శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో మలుపు
x

శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో మలుపు

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది.


హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు మరో ముందడుగు వేశారు. మంగళవారం ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన అక్రమ సంపాదనకు సహకరించిన, బినామీలుగా వ్యవహరించిన గోదావరి సత్యనారాయణ మూర్తి, పెంట భరత్ కుమార్, పెంట భరణి కుమార్ లను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.

ముగ్గురు నిందితులను నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో అధికారులు హాజరుపరిచారు. వీరికి 14 రోజులపాటు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు నిందితులను చంచల్ గూడా జైలుకి తరలించారు.

కాగా, జనవరిలో అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని, ఆయన సోదరుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోవడంతో న్యాయస్థానం వీరిద్దరికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. దీంతో సోదరులిద్దరూ చంచల గూడ జైలు నుంచి రెండు వారాల క్రితం విడుదలయ్యారు.

శివబాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న అభియోగాలతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో, కార్యాలయంలో, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా శివబాలకృష్ణ పేరిట, బినామీల పేరిట 214 ఎకరాల భూమి, ఏడు ఇళ్లు, ఒక విల్లా కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు బయటపడిన ఆస్తులు రూ.250 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తేల్చారు. దీంతో ఆయన్ని కోర్టులో హాజరుపరిచి చంచల్ గూడా జైలుకి తరలించారు.

ఇక ఈ కేసులో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారించారు. నవీన్ విచారణ కూడా ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్ పై విడుదలై ఉన్నారు. తాజాగా ఈ కేసుతో సంబంఫంధం ఉన్న మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Read More
Next Story