
అడవిలో లభ్యమైన పులి కళేబరం
తెలంగాణ అభయారణ్యంలో పులుల మృత్యువాత
పులుల పరిరక్షణ కోసం ప్రభుత్వం రిజర్వు చేసిన అభయారణ్యాల్లోనే పులులకు రక్షణ కొరవడింది. తరచూ పులులు మృత్యువాత పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
పర్యావరణ పరిక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడే పులులు వేటగాళ్ల ఉచ్చు, విద్యుత్ కంచెల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలోని పులుల అభయారణ్యాల్లోనే పులులకు రక్షణ కొరవడింది. దేశంలో ఇటీవల 200కు పైగా పులులు మరణించాయని నేషనల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల రికార్డులే చెబుతున్నాయి.అభయారణ్యాల్లోని పులుల పరిరక్షణకు సరైన చర్యలు అటవీశాఖ అధికారులు తీసుకోక పోవడంతో తరచూ పులులు మృత్యువాతపడుతున్నాయి.
మృత్యువాత పడుతున్న పులులు
2022వ సంవత్సరంలో దేవంలో 204 పులులు మరణించాయని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. 2023 వ సంవత్సరంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని టైగర్ కారిడార్ లో 25 పులులు మరణించాయి. 2024వ సంవత్సరంలో 13 పులులు మృత్యువాతపడ్డాయి. పులులు పశువులపై దాడి చేస్తున్నాయని అటవీగ్రామాల రైతులు విషప్రయోగం చేస్తున్నారు. అసిఫాబాద్ జిల్లాల్లో విషప్రయోగానికి గురైన ఓ పశువును తిన్న రెండు పులులు మరణించాయి. దీంతో కవ్వాల్, తాడోబా పులుల అభయారణ్యాల్లో పులుల రక్షణకు అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతతో చర్యలు చేపట్టారు.గతంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోనూ ఓ పులి కళేబరాన్ని అధికారులు గుర్తించారు.
ఆడపులి మృతిపై దర్యాప్తు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఆడపులి మృత్యువాత పడింది. పెంచకల్ పేట్, రెబ్బెన, బెజ్జూరు అడవుల్లో సంచరించే కే -8 ఆడపులి వేటగాళ్ల ఉచ్చుకు నేలకొరిగిందని సమాచారం. ఆరేళ్ల వయసు గల ఆడపులి మూడు కూనలకు జన్మనిచ్చింది.గుండెపల్లి అటటవీ సెక్షన్ అగర్ గూడ బీట్ లో ఆరు సంవత్సరాల వయసున్న ఈ ఆడపులి కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
అప్రమత్తమైన అటవీ అధికారులు
ఈ ఆడపులి విద్యుదాఘాతానికి గురైందా లేదా వేటగాళ్ల వల్ల మరణించిందా అనే కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నామని అటవీశాఖ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ పులి తోలు ఒలిచి, గోర్లు తీసి కళేబరాన్ని పూడ్చిపెట్టారు.ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యంలోనే ఆడపులి కళేబరం లభించడంతో పులుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రేగిచెట్టు మడుగు ప్రాంతంలో ఆడపులి కళేబరం కనిపించడంతో అసలు పులుల అభయారణ్యంలోనే వీటికి భద్రతపై సందేహాలు తలెత్తాయి. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
వేటగాళ్ల ప్రమేయముందా?
మరణించిన ఈ పులి 2015వ సంవత్సరం నుంచి కవ్వాల్ అభయారణ్యంలో ఉందని అటవీశాఖ అధికారులు చెప్పారు. మరణించిన పులి కదంబ 8గా అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరణించిన పులి 2020వ సంవత్సరంలో రేగిచెట్టు మడుగు ప్రాంతంలోని పెద్దవాగులో నీరు తాగుతుండగా కెమెరా ట్రాప్ కు చిక్కింది. అప్పటి వీడియో ద్వారా మరణించిన పులిని గుర్తించారు.అటవీగ్రామాల్లో అడవి పందులు, జింకల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ తీగల కంచెలను పొలాలకు పెడుతున్నారు. ఈ విద్యుత్ కంచె వల్ల పులి మరణించిందా? లేదా వేటగాళ్ల వేటుకు నేలకొరిగిందా అనేది అటవీశాఖ అధికారుల దర్యాప్తులో తేలనుంది.
దాడుల్లో నేలకొరుగుతున్న పులులు
పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యంలోని రాందేగి అడవుల్లో రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక పులి మరణించింది. బ్రహ్మ, చోటామట్కా అనే రెండు పులుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో బ్రహ్మ అనే పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ పులి కళేబరానికి పంచనామా చేసి పూడ్చిపెట్టారు. ఈ ఘటనలో చోటా మట్కా అనే పులి గాయపడింది.గాయపడిన పులి కోసం అధికారులు గాలిస్తున్నారు. గతంలోనూ భజరంగ్, మోగ్లి అనే రెండు పులులను చోటామట్కా హతమార్చిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.
పులి దాడిలో అయిదుగురు తునికాకు కూలీల మృతి
కుమరం భీంఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల్లో తునికాకు సేకరణకు వెళ్లిన గిరిజనులపై పులులు దాడులు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇటీవల నాలుగు రోజుల్లో జరిగిన పులుల దాడుల్లో ఐదుగురు తునికాకు కూలీలు మరణించారు.కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుల్లోని చంద్రపూర్ జిల్లాలోని సింహవా తాలూకాలోని మెండమాల గ్రామానికి చెందిన కాంత చౌదరి (65), రేఖసిండే (51), శుభంగి చౌదరి (28),విమలా షిండే (64), చంద్రాపూర్ జిల్లా మూల్ తాలూకాలోని బదురానానికి చెందిన భూమికా బెండర్ (28)లు పులి దాడిలో మృత్యువాతపడ్డారు.ఈ ఘటనతో తునికా సేకరణను మహారాష్ట్ర అటవీ శాఖ నిలిపివేసింది.
Next Story