తెలంగాణలో నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ
x

తెలంగాణలో నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ

అభిషేక్ మను సింఘ్వీ సోమవారం రాజ్యసభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.


తెలంగాణలో రాజ్యసభ పదవికి కాంగ్రెస్ నేత కేకే రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇటీవలే ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం... ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల ప్రకటించనుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అయితే ఈ స్థానానికి అభ్యర్థి గా జాతీయ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. నేడు (సోమవారం) ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు.

సీఎం అభినందనలు...

తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సింగ్వీ ప్రాతినిధ్యం విభజన చట్టం అమలు, న్యాయ సంబంధ సమస్యల విషయంలో తెలంగాణకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మను సింగ్వీ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ఆయనని సత్కరించారు. కాసేపు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం సింఘ్వి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ప్రజా భవన్ లో కలిశారు.

ఇక ఈరోజు నామినేషన్ వేసేముందు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీ ఛాంబర్ లో సింఘ్వి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు భేటీలో పాల్గొన్నారు.

అభిషేక్ మను సింఘ్వీ ఎవరు?

అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది, జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997 నుండి 1998 వరకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌ గా బాధ్యతలు నిర్వహించారు. 2001 నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేసి ఏప్రిల్ 2006, 2018 లలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఆయన సేవలు కాంగ్రెస్ కి కీలకమని భావించిన అధిష్టానం... సింఘ్వీనే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story