కెటిఆర్, హరీష్ రావు కేసులకు ముందూ...వెనుకా
ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం వ్యాఖ్య
-జూకంటి జగన్నాథం
హరీష్ రావు కేటీఆర్ ల పై వచ్చిన ఆరోపణలపై ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. వారి స్వంత అవినీతి అక్రమాలు అణచివేతలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసుల దర్యాప్తు మొదలైంది . అయితే విచారణకు ముందే కేటీఆర్ జైలుకు పోయి యోగా చేసుకుంటానని ప్రగల్బాలు పలికాడు . తీరా అయ్యాక హైకోర్టును ఆశ్రయించాడు. హరీష్ రావు సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫోన్లు ట్యాప్ చేశాడనే ఆరోపణకు గురించిన వివరాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ,ఆయనపై కేసు నమోదు అయింది. అంతకుముందు తన పైన నమోదైన ఆరోపణల గురించి మాట్లాడుతూ హరీష్ రావు ఏమన్నారు. ‘తెలంగాణ ప్రజల కోసం ప్రతి పని చేశాను’ అని చెబుతూ ఒక అడుగు ముందుకేసి ‘తెలంగాణ ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకు పోతా’నని ఎన్ని కేసులైన పెట్టుకోమని ప్రభుత్వాన్ని సవాలు చేశాడు. కేసు నమోదు కాగానే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాడు.
ఇకపోతే తాజాగా భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ లో భాగంగా కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు జారీ చేయగానే తిరిగి హైకోర్టు లో క్రాష్ పిటిషన్ వేశారు . కేసులలో ఆయా పార్టీ రాజకీయ నేతలు హైకోర్టు పరుగుతీసి ఏదో మేరకు ఊరట పొందుతున్నారు. ఇదంతా చూసి తెలంగాణ సామాన్య ప్రజలు ఏమనుకుంటారు? క్లుప్తంగా ‘మేకపోతు గాంభీర్యం’గా చెప్పుకుంటారు.
వీళ్లు హైకోర్టుకు వెళ్లడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. న్యాయం కోసం ఏ కోర్టునైనా ఆశ్రయించే హక్కు అవకాశం ప్రతి పౌరుడు కలిగి ఉంటాడు . కానీ ఈ మొత్తం విషయంలో చెప్పొచ్చేదేమిటంటే వీళ్లు కేసులకు ముందు మాట్లాడిన మాటలు కేసుల అనంతరం ప్రవర్తించిన తీరు పూర్తిగా వ్యతిరేకమైనవి కావడమే. ఇక్కడ ముఖ్యమైన ఆలోచించవలసిన విషయం ఇదే.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు హైదరాబాద్ మహానగరం కార్పొరేషన్ (HMDA) లో ఫార్ములా-ఇ రేసు పేరుతో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దశలో కేసును కొట్టేయాలని మరి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఏదో మేరకు ఊరట పొందాడు.
తదనంతరం కేటీఆర్ అనేక విషయాలు కాగితాల మీది ఆధారాలేవో చూపించి విలేకరుల సమావేశాలు పెట్టి తాను ఏ తప్పు చేయలేదని అన్ని చట్ట ప్రకారం చేశానని చెప్పుకున్నారు. ఎన్ని చెప్పుకున్నా సమర్థింపులే అవుతాయి తప్ప మరొకటి కానేరదు కదా. ఎందుకంటే కేసు దర్యాప్తు దశలో ఉన్నది కాబట్టి. ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తుంటే తనపై కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారని కేటీఆర్ చెప్పడం చూస్తుంటే, తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని అనుకోవడం ఆయన పార్టీ ముఖ్య నాయకుల భ్రమ మాత్రమే అవుతుంది కానీ వాస్తవం కాబోదు.
పాడి కౌశిక్ రెడ్డిని ఇంట్లో నుంచి విచారణ నిమిత్తం పోలీసులు తీసుకుపోయినప్పుడు హరీష్ రావు తోపాటు మిగతా నాయకులు ‘అప్రజాస్వామికం’ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మంచిదే కావచ్చు కానీ వీరి బిఆర్ ఎస్ పార్టీ పరిపాలన కాలంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరాం ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడయినా, రేవంత్ రెడ్డి ఇంటి బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేసినప్పుడు ఈ ప్రజాస్వామ్య విలువలు ఎందుకు గుర్తు రాలేదో బిఆర్ఎస్ నాయకులకే తెలియాలి. పైగా వీళ్లు తామేదో ఉద్యమం చేశామని ఇకముందు ఉద్యమిస్తామని చెప్పడం హాస్యాస్పదం.
మరో ముఖ్యమైన కేసు పుష్ప-2 (Pushpa-2) విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ప్రమాద సంఘటన, హీరో అల్లు అర్జున్ పైన కేసు, అరెస్టు, దానిపైన హైకోర్టు బెయిల్ ఇవ్వడం వెంట వెంట జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. అయితే ఈ పరిణామాలపై విపక్ష ముఖ్య నాయకులు మాట్లాడుతూ “కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది’ అంటూ అల్లు అర్జున్ ను వెనకేసుకు రావడం చూస్తుంటే వీరి రాజకీయ సౌశీల్యత పైన అనేక అనుమానాలు రేక్షెత్తిస్తున్నాయి .
ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ప్రాథమికంగా వ్యాపారాత్మక లక్షణం ఉన్నది. నిర్మాతలకు హీరోలకు లాభ నష్టాలే ముఖ్యం తప్ప మరొకటి కాదు. ఈ హీరో సినిమా టాకీస్ వద్దకు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒకామె ప్రాణం గాలిలో కలిసిపోయింది . ఆమె కొడుకు ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి వాతావరణంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుల తీరు వాదనలు పూర్తిగా అసందర్భమే కాకుండా పస లేకుండా ఉన్నాయి.
ఒకప్పుడు ప్రభుత్వాలు ఆర్ట్, వాస్తవిక సినిమాలకు, సమాజం శ్రేయస్సు ఉపయోగం దృష్ట్యా పన్ను రాయితీ కల్పించేవి . కానీ ఇప్పుడు తద్విరుద్ధంగా వందల వేల కోట్లు పెట్టిన సినిమా బెనిఫిట్ షోల పేరుతో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఇంత భారీ పెట్టుబడి సినిమా తీయమన్నవారు ఎవరు? ప్రేక్షకులా లేక నిర్మాతలా విజ్ఞులు తెలుసుకోవాలి. ముందే చెప్పుకున్నట్టు లాభాలు అర్జించడమే ఈ పరిశ్రమకు ముఖ్యం తప్ప మరొకటి కాదని స్పష్టంగా తేలిపోయింది. అసలు ప్రభుత్వాలు ఇటువంటి వ్యాపారాత్మక లక్షణం కలిగిన సినిమాలకు బెనిఫిట్ షో పేరుతో టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడమే సహేతుకమైనది .
కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతమైన ప్రజా నాయకుల ప్రవర్తన తీరు అనేక అనుమానాలకు తావు ఇవ్వడం అసమంజసంగా ఉన్నది. గర్హనీయమైనది . ఈ సంఘటనలో మానవీయకోణం పైన దృష్టి పెట్టకుండా రాజకీయ వర్గాలు ఇలా ప్రవర్తించడం ముమ్మాటికి శోచనీయమైనది.