ఈ హైదరాబాద్ సరస్సును చంపేస్తున్నది ఎవరు?
x
అమీన్‌పూర్ సరస్సులో నాటి పక్షుల కిలకిలరావాలు నేడేవి? (ఫొటో క్రెడిట్ : హైదరాబాద్ బార్డింగ్ పాల్స్)

ఈ హైదరాబాద్ సరస్సును చంపేస్తున్నది ఎవరు?

విదేశీ మిత్రుల్ని కోల్పోయిన అమీన్‌పూర్ లేక్


(అమీన్‌పూర్ సరస్సు నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సలీం షేక్)


చుట్టూ బండరాళ్లు,చిన్న కొండలు...పచ్చని చెట్లు...వాటిపై వాలిన వివిధ రకాల పక్షులు...వాటి కిలకిలరావాలు...చుట్టూ ఆక్రమణలతో కుచించుకుపోయి... నీటిపై చెరువు మధ్యలో నిర్మించిన రోడ్డు....చెరువు అంచున వెలసిన షిర్డీ సాయిబాబా, కట్టమైసమ్మ దేవాలయాలు...పరిశ్రమల నుంచి వెలువడిన కలుషిత జలాలతో పచ్చగా మారిన నీళ్లు...ఇదీ నేటి అమీన్ పూర్ జీవవైవిధ్య సరస్సు బాగోతం. హైదరాబాద్ వాయువ్య శివార్లలోని బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్, మియాపూర్ ప్రాంతానికి సమీపంలో, హైదరాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సును ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సందర్శించారు. దశాబ్ద కాలం క్రితం పక్షుల కిలకిలరావాలతో కళకళ లాడిన ఈ సరస్సు నేడు జీవం కోల్పోయి కనిపించింది.



300 సంవత్సరాల నాటి చెరువు

300 సంవత్సరాల క్రితం నాటి ఇబ్రహీం కుతుబ్ షా (1550–1580 ఏడీ ) పాలనలో పటాన్‌చెరుకు చెందిన అబ్దుల్ ఖాదిర్ అమీన్ ఖాన్ తన తోటలకు సాగునీటిని అందించేందుకు ఈ సరస్సును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.నాడు ఈ సరస్సు నుంచి నీరందించిన తోటలు ఇప్పుడు లేవు, కానీ సరస్సు ఉన్నా ఆక్రమణలతో చిక్కి పోయి 93 ఎకరాలకే పరిమితం అయింది.నిజాం కాలంలో కీలకమైన ఈ చెరువు విభిన్న వన్యప్రాణులకు మంచినీరందించేది.ఈ చెరువు ఉపరితల ప్రాంతం 93 ఎకరాలు అంటే 0.38 కిలోమీటర్లు, గరిష్ఠ లోతు 26 అడుగులు, ఉపరితల ఎత్తు 1740 అడుగులతో విస్తరించి ఉంది. పర్యావరణ వ్యవస్థగా సరస్సు రూపాంతరం చెందిన ఈ చెరువు గద్దలు, గుడ్లగూబలు ఫ్లెమింగోలు వంటి జాతుల ఉనికితో జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా ఉండేది.



దేశంలోనే మొట్టమొదటి జీవవైవిధ్య సరస్సు...అమీన్ పూర్

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016వ సంవత్సరం నవంబర్‌లో జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా అమీన్‌పూర్‌ సరస్సును గుర్తించింది. ఇది భారతదేశంలో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మొట్టమొదటి సరస్సు.ఈ సరస్సుకు గొప్ప చరిత్రతోపాటు పర్యావరణ ప్రాముఖ్యత ఉంది.

నాటి ప్రాభవం నేడేది ?
2014వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమీన్‌పూర్ సరస్సు నుంచి బర్డ్ వాక్ ఆరంభించిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ దేశంలోనే పక్షిప్రేమికుల బిగ్ గ్రూపుగా ఎదిగింది. నాటి నుంచి నేటి వరకు గడచిన 15 ఏళ్లుగా హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు ఈ చెరువు చెంత బర్డ్ వాక్స్ చేస్తూనే ఉన్నారు...కానీ నాడు పక్షుల కిలకిలరావాలతో మార్మోగిన అమీన్ పూర్ సరస్సు కాలుష్య కాసారంగా మారడంతోపాటు ఆక్రమణల పాలవడంతో...నేడు ఆ ప్రాభవం కోల్పోయిందని చెప్పారు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ జనరల్ సెక్రటరీ రాజీవ్ ఖండేల్ వాల్. గతంలో అమీన్ చెరువును అందాలకు పరవశించిన పక్షిప్రేమికులైన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీశారు.పట్టణీకరణ, పారిశ్రామిక వ్యర్థాల వల్ల 15 ఏళ్ల తర్వాత ఈ చెరువు జీవ వైవిధ్య ప్రాభవం కోల్పోయిందని తాము తీసిన ఫొటోల్లోనే తేలిందంటారు రాజీవ్ ఖండేల్ వాల్.పక్షులు,వివిధ రకాల చేప జాతులు, సీతాకోకచిలుకలు, గబ్బిలాలు ఈ చెరువు వద్ద ఆవాసాలుండేవని అమీన్‌పూర్ సరస్సుపై పర్యావరణ నిపుణులు రాసిన పరిశోధనా పత్రాలు చెబుతున్నాయి.కానీ నేడు వీటి సంఖ్య తగ్గిపోతుందని తేలింది.



ప్రస్థుతం ఏమైందంటే...

అమీన్ పూర్ చెరువు విస్తీర్ణం కబ్జా కోరల్లో చిక్కి పోయింది. దీంతో విస్తీర్ణంతోపాటు నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయింది. చెరువు పశ్చిమ తీరంలోని రసాయన కర్మాగారాల నుంచి వ్యర్థ జలాలు ఈ సరస్సులోకి విడుదల చేస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి.సరస్సులోకి విడుదలయ్యే పారిశ్రామిక కాలుష్య కారకాల వల్ల చేపలు, కీటకాలు వంటి పక్షుల ఆహార గొలుసు తగ్గుతుంది.దీని వల్ల ఈ సరస్సులో పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది.సరస్సులోని నీరు పచ్చగా ఉండటం వల్ల అవి తాగడానికి పనికిరాకుండా పోయాయని హైదరాబాద్ నగరానికి చెందిన నేచర్ లవర్ ఫణికృష్ణ రావి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి : నేచర్ లవర్స్

ఈ చెరువు జీవ వైవిధ్యాన్ని కాపాడు కోవాలంటే సరస్సులోని కలుషిత నీటిని తొలగించి, పునరుజ్జీవింప చేయాలంటారు నేచర్ లవర్స్.‘‘జల మొక్కలు, చెరువు చుట్టూ మొక్కలను నాటి నాటి పచ్చదనాన్ని పెంపొందింపజేయాలి.సరస్సును కాలుష్యం నుంచి రక్షించడానికి బఫర్ జోన్‌ను సృష్టించాలి.పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేయాలి.అమీన్‌పూర్ సరస్సును పర్యావరన పరంగా అభివృద్ధి చేసి,పక్షులు,ఇతర వన్యప్రాణుల ఔత్సాహికులకు స్వర్గధామంగా తీర్చిదిద్దాలి’’అని సూచించారు నేచర్ లవర్ రాజీవ్ ఖండేల్ వాల్.



ఆక్రమణలతో కుచించుకుపోతున్న అమీన్ పూర్ చెరువు

జీవవైవిధ్య సరస్సు అయిన అమీన్ పూర్ జీవం కోల్పోయిందని హైదరాబాద్ నగరానికి చెందిన పర్యావరణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ చెరువు ఆక్రమణలతో కుచించుకు పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ చెరువులో చేపలు, దోమలు, పక్షులు, గబ్బిలాలు పెద్ద సంఖ్యలో ఉండేవని, కబ్జాలు, కాలుష్యం వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది. చెరువు మధ్యలో నీటిలోనే రోడ్డు నిర్మించారు. దీనివల్ల చెరువు ప్రాభవం కోల్పోయింది’’అని చెప్పారు డాక్టర్ లుబ్నా సార్వత్. రెవెన్యూ, హైడ్రా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, కోర్టులు పలు సార్లు ఈ చెరువు కబ్జాలపై సర్వేలు, విచారణలు జరిపినా దీన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడే వారు కొరవడ్డారని పర్యావరణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ చెప్పారు.



శాటిలైట్ చిత్రాల్లో తేలిన నిజం

అమీన్ పూర్ చెరువును 2021 నవంబరులో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రంలో విస్తీర్ణంతోపాటు నీటి గలగలలు కనిపించాయి. ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ తో పాటు దీనిచుట్టూ ఉన్న బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. చెరువు ఎఫ్టీఎల్ తరువాత నీటి పరివాహక ప్రాంతాన్ని బఫర్ జోన్ గా పిలుస్తారు. చెరువులో లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని డిసైడ్ చేస్తారు.సాధారణంగా ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే వంద అడుగుల వరకు ఎలాంటి భవన నిర్మాణాల్ని నిర్మించకూడదు. బఫర్ జోన్ పరిధిలోనూ ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు.కానీ ఈ శాటిలైట్ చిత్రంలో చెరువు అంచునే భవనాలు వెలిసినట్లు కనిపిస్తోంది.



2024 ఫిబ్రవరి నెలలో తీసిన అమీన్ పూర్ చెరువు శాటిలైట్ చిత్రంలో చెరువు విస్తీర్ణం తగ్గటాన్ని చూడవచ్చు. షిర్డి సాయిబాబా మందిరం చెరువు అంచునే వెలసింది. చెరువు కట్ట పక్కనే వందలాది భవననిర్మాణాలు వెలిశాయి. చెరువు నీటిలో నుంచి రోడ్డును కూడా నిర్మించారు.చెరువు విస్తీర్ణం తగ్గడంతో దీనిలో నిల్వ ఉన్న నీటి శాతం కూడా తగ్గింది. దీనివల్ల చెరువులోొ చేపలే కాదు వలస పక్షుల సంఖ్య కూడా తగ్గిందని హైదరాబాద్ వాయిస్ ఆఫ్ నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్ వర్మ ‘ఫెడరల్ తెలంగాణాకు చెప్పారు.


చెత్తను తొలగించిన వాలంటీర్లు
ఎర్త్ నీడ్స్ యూ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు వారాంతాల్లో అమీన్ పూర్ చెరువును పరిశుభ్రం చేశారు. చెరువు గట్లపై పేరుకున్న చెత్త చెదారాన్ని తొలగించారు. విశ్వ సస్టెనబుల్ సొసైటీ వాలంటీర్లు ఈ చెరువులో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఖాళీ నీటి బాటిళ్లు, తినుబండారాల కవర్లు తొలగించారు. ఈ చెరువును దత్తత తీసుకున్న వాలంటీర్లు వీకెండ్స్ లో చెత్తను సేకరించి జీహెచ్ఎంసీకి అప్పగించి దాన్ని తరలించారు. గతంలో ఈ చెరువును సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ దత్తత తీసుకున్నా, చెరువులోకి చేరుతున్న కలుషిత జలాలకు బ్రేక్ వేయలేక పోయింది.

నీట మునిగిన లేఔట్ల ప్లాట్లు
అమీన్‌పూర్ చెరువు చెంత వేసిన లే ఔట్ల ప్లాట్లు ఇటీవల కురిసిన భారీవర్షాలకు నీటమునిగాయి. ఈ చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను హైడ్రా ఇటీవల కూల్చివేసింది. నవ్య చౌరస్తాలో అక్రమ భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. గోల్డెన్ కీ, వాణినగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెంకటరమణ కాలనీలో ఇటీవల ఆక్రమణలపై సర్వే చేశారు. కిష్టారెడ్డిపేట్, పటేల్ గూడలలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలను నిర్మించారని హైడ్రా గుర్తించింది.



హైడ్రా కూల్చివేతలు

కిష్టారెడ్డిపేట సర్వే నంబరు 164లోని మూడు అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చింది. పటేల్ గూడలోని సర్వే నంబరు 12/ 2, 12 /3 లోని ప్రభుత్వ స్థలంలో 25 ఇళ్లు ఆక్రమించి నిర్మించారని తేలడంతో వాటిని హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లలో ని స్థలాలను ఆక్రమించి పద్మావతి నగర్ లేఅవుట్ ప్రహరీ గోడ, సెక్యూరిటీ గదులు నిర్మించడంతో వాటిని హైడ్రా తొలగించింది. సాక్షాత్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి చెరువు భూమిని కబ్జా చేసిన బాగోతం హైడ్రా దర్యాప్తులో తేలింది.

జాతీయ హరిత ట్రిబ్యునల్ దర్యాప్తు
ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లోని కొండలు, భూమిని తాను కొనుగోలు చేశానని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT)కి మాజీ ఎమ్మెల్యే అఫిడవిట్ దాఖలు చేయడంతో దర్యాప్తు చేస్తుంది.ఈ సరస్సులోని 93 ఎకరాలు శిఖం నీటి వనరుగా, బఫర్ జోన్‌లోని అదనంగా 170 ఎకరాల పట్టా భూమిని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

ముంపు బాధితుల పేరిట జేఏసీ
అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులమని కొందరు ఆక్రమణదారులు జేఏసీగా ఏర్పడి డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యవహారం ఇటీవల హైడ్రా దృష్టికి వచ్చింది. ఈ చెరువు ఎఫ్ టీ ఎల్ నిర్ధారణ కోసం హైడ్రా చేస్తున్న కసరత్తును ఆసరాగా తీసుకొని కొందరు దందాలకు పాల్పడ్డారని హైడ్రా దర్యాప్తులో తేలింది. గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా , నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఫొటోలతో సరిపోల్చి, అధికారులతో సమీక్షించి చెరువు ఫుల్ లెవెల్ ట్యాంక్ నిర్ధారణ చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



వలసపక్షుల కిలకిలరావాలు...నేడేవి?

అమీన్ పూర్ చెరువులో చెట్ల కొమ్మలు, చెరువు గట్లు, ఎక్కడ చూసినా వలస పక్షులు రివ్వున ఎగురుతూ కిలకిలరావాలతో కనువిందు చేసేవి. చెరువులో నీటి కాలుష్యం వల్ల వలస పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక్రిశాట్ క్యాంపస్ తర్వాత వలస పక్షులు ఎక్కువగా కనిపించే ఈ చెరువు కాలక్రమేణా దీని ప్రాభవం కోల్పోతుంది. తలమీద నల్లని గీతలు ఉండే బాతులు,పెలికాన్, కింగ్ ఫిషర్, ఫ్లెమింగో పక్షులను తమ కెమెరాల్లో బంధించేందుకు పక్షిప్రేమికులు,నేచర్ ఫొటో గ్రాఫర్లు తరలివస్తుంటారు.అమీన్ పూర్ చెరువులోని నీరు సమీపంలోని ఇళ్లలో నుంచి వస్తున్న మురుగునీరు, పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత నీటితో రంగు మారింది. దీంతో పక్షుల రాక తగ్గింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ చెరువులోకి కాలుష్య జలాలు చేరకుండా నిరోధించడంలో విఫలమయ్యారు.

ఏ ఏ పక్షులుండేవంటే...
ఈ సరస్సులో ఫ్లెమింగోలు, ఎగ్రెట్స్, హెరాన్లు, కార్మోరెంట్లు, కింగ్‌ఫిషర్లు, రివర్ టెర్న్‌లు వంటి వివిధ నివాస,విదేశీ వలస పక్షులు సరస్సును సందర్శిస్తుండేవి. హైదరాబాద్‌లోని పక్షి పరిశీలకులకు ప్రధాన ప్రదేశంగా నిలిచిన ఈ సరస్సు 8 రకాల క్షీరదాలు, 166 పక్షులు, 45 హెర్పెటోఫౌనా (12 ఉభయచరాలు, 34 సరీసృపాలు), 9 జాతుల చేపలు, 143 అకశేరుకాలు (26 జల బీటిల్స్, 41 సీతాకోకచిలుకలు, 18 ఒడోనేట్‌లు, 25 అరాక్నిడ్‌లు నివాసంగా ఉండేవని వన్యప్రాణి నిపుణులు చెబుతుంటారు.



నాటి పక్షులు నేడేవి?

బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించిన అమీన్‌పూర్ సరస్సులో 2002వ సంవత్సరంలో ఫ్లెమింగోలు, పెలికాన్‌లతో సహా 220 కి పైగా నివాస,వలస పక్షులకు నిలయంగా ఉండేదని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరికృష్ణ ఆడెపు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నాడు 220 రకాల పక్షులుంటే నేడు వీటి సంఖ్య గణనీయంగా తగ్గిందని, వలస పక్షుల సంఖ్య కూడా పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ చెరువు కీలక పాత్ర పోషిస్తుంది. పట్టణీకరణ ప్రభావం, కలుషిత జలాలతో చెరువు గొప్ప జీవవైవిధ్యాన్ని కోల్పోయింది... ఈ జీవవైవిధ్య చెరువును కాపాడి భావితరాలకు అందించాలి’’ అంటారు హరికృష్ణ ఆడెపు.


Read More
Next Story