
ఎస్ఎల్‌బీసీ సొరంగం సహాయ పనుల్లో దిగిన సైన్యం
ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిపోయిన చోట బురద పేరుకుపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సొరంగం కూలిన ప్రాంతానికి చేరుకోలేక పోయాయి.
సహాయ చర్యల కోసం శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. శ్రీశైలం వద్ద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో విపత్తు సహాయ దళాలు సొరంగం లోపలికి వెళ్ల లేక పోయాయి. సొరంగం లోపల మోకాళ్ల వరకు బురద చేరుకుందని ఓ ఎస్డీఆర్ఎఫ్ అధికారి చెప్పారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సొరంగం కూలిపోయిన భాగాన్ని చేరుకోవడానికి సవాళ్లు ఏర్పడ్డాయి.ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇతర రెస్క్యూ బృందాలు, సింగరేణి కాలరీస్ అధికారులతో కలిసి కూలిపోయిన సొరంగాన్ని పరిశీలించిన తర్వాత తిరిగి వచ్చాయి. కూలిపోయిన సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో 14వ కిలోమీటర్ల మార్క్ వద్ద శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ సొరంగం పైకప్పు యొక్క మూడు మీటర్ల భాగం కూలిపోయింది.సుదీర్ఘ విరామం తర్వాత నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైన నాలుగు రోజులకే కూలిపోయింది. కొంతమంది కార్మికులు తప్పించుకోగలిగినప్పటికీ, ఎనిమిది మంది కార్మికులు సొరంగం లోపల చిక్కుకున్నారు.
రంగంలో దిగిన సైన్యం
సికింద్రాబాద్‌లోని పదాతిదళ విభాగంలో భాగమైన భారత సైన్యం ఇంజనీరింగ్ రెజిమెంట్ సహాయక చర్యలకు మద్దతుగా ఎక్స్‌కవేటర్ డోజర్‌తో సిద్ధంగా ఉందని సైన్యం తెలిపింది.స్పెషలిస్ట్ ఇంజనీరింగ్ బృందాలు, ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఫీల్డ్ అంబులెన్స్ నుంచి మెడికల్ డిటాచ్‌మెంట్, ఒక అంబులెన్స్, మూడు అధిక సామర్థ్యం గల పంపింగ్ సెట్‌లు, సాయుధ గొట్టాలు, ఇతర ఉపకరణాలను సంఘటన స్థలానికి తరలించారు.
సొరంగం లోపలకు ఆక్సిజన్ పంపిస్తున్నాం : ఎంపీ మల్లు రవి
ఎన్డీఆర్ఎఫ్ నుంచి 145 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని నాగర్ కర్నూల్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చెప్పారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపిస్తున్నారని, నీటిని తొలగించడానికి 100 హెచ్ పీ పంపు, పెద్ద 250 కేవీ జనరేటర్ వస్తోందని ఎంపీ చెప్పారు.సొరంగం లోపల చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రవి వివరించారు.
Next Story