ASER REPORT | తెలుగు చదవలేరు,లెక్కలు రావు, సర్కారు విద్యార్థుల తీరు
x

ASER REPORT | తెలుగు చదవలేరు,లెక్కలు రావు, సర్కారు విద్యార్థుల తీరు

తెలంగాణలో విద్యాస్థాయి నివేదికను చూస్తే దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.సర్కారు బడుల్లో విద్యార్థులకు తెలుగు చదవడం, లెక్కలు రావని సర్వేలో వెల్లడైంది.


తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 2024 వ సంవత్సరంలో విద్యాస్థాయి నివేదికను ఢిల్లీలోని అసర్ కేంద్రం రూపొందించింది. ఢిల్లీలోని అసర్ కేంద్రం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లోని 605 జిల్లాల్లోని 17,997 గ్రామాల్లో 15,728 పాఠశాలలు, 3,52,028 ఇళ్లలో, 6,49,491 మంది విద్యార్థులను సర్వే చేయగా చేదు నిజాలు వెలుగుచూశాయి. 605 జిల్లాల్లో 641 సంస్థలకు చెందిన 25,557 మంది వాలంటీర్లు అసర్ సర్వే చేశారు.


తెలంగాణలో అసర్ సర్వే
తెలంగాణలో వార్షిక విద్యాస్థాయి నివేదిక (అసర్)ను చూస్తే దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.తెలంగాణ రాష్ట్రంలోని 270 గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు 5,306 ఇళ్లకు వెళ్లి మూడు నుంచి 16 ఏళ్ల వయసున్న విద్యార్థుల విద్యాస్థాయిని పరిశీలించారు. ఎక్కువ మంది విద్యార్థులు భాగహారాలు, తీసివేతలు కూడా చేయలేక పోయారు.

చదువులో విద్యార్థుల వెనుకంజ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యాస్థాయిని పరీక్షించగా చదవులో వారు వెనుకబడి ఉన్నారని తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సగం మంది 2వతరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేక పోయారని సర్వేలో తేలింది.5వతరగతి చదవుతున్న 24 శాతం మంది విద్యార్తులు, 8వతరగతి చదవుతున్న వరాిలో 38.5 శాతం మంది బాగహారాలు చేయలేక పోయారు. 61.5 శాతం మంది భాగహారాలు చేయలేక పోయారు. చదువులో వెనుక ఉన్నా, 14 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో 34 శాతం మంది వద్ద స్మార్ట్ ఫోన్ ఉందని సర్వేలో వెల్లడైంది. 96 శాతం విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్ ఉండగా, ఇందులో 74.7 శాతం మంది ఫోన్లను పాఠశాలలకు తీసుకువస్తున్నారని తేలింది.

ప్రైవేటు పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 73.50 శాతానికి పడిపోయింది. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయుల హాజరు శాతం 85.5 శాతంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1,2వతరగతి విద్యార్థులు ఇతర తరగతుల విద్యార్థులతో కలిసి చదువుకునే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం 45.20 శాతానికి తగ్గింది. 53 శాతం పాఠశాల్లలో మాత్రమే విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంది. 5.4 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 18 శాతం పాఠశాలల్లో శౌచాలయాలున్నా అవి వినియోగంలో లేవు.

ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నా...
విద్యార్థులకు రీడింగ్ , రైటింగ్, గణితంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నా విద్యార్థుల విద్యాస్థాయి మాత్రం పెరగడం లేదని అసర్ సర్వేలో తేలింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో మూడవ తరగతి విద్యార్థుల్లో 7.8 శాతం మంది అక్షరాలు చదవలేక పోయారు. 26.5 శాతం మంది విద్యార్థులు లేఖలు చదవలేక పోయారు. విద్యార్థులు గణితంలో చాలా వెనుకబడి ఉన్నారని వెల్లడైంది. చాలామంది విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారాలు చేయలేక పోయారు. తెలంగాణలో 91 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు లేవు. విద్యార్థుల కోసం గ్రంథాలయాలు, బాలికల కోసం టాయ్ లెట్లు కూడా లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడామైదానాలు, క్రీడా పరికరాలు లేవు. దీనికి తోడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కూడా లేరు.

15 ఏళ్లుగా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదు
తెలంగాణలో గత 15 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోలేదని, దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోయాయయని చౌటుప్పల్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ గంజి మారయ్య వ్యాఖ్యానించారు. అసర్ నివేదిక వెలువడిన నేపథ్యంలో మారయ్య దీనిపై ‘ఫెడరల్ తెలంగాణ’ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎంఈఓలు పాఠశాలలకు హెడ్మాస్టర్లుగా పనిచేయాల్సి వస్తే స్కూళ్ల పర్యవేక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినా, సెలవు పెట్టినా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్నామ్నాయంగా టీచర్లు లేరని చెప్పారు.

సెలవులు, ప్రభుత్వ పనులతో విద్యాబోధనకు ఆటంకం
ప్రభుత్వ పాఠశాలలు ఏడాదికి 220 రోజులు పనిచేయాలని , కానీ అందులో ఉపాధ్యాయులకు 47 సెలవులు పోను 173 రోజులే మిగులుతుందని గంజి మారయ్య చెప్పారు. తెలంగాణలో కుల గణన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల నెలరోజుల పాటు విద్యా బోధనకు ఆటంకం కలిగిందన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఎన్నికల నిర్వహణ విధులు, పరీక్షలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల పాఠశాలల్లో విద్యాబోధన సజావుగా సాగడం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్వ శిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ లాంటి పలు కార్యక్రమాల పేరిట ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీని వల్ల పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. సంవత్సరంలో వంద రోజులు కూడా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుంటే వారి విద్యా ప్రమాణాలు ఎలా పెరుగతాయని ఆయన ప్రశ్నించారు. పాలకులు పాఠశాలలను పట్టించుకోక పోవడం, సరైన పర్యవేక్షణ లేక పోవడం వల్ల విద్యాప్రమాణాలు దారుణంగా దెబ్బతినడానికి కారణాలని హెడ్మాస్టర్ గంజి మారయ్య వివరించారు.





Read More
Next Story