ఆ దారిలొ మూడేళ్లలో 19వ పులి బలి
x
ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని పులి మృత్యువాత

ఆ దారిలొ మూడేళ్లలో 19వ పులి బలి

కిల్లర్ ట్రాక్’గా మారిన రూట్


తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు (Maharashtra-Telangana border) రైలు పట్టాలు పులుల (tigers) రక్తంతో ఎర్రబోతున్నాయి… ఆదివారం మరో పులి వేగంగా వస్తున్న రైలు ఢీకొని మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేస్తోంది. మూడేళ్లలో 19వ పులి రైల్వే ట్రాక్‌పై (killer track) ప్రాణం కోల్పోయింది. రైల్వే మార్గం పులులకు ప్రాణాంతక ఉచ్చు గా మారిపోయింది.రైల్వే అధికారుల నిర్లక్ష్యం వన్యప్రాణులకు మృత్యుశాసనంగా మారుతోంది.


ఆదివారం మరో పులి మృత్యువాత
తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండల శివార్లలో ఆదివారం రైల్వే ట్రాక్ ను పులి దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొంది. ఈ ఘటనలో తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌ కు చెందిన పులి మరణించింది. మహారాష్ట్రలోని అడవి నుంచి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోకి వస్తుండగా పులి రైలు ఢీకొని మరణించిందని తెలంగాణకు చెందిన అటవీశాఖ అధికారి కె శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



రక్తసిక్తం అవుతున్న రైల్వే లైన్

పొరుగున ఉన్న మహారాష్ట్ర ఆరు పులుల అభయారణ్యాలున్నాయి. తడోబా, పెంచ్, మాల్ఘాట్, సహ్యాద్రి, నవగాం నగజిరా, బోర్ టైగర్ రిజర్వులున్నాయి. దీంతో ఆ అడవుల్లో పులుల సంఖ్య విస్తారంగా పెరిగింది. దీంతో మహారాష్ట్ర పులులకు తగిన విస్తీర్ణంలో టెరిటోరి లేక తెలంగాణలోని కవ్వాల టైగర్ రిజర్వులోకి తరచూ వచ్చి పోతుంటాయి. మహారాష్ట్ర పులులు తరచూ సరిహద్దులు దాటేందుకు రైల్వే ట్రాక్ పైకి వస్తుండటంతో వేగంగా వెళ్లే రైళ్లు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటివరకు రైలు మార్గాల్లో ఆదివారం మరణించిన పులితో సహా 19 పులులు మరణించాయంటే ఈ సరిహద్దు రైలు పట్టాలు పులుల మృత్యువాతతో రక్తసిక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో గోండియా నుంచి బలార్షాకు వెళుతున్న ప్యాసింజర్ రైలు రాత్రి 11 గంటల ప్రాంతంలో పులిని ఢీకొట్టింది.ఈ ఘటనలో పులి అక్కడికక్కడే మరణించింది.బల్లార్షా-గోండియా రైల్వే లైన్‌లోని సిందేవాహి- అలెవాహి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని మరో పులి చనిపోయింది.

మూడేళ్లలో 19 పులుల మృతి
మహారాష్ట్రలో కిల్లర్ రైలు మార్గంలో మూడేళ్లలో 19వ పులి మృతి చెందింది. రైల్వే ట్రాక్ పై పులుల వరుస మరణాలపై నివేదిక సమర్పించాలని మహారాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదు. రైల్వే ట్రాక్ పై ప్రమాదాలు జరగకుండా పులుల రాకపోకల కోసం అండర్ పాస్ లను నిర్మించాలని కోరినా రైల్వే శాఖ చర్యలు తీసుకోలేదు. దీంతో బలార్షా- గోండియా రైలు మార్గంలో తరచూ పులులు మృత్యువాత (death corridor) పడుతూనే ఉన్నాయి.చంద్రపూర్‌లోని విహిర్‌గావ్ సమీపంలో వేగంగా దూసుకుపోతున్న రైలు ఢీకొని మరో పులి మృతి చెందింది. బల్లార్షా-కాజిపేట డౌన్ లైన్‌లో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తున్న ఐదేళ్ల వయసున్న పులిని ఢీకొట్టింది. మరణించిన పులులకు చంద్రపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లో డాక్టర్ రవికాంత్ ఖోబ్రగడే నేతృత్వంలోని పశువైద్యుల బృందం శవపరీక్ష నిర్వహించి, రైలు ఢీకొనడం వల్ల గాయాలు అయి రక్తస్రావం కారణంగా మరణించినట్లు నిర్ధారించింది.

మూసుకుపోయిన అండర్ పాస్ లు
బల్లార్షా-చందా ఫోర్ట్-గోండియా మార్గంలో అండర్‌పాస్‌లు, చిన్న వంతెనలున్నా అవి చెట్లతో మూసుకుపోయాయి. వీటిని పులుల రాకపోకల కోసం క్లియరెన్స్ చేయాలని కోరుతూ అటవీశాఖ రైల్వేకు లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. బల్లార్షా-గోండియా రైల్వే లైన్ లో ఈ ఏడాది అక్టోబర్ 13వతేదీన రైలు ఢీకొని ఒక మగ పులి మరణించింది. ఇప్పటివరకు గోండియా-బల్హర్షా రైల్వే రైలు ప్రమాదాల్లో 19 పులులు మరణించాయి.వరుస పులుల మరణాలపై వన్యప్రాణుల ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు.2025వ సంవత్సరం ఇప్పటివరకు చంద్రపూర్ జిల్లాలో రైల్వే ప్రమాదాల్లో 12 వన్యప్రాణుల మరణాలు నమోదయ్యాయి. వీటిలో మూడు పులులు, ఒక చిరుతపులి, మూడు స్లాత్ ఎలుగుబంట్లు, నాలుగు సాంబార్, ఒక అడవి పంది ఉన్నాయి.

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఫార్సులు బుట్టదాఖలా
అటవీ ప్రాంతాలు, పులుల ట్రాక్‌ల వెంట వన్యప్రాణుల సంచారాన్ని సులభతరం చేయడానికి చర్యలు చేపట్టాలని, అండర్ పాస్ లు, వంతెనలు నిర్మించాలని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) సిఫార్సు చేసింది. బల్లార్షా-గోండియా రైల్వే లైన్‌లోని గోండియా-వాడ్సా, వాడ్సా-నాగ్‌భిడ్-మూల్, ముల్-చంద్రాపూర్, చంద్రపూర్-రాజురా-తెలంగాణలోని కాగజ్‌నగర్ మార్గాల్లో వన్యప్రాణుల సంచారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసిన సిఫార్సులు కాగితాలకే పరిమితం అయ్యాయి.

వన్యప్రాణుల రాకపోకల కోసం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, నైన్పూర్ మధ్య రైలు మార్గంలో 10 అండర్‌పాస్‌లు, రెండు ఓవర్‌పాస్‌లు నిర్మించారు. కానీ బల్లార్షా-గోండియా రైల్వే లైన్‌పై అలాంటి చర్యలు తీసుకోలేదు. రైల్వే లైన్‌లో తరచుగా వన్యప్రాణుల మరణాల దృష్ట్యా ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో వన్యప్రాణి ప్రేమికులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.అయినా రైల్వే శాఖ చర్యలు తీసుకోలేదు. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక పోవడంతో ఈ రైలు మార్గంలో పులులు మృత్యువాత పడుతూనే ఉన్నాయి.


Read More
Next Story