ఖమ్మం జిల్లా  వరద తాకిడిలో 110 గ్రామాలు
x

ఖమ్మం జిల్లా వరద తాకిడిలో 110 గ్రామాలు

చెన్నై, వైజాగ్, అసోంల 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు తరలించాలని ఆదేశం


ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురవడంతోపాటుతెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. ఈరోజు ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో భారీ వర్షాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితిపై అమిత్ షా ద్రుష్టికి తీసుకెళ్లడంతోపాటు ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు. వెంటనే స్పందించిన అమిత్ షా తెలంగాణకు అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకుపంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను ఆదేశించారు.

అనంతరం బండి సంజయ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఫోన్ లో మాట్లాడుతూ ఖమ్మం నగరంలోని కరుణగిరి ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప ఇల్లు మొత్తం నీట మునిగిపోవడంతోపాటు చాలామంది ప్రజలు ఇంటి పైభాగంపై నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితితోపాటు, ఖమ్మం నగరం మొత్తం నీట మునిగిపోవడంతో ఖమ్మం అష్టదిగ్బంధంలో చిక్కుకుని రాకపోకలు బంద్ అయిన తెలుసుకున్నారు. ప్రజలను కాపాడేందుకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్న విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అట్లాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వర్షాల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులతోపాటు కొనసాగుతున్న సహాయక చర్యలపైనా బండి సంజయ్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా జాగ్రత్తగా ఉంటూనే అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

Read More
Next Story