Kamareddy Suicides | అక్రమ సంబంధాలే ఎస్ఐల ఆత్మహత్యకు కారణమా?
వాజేడు ఎస్ఐ హరీష్ తన సర్వీసు రివాల్వరుతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది.
కామారెడ్డి జిల్లాలో సబ్ ఇన్ స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్, మరో కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ లో ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి,సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చెరువు కట్ట వద్ద ఎస్ఐ సాయికుమార్ పాదరక్షలు, పర్సనల్ కారు, నిఖిల్ పాదరక్షలు లభించాయి.
ఎలా బయటపడిందంటే...
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ సహా ముగ్గురి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఫోన్ల లొకేషన్ ఆధారంగా వెలుగుచూసింది. బిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం నుంచి స్విచాఫ్ వస్తుండటంతో పోలీసులు అతని కోసం దర్యాప్తు ప్రారంభించారు. మరో వైపు బీబీపేట పోలీసుస్టేషనులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. తన కుమార్తె ఇంటికి రాలేదని శృతి తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా...
విధులు ముగించుకొని వెళ్లిన కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లగా అక్కడ చెరువు గట్టుపై శృతితోపాటు నిఖిల్ సెల్ ఫోన్లు లభించాయి.పెద్ద చెరువు వద్ద ఘటనా స్థలంలో శ్రుతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఎస్ఐ సాయికుమార్ జేబులో అతని ఫోన్ లభించింది. ఆ ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. చెరువులో అనుమానంతో గజఈతగాళ్లతో గాలించగా చెరువులో శృతి, నిఖిల్, ఎస్ఐ సాయికుమార్ ల మృతదేహాలు లభించాయి.
పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే...
ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే వీరి ఆత్మహత్య మిస్టరీ బయటపడవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ చెప్పరు.
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ మధ్య వివాహేతర సంబంధం ?
బిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్ఐగా పనిచేశారు. రెండేళ్ల క్రితం బీబీపేట పోలీసుస్టేషనులో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతికి వివాహమై భర్తతో విడాకులు అయ్యాయని సమాచారం. దీంతో ఎస్ఐ సాయికుమార్, శృతిల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్ల మధ్య సొసైటీలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తున్న నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించాడని చెబుతున్నారు. ఎస్ఐ సాయికుమార్ బిక్కనూరు పోలీసుస్టేషనుకు బదిలీ కావడంతో వారి మధ్య దూరం పెరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శృతి ఒత్తిడి తీసుకురావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఎస్ఐ ల ఆత్మహత్యల వరుస ఘటనలు...
పోలీసు ఎస్ఐలు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఆ మహిళలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వాజేడు ఎస్ఐ హరీశ్ బాణోతు అనసూర్య అలియాస్ అనూషతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీయడం, ఆ తర్వాత ఆ మహిళ తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో హరీశ్ తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అనూషను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మరవక ముందే బిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్ తన స్నేహితురాలైన మహిళా కానిస్టేబుల్ శృతితో కలిసి చెరువులో దూకి మరణించడం సంచలనం రేపింది. కామారెడ్డి పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగుచూడనున్నాయి.
Next Story