లిక్కర్ కేసు: శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఎంతిచ్చారో చెప్పిన ఎంపీ
శరత్ రెడ్డి నుంచి బీజేపీ డబ్బులు తీసుకున్న వివరాల విషయం బయటకి రాగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంపై ఈడీ దాడులు చేసిందని ఆప్ ఎంపీ ఆరోపించారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు శరత్ చంద్రారెడ్డి నుంచి బీజేపీ రూ.60 కోట్లు తీసుకుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు.
సంజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తనతో సహా ఆప్ నాయకులను మద్యం కుంభకోణం కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిందన్నారు. మద్యం కుంభకోణానికి కింగ్ పిన్ గా ఈడీ పేర్కొన్న శరత్ రెడ్డి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 60 కోట్లు బీజేపీకి ఇచ్చారని, అయితే ఈ విషయంలో ఏజెన్సీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన తర్వాత, నవంబర్ 15, 2022న శరత్ బీజేపీకి 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని సంజయ్ పేర్కొన్నారు. ఆరు నెలల జైలు జీవితం తర్వాత, శరత్ కి మే 8, 2023న బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ. 50 కోట్లు ఇచ్చాడని సంజయ్ ఆరోపించారు.
తనను అరెస్టు చేయడానికి ముందు, 2022లో శరత్ చంద్రారెడ్డి బిజెపికి 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని సింగ్ పేర్కొన్నారు. మార్చి 21న శరత్ రెడ్డి నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ డబ్బులు తీసుకున్న వివరాల విషయం బయటకి రాగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంపై ఈడీ దాడులు చేసిందని ఆయన ఆరోపించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.