కేసీఆర్ రహస్యకోట గేట్లు తెరుచుకున్నాయి..!
x

కేసీఆర్ 'రహస్యకోట' గేట్లు తెరుచుకున్నాయి..!

కేసీఆర్ రహస్యకోట గేట్లు తెరుచుకున్నాయి. ఓటమి ఆయనని మార్చేసింది.


ఎర్రవెల్లి ఫామ్ లో కేసీఆర్ ఇల్లు ఎలా ఉంటుంది. భారీ కట్టడమేనా? ఎంట్రీ నుంచి ఎంత దూరం ప్రయాణిస్తే ఆయన నివాసానికి చేరుకోవచ్చు? అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించినట్టు ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిజంగానే పెద్ద బావి తవ్వేశారా? 300 కేజీల టమోటాలు విరక్కాసిన ఆ టమాటో చెట్టు ఏ మూలన ఉంది. పొలంలో ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవడమెలా? ఆ మాయా ప్రపంచం విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుందా? రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన నాయకులకే ఆయన ఫామ్ హౌస్ కి ఎంట్రీ ఉండదు. ఇక ఆ మాహిష్మతి రాజ్యంలోకి సామాన్యుడు వెళ్లే రోజులొస్తాయా? అంటే వచ్చాయి.

కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకున్నాయి. పార్టీ నేతలకి, అభిమానులకి, కార్యకర్తలకి... అందరికీ ఆ రహస్య కోటలోకి ప్రవేశం దొరికింది. గత పదిరోజులుగా ఆయన నేతలతో, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ధైర్యం నూరిపోస్తున్నారు. కలవడం కుదరదేమో అనుకున్నవాళ్ళకి కూడా కరచాలనం చేస్తున్నారు. అందరినీ దగ్గరకి తీసుకుంటున్నారు. కాదు కాదు తన దగ్గరకే పిలిపించుకుంటున్నారు. ఎక్కడైతేనేం, ఎలానైతేనేం.. తమ అధినేతని కలవడం వాళ్ళకి కూడా ఆనందమే కదా. ఇదే కదా పదేళ్ల నుంచి వారు ఎదురుచూస్తున్న క్షణం. ఓటమి తమ అధినేతని దగ్గర చేస్తుంది అనుకుంటే పోయిన టర్మ్ లోనే ఓడించేవాళ్లేమో. చెప్పలేం! ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రజలకి దూరమయ్యారు.

ప్రారంభోత్సవాలకు, ఎన్నికల ప్రచారాలకు ఏర్పాటు చేసిన సభల్లో కేసీఆర్ మెరవటం తప్ప.. అభిమానులని, కార్యకర్తల్ని ఆఖరికి నేతలని కలవటాలు కూడా కరువైపోయాయి. ఆయన కోటరీకి కాకుండా ఇతరులకు కేసీఆర్ దర్శనం అందని ద్రాక్షలాగా అయిపోయింది. విశేషమేమంటే బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చిన నేతలు ఆరోపిస్తున్నది కూడా అదే. ఏమైనా చెప్పాలి అనుకున్నా కేసీఆర్ ని కలిసే ఛాన్స్ లేకుండా పోయింది. ఇంత రాజకీయ అనుభవం ఉండి అలాంటి అవమానాలు తట్టుకోలేకపోతున్నాం అని. కానీ, ఓటమి కేసీఆర్ ని మార్చేసింది. పార్టీ శ్రేణుల్ని కలుస్తున్నారు. ఈరోజు కూడా ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుండి తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు. మనకు ప్రజా తీర్పే శిరోధార్యం. వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు. ప్రజల్లో కలిసివుంటూ వారి సమస్యలమీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని కేసీఆర్ పునరుద్ఘటించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story