మెడికల్ సీట్లు గాలిలో దీపమేనా ? అడ్మిషన్లకు దెబ్బేనా ?
x

మెడికల్ సీట్లు గాలిలో దీపమేనా ? అడ్మిషన్లకు దెబ్బేనా ?

ఈనెలాఖరులోగా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ మొదలవ్వాలి. నేషనల్ మెడికల్ కమీషన్ (ఎన్ఎంసీ) 8 కొత్త కాలేజీల్లోని 400 సీట్లకు అనుమతివ్వలేదు.


గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈనెలాఖరులోగా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ మొదలవ్వాలి. ఇప్పటివరకు నేషనల్ మెడికల్ కమీషన్ (ఎన్ఎంసీ) 8 కొత్త కాలేజీల్లోని 400 సీట్లకు అనుమతివ్వలేదు. దినికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో కాలేజీల్లో ఉండాల్సినట్లుగా అన్నీ సౌకర్యాలు లేవని కమీషన్ భావించటం. ఇక రెండోకారణం ఏమిటంటే నీట్ (నేషనల్ ఎంట్రన్ ఎలిజిబులిటి టెస్ట్) వివాదాల్లో పడటమే.

తెలంగాణాలోని 56 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మొత్తం 8515 సీట్లున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 28 కాలేజీల్లో 3915 సీట్లు, 28 ప్రైవేటు కాలేజీల్లో 4600 సీట్లు అడ్మిషన్లకు అందుబాటులో ఉన్నాయి. ఈమధ్యనే జరిగిన నీట్ పరీక్షలో మొత్తం 77, 849 మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో మెడికల్ కాలేజీల్లో సీట్లకు 47 వేలమంది అర్హత సాధించారు. అంటే వీరంతా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో చేరటానికి అర్హత సాధించారు. కొత్తగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 8 కాలేజీలు మొదలవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 8 కాలేజీల్లో అడ్మిషన్లకు నేషనల్ మెడికల్ కమీషన్ అనుమతిస్తేనే అదనంగా 400 సీట్లు అందుబాటులోకి వస్తాయి. యాదాద్రి భువనగిరి, గద్వాల్, కుత్బుల్లాపూర్, నర్సంపేట, నారాయణపేట, ములుగు, మెదక్, మహేశ్వరంలో కాలేజీలు రెడీగా ఉన్నాయి.

మామూలుగా అయితే ఎన్ఎంసీ నియమ, నిబంధనలకు కాలేజీలు అనుగుణంగా ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కమీషన్ తరపున ఒక ప్రత్యేక బృందం ప్రత్యక్షంగా వచ్చి ప్రతి కాలేజీని తనిఖీ చేస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల ఈసారి ప్రత్యేకబృందాలు తనిఖీలకు రాలేదు. అందుకనే వర్చువల్ పద్దతిలో కమీషన్ ప్రతి కాలేజీని తనిఖీ చేసింది. అయితే వర్చువల్ తనిఖీలో కొన్ని లోపాలను కమీషన్ నిపుణులు గుర్తించారు. వాటిని సరిచేయాలని ఆదేశించింది కమీషన్. అధికారులు కూడా కమీషన్ చెప్పినట్లుగా మార్పులు చేసి సమాచారం అందించారు. అయినా అనుమతుల గురించి కమీషన్నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఈనెలాఖరులో మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతాయని అనుకుంటున్నారు. అప్పటిలోగా కమీషన్ నుండి అనుమతులు రాకపోతే కొత్త సీట్లు అందుబాటులోకి రావటం అనుమానంగా తయారైంది.

కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రతి కాలేజీలోను 50 సీట్లున్నాయి. ఈ లెక్కన 8 కాలేజీల్లో 400 సీట్లు అందుబాటులోకి వస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్జుకేషన్(డీఎంఈ) ఉన్నతాధికారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కమీషన్ నుండి ఎలాంటి సానుకూలత కనబడటంలేదు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ళున్న రిజర్వేషన్ కూడా రద్దయిపోయింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణా కాలేజీల్లో ఏపీ విద్యార్ధులకు ప్రత్యేకంగా 15 శాతం రిజర్వేషన్ ఉండేది. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదేళ్ళు ఉమ్మడి రాజధాని కాబట్టి విభజన చట్టం ప్రకారం ఇక్కడి మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ దక్కింది. ఇఫుడు పదేళ్ళయిపోయింది కాబట్టి తెలంగాణా ప్రభుత్వం ఏపీ విద్యార్ధులకు 15 రిజర్వేషన్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యింది. ఈ లెక్కన 15 శాతం రిజర్వేషన్ రద్దుచేయటం వల్ల 290 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.

రిజర్వేషన్ రద్దువల్ల వచ్చిన 290 సీట్లు, 8 మెడికల్ కాలేజీల్లో వస్తాయని అనుకుంటున్న 400 సీట్లు మొత్తం 690 సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. 290 సీట్ల సంగతిని పక్కనపెట్టేస్తే 400 సీట్ల విషయమే గాలిలో దీపంలాగ తయారైంది. మామూలుగా అయితే మెడికల్ కౌన్సిలింగ్ కు రెండు నెలల ముందే కమీషన్ అడ్మిషన్లకు అనుమతిస్తుంది. 2022-23 విద్యాసంవత్సరంలో ఎనిమిది కొత్త కాలేజీల్లో, 2023-24 విద్యాసంవత్సరంలో తొమ్మిది కాలేజీల్లో అడ్మిషన్లకు కమీషన్ రెండునెలలకు ముందే అనుమతులిచ్చింది. మరిపుడు మాత్రం ఎనిమిది కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో ఎందుకని ఇంతవరకు సానుకూలంగా స్పందించలేదో అర్ధంకావటంలేదు. నీట్ వివాదం కోర్టులో క్లియర్ అయిపోతే వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ మొదలైపోతుంది. అప్పటికి కూడా కమీషన్ నుండి అనుమతులు రాకపోతే 400 సీట్ల భర్తీ సాధ్యంకాదు. అదేజరిగితే ఉత్తపుణ్యానికి 400 సీట్లను విద్యార్ధులు కోల్పోవాల్సుంటుంది.

400 సీట్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల సంఖ్య 3900 నుండి 4315కి పెరుగుతుంది. ఒకవైపు సమాజంలో డాక్టర్ల కొరత పట్టిపీడిస్తోంది. మరోవైపు మెడికల్ కమీషన్ కొత్త కాలేజీల్లో సీట్ల భర్తీ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఆగస్టు-సెప్టెంబర్లో విద్యాసంవత్సరం మొదలయ్యే సమయానికి కమీషన్ నుండి 400 సీట్ల విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story