వన్యప్రాణి సప్తాహంలోనే వేటగాళ్ల వేటుకు చిరుతపులి బలి
x

వన్యప్రాణి సప్తాహంలోనే వేటగాళ్ల వేటుకు చిరుతపులి బలి

తెలంగాణలో అటవీశాఖ వన్యప్రాణుల పరిరక్షణ చర్యలు తీసుకోవడం లేదు. వన్యప్రాణి వారోత్సవంలోనే అమ్రాబాద్ అడవిలో ఓ చిరుత పులి వేటగాళ్ల వేటుకు నేలకొరిగింది.


అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోనే వేటగాళ్ల వేటుకు ఓ చిరుత పులి మృత్యువాత పడింది. పెద్ద పులులే కాదు చిరుతపులుల పరిరక్షణ కోసం రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్రాబాద్ అభయారణ్యంలోనే 9 ఏళ్ల వయసు గల చిరుత పులి కళేబరం గురువారం వెలుగుచూసింది.

- అమ్రాబాద్ అడవిలో అటవీశాఖ అధికారులకు లభించిన చిరుతపులి కళేబరాన్ని చూస్తే దానికి పలు గాయాలు కనిపించాయి. గాయాలను బట్టి వేటగాళ్లు చిరుతపులిని చంపి ఉంటారని అటవీ గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. చిరుతపులి కళేబరం నుంచి శాంపిళ్లను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్ కు పంపించారు. చిరుత పులి పోస్టుమార్టం రిపోర్టు వస్తే దీని మృతికి కారణమేమిటనేది తెలుస్తుంది.
- నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అమ్రాబాద్ ఫారెస్ట్ పరిధిలోని అమరగిరి, కొల్హాపూర్ రేంజిలో చిరుతపులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. అమ్రాబాద్ ఫారెస్ట్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి తన అధికారులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. చిరుత వృద్ధాప్యం కారణంగా మరణించలేదని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
- చిరుతపులిపై విషప్రయోగం జరిగిందా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో లేదా రోడ్డు ప్రమాదంలో చిరుత మరణించిందా అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు.
- చిరుత కళేబరాన్ని చూస్తే లోపల అవయవాలకు ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అమ్రాబాద్ అభయారణ్యంలో విద్యుత్ ఫెన్సింగ్ తీగలు లేవు కాబట్టి చిరుత విద్యుదాఘాతం వల్ల మరణించలేదని చెబుతున్నారు.

సీసీఎంబీకి చిరుత నమూనాలు
చిరుతపులి మృతి మిస్టరీగా మారటంతో దీన్ని కనుగొనేందుకు అటవీశాఖ అధికారులు, పశుసంవర్థక శాఖ అధికారులు దీని లివర్, చేతి గోళ్లు, వీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి పంపించారు.సీసీఎంబీ నుంచి రిపోర్టు వస్తే చిరుత మృతికి అసలు కారణాలు తెలుస్తాయని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి చెప్పారు.

చిరుతలకు నిలయం అమ్రాబాద్ అభయారణ్యం
2022 వ సంవత్సరంలో రాష్ట్ర అటవీ శాఖ జరిపిన గణనలో 180 చిరుతపులులున్నాయని తేలింది. అమ్రాబాద్ అడవిలో చిరుతపులి గాయాలతో మరణించి ఉండటాన్ని చూసిన అటవీశాఖ అధికారులు అడవిలో వేటగాళ్ల సంచారంపై ఆరా తీస్తున్నారు.



Read More
Next Story