'తాలిబన్ల కంటే సమస్యగా మారిన కుక్కలు'
తల్లిదండ్రులు చిన్నారులను బయటకి పంపాలంటేనే బెంబేలెత్తుతున్నారు. తెలంగాణలో ఏదొక మూలన వీధికుక్కలు చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి.
తల్లిదండ్రులు చిన్నారులను బయటకి పంపాలంటేనే బెంబేలెత్తుతున్నారు. తెలంగాణలో ఏదొక మూలన వీధికుక్కలు చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో పెద్ద అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షలు ఇది ప్రభుత్వ హత్య అంటూ అప్పటి అధికార ప్రభుత్వం బీఆర్ఎస్ ని నిలదీశాయి.
ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ని ఈ విషయంలో నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తోంది. కానీ వీధికుక్కల దాడి సమస్యకి మాత్రం సొల్యూషన్ దొరకలేదు. దీనిపై ప్రజల్లోనూ అసహనం ఉంది. సోషల్ మీడియా వేదికగా వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఐదు నెలల పసికందును వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. మంగళవారం ఉదయం తాండూరులో జరిగిన ఈ ఘటన మరోసారి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ కు చెందిన దత్తు వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన భార్య లావణ్య, ఐదు నెలల కొడుకు సాయినాథ్ తో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. రోజూలాగే మంగళవారం కూడా దత్తు ఫ్యాక్టరీ కి వెళ్ళాడు. లావణ్య పని మీద బయటకి వెళ్తూ నిద్రపోతున్న చిన్నారిని ఇంట్లోనే వదిలి వెళ్ళింది. లావణ్య ఇంటికి వచ్చేసరికి కుక్క దాడిలో తన కొడుకు రక్తం కారుతూ కనిపించాడు. వెంటనే విషయం భర్తకి తెలపడంతో ఇద్దరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. కుక్క ఫ్యాక్టరీ యజమానులదని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అది మా కుక్క కాదంటోన్న యజమాని భార్య...
దత్తు దంపతుల ఆరోపణలపై ఫ్యాక్టరీ యజమాని భార్య స్పందించారు. "దత్తు కొద్దిరోజులుగా మా ఫ్యాక్టరీలోనే పని చేస్తున్నాడు. దత్తు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఉదయం ఇళ్లవెంట బట్టలు అమ్మేవాళ్ళు వస్తే అవి కొనడానికి ఆమె బయటకి వచ్చింది. అదే సమయంలో వీధి కుక్క ఇంట్లోకి వెళ్లి బాబుపై దాడి చేసింది. ఈ ఘటనలో బాబు చనిపోయాడు. అయితే డబ్బుల కోసం మా కుక్క చంపినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీళ్ళు దానికి చికెన్, మటన్ పెడుతూ ఉంటారు. అదే అలవాటులో వచ్చి బాబుపై దాడి చేసిందని" యజమాని భార్య మీడియాతో చెప్పారు.
తాలిబన్ల కంటే సమస్యగా మారిన కుక్కలు -నెటిజెన్
తాండూర్ చిన్నారి ఘటనపై స్పందించిన నెటిజెన్ ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చారు. "తాలిబాన్ల కంటే కుక్కలు చాలా సమస్యగా మారుతున్నాయి. ఐదు నెలల చిన్నారి ఇంట్లో నిద్రిస్తుండగా.. కుక్క ఇంట్లోకి వెళ్లి చిన్నారిని చంపేసింది. వీధి కుక్కల బెడదపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి" అంటూ డిమాండ్ చేశారు.