేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సౌత్ లో ఆఫర్లు పెరిగాయి. ఇప్పుడు ఆ బాలనటి టాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ సెన్సేషన్ గా మారిపోయింది.

దీనికి కారణం ఇటీవల ఆమె నటించిన "మీన్ గర్ల్స్" రిఫరెన్స్ తో వచ్చిన "బిగ్ గర్ల్స్ డోంట్ క్రై" అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ లో దూసుకుపోవడమే. తాజాగా ఆమె ప్రతిభకి మెచ్చి హార్వర్డ్ విశ్వవిద్యాలయం "సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డుతో సత్కరించింది. ఆమె యాక్సెంట్ పై ట్రోలింగ్స్ చేసిన వాళ్లే ఇప్పుడు మన తెలుగమ్మాయి అంటూ గర్వంగా చెప్పుకునేలా నటనతో మెప్పించింది.

అవంతిక వందనపు- భారతీయ సంతతికి చెందిన అమెరికన్ యాక్ట్రెస్. అమెరికాలో స్థిరపడ్డ హైదరాబాద్ బేస్డ్ దంపతుల ఒక్కగానొక్క గారాలపట్టి. పుట్టి పెరిగింది కాలిఫోర్నియాలో. చిన్నప్పటి నుంచే సంగీతం, డ్యాన్స్ వంటి కళలపై పట్టు సాధించింది. ఐదేళ్ల వయసులో డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. జూన్ 2014 లో జరిగిన జీ టీవీ రియాలిటీ షో "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ నార్త్ అమెరికా" లో సెకండ్ విన్నర్ గా నిలిచింది.

అవంతిక కి నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన తన తల్లి ఇండియాకి తీసుకువచ్చింది. ఇక్కడ అవంతికకి చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్రహ్మోత్సవం, ప్రేమమ్ వంటి సినిమాల్లో అవకాశం వచ్చింది. తర్వాత మనమంతా, ఆక్సిజెన్ మూవీస్ లో చిన్న పాత్రల్లో నటించింది. ఇక్కడ తనకి అనుకున్న స్థాయిలో రోల్స్ దొరకకపోవడంతో తిరిగి అమెరికా వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. అమెరికాకి వెళ్లి అమెరికన్ కన్జర్వేటరీ థియేటర్‌లో యాక్టింగ్ నేర్చుకుంది.

2021 లో డిస్నీ ఛానెల్ రూపొందించిన స్పిన్ మూవీ, 2022 లో నెట్ ఫ్లిక్ ఒరిజినల్ సీనియర్ ఇయర్ మూవీస్ లో చోటు దక్కించుకుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన హాలీవుడ్ వెబ్ సిరీస్ "బిగ్ గర్ల్స్ డోంట్ క్రై" లో కీ రోల్ లో నటించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఆమె నటనకి మెచ్చి హార్వర్డ్ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థ "సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డుతో సత్కరించింది. దీనిపై అవంతిక స్పందిస్తూ "నాకు ఇలాంటి గౌరవం దక్కడం నమ్మశక్యంగా లేదు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రల్లో నటించి భారత స్వరాన్ని అన్నిచోట్లా వినిపించడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పింది 19 ఏళ్ళ అవంతిక.

ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లీష్ మీడియా ఛానెల్ కి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ బైట్ బాగా వైరల్ అయ్యింది. ఇది చూసిన కొందరు ఎందుకు ఈ అమ్మాయి అమెరికన్ యాక్సెంట్ తో షో చేస్తుంది అని ట్రోల్స్ చేశారు. కానీ వారికి అవంతిక అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి అని అప్పటికి తెలియదు.

తాజాగా ఆమె తెలుగు ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అసలు విషయం తెలిసి అంతా మన తెలుగమ్మాయి అంటూ అక్కున చేర్చుకుంటున్నారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. తాను అమెరికన్ యాక్సెంట్ ఎంత బాగా మాట్లాడుతుందో తెలుగు కూడా అంతే స్వచ్ఛంగా మాట్లాడుతుంది. అలాగే మోడర్న్ డ్రెస్సులు వేసుకుని కూడా నుదుటి బొట్టు ధరిస్తుంది. ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read More
Next Story