ముగిసిన టీపీసీసీ చీఫ్ నియామకం.. మహేష్‌కే పార్టీ పగ్గాలు
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవి పై ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవి పై ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం వెంటనే అమలవుతుందని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను ముగించిచుకున్న రేవంత్ రెడ్డి.. పార్టీ కోసం చేసిన సేవలను పార్టీ ఎన్నటికీ మరువదని ఏఐసీసీ వివరించింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్‌కు తెంగాణ కాంగ్రెస్ పగ్గాలను అందించడంపై బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.
మహేష్ గౌడ్ రాజకీయ నేపథ్యం..
బొమ్మ మహేష్ గౌడ్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తొలిసారి 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. అనంతరం 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం మైనార్టీలకు టికెట్ కేటాయించడంతో మహేష్ గౌడ్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఆయన పార్టీలో పదవులు పొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మహేష్ గౌడ్ ని అదృష్టం వరించింది అని చెప్పాలి. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవిని కూడా దక్కించుకోబోతున్నారు. విద్యార్థి దశలో కాంగ్రెస్ పంచన చేరిన ఆయన.. ఎలాంటి కష్టసమయంలోనూ పార్టీని విడిచిపెట్టలేదు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినందుకు.. అధిష్టానం ఇప్పుడు టీపీసీసీ పదవితో గుర్తింపునిస్తోంది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.