రాహుల్ గాంధీ ఆగ్రహం.. స్టీల్ ప్లేట్లు ప్రత్యక్షం..
x

రాహుల్ గాంధీ ఆగ్రహం.. స్టీల్ ప్లేట్లు ప్రత్యక్షం..

లోక్‌సభా ప్రతిపక్ష నేత గుండెను పిండేసిన చిన్నపాటి వీడియో ఎవరిది? పాఠశాల విద్యార్థులతో కలిసి బీజేపీ నేతలు ఎందుకు కలిసి భోంచేశారు?


Click the Play button to hear this message in audio format

రాహుల్ గాంధీ(Rahul Gandh) ఆగ్రహం.. ఆ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని స్టీల్ ప్లేట్లలో వడ్డించేలా చేసింది. దీంతో పిల్లలే కాదు.. వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇంతకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రం షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ బ్లాక్‌ హుల్పూర్ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని(Mid-day meal) న్యూ్స్ పేపర్లలో వడ్డించారు. NDTV ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాగ్ ద్వారి నవంబర్ 6వ తేదీన 1.39 నిముషాల నిడివి గల ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరలయ్యింది. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. నా గుండెను పిండేసిన ఈ వీడియోను చూసిన తర్వాత అయినా పాలకులు సిగ్గుపడాలని ఎక్స్ వేదికగా బీజేపీని విమర్శించారు. దేశ భవిష్యత్తు ఇంతటి దయనీయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


విద్యార్థులతో కలిసి భోంచేసిన బీజేపీ నేతలు..

రాహుల్ పోస్టింగ్‌పై బీజేపీ(BJP) నేతలు అలర్ట్ అయ్యారు. నేటిజన్ల నుంచి కూడా భారీగా విమర్శలు వెల్లువెత్తడంతో కాషాయ పార్టీ నేతలు పాఠశాలకు వెంటనే స్టీలు ప్లేట్లను సమకూర్చారు. బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి రాంనివాస్ రావత్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అభిషేక్ మిశ్రా శనివారం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.


‘అలర్ట్‌గా ఉంటాం..’

"ఈరోజు, మా బృందం స్కూల్‌ను సందర్శించింది. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. మేం పాఠశాలకు అందజేసిన స్టీల్ ప్లేట్లలోనే నేను, నాతో పాటు వచ్చిన ప్రజా ప్రతినిధులు భోం చేశాం. ఇక నుంచి పిల్లలకు స్లీల్ ప్లేట్లలోనే వడ్డించాలని మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీ నిర్వాహకులకు చెప్పాం." అని మిశ్రా విలేఖరులతో అన్నారు. " అంతేకాకుండా..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తాం’’ అని చెప్పారు.

పాఠశాల ఇన్‌ఛార్జ్ భోగిరామ్ ధాకడ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. మరో ఇద్దరు సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్లు మిశ్రా తెలిపారు. భోజన పథకం ఏజెన్సీని రద్దు చేసి, ఆ పనిని పాఠశాల నిర్వహణ కమిటీకి అప్పగించారని ఆయన తెలిపారు.


‘మధ్యప్రదేశ్‌కు వస్తున్నా..’

ఈ చిన్నపాటి వీడియో ‘ప్రధాన మంత్రి(Prime minister) పోషణ్ శక్తి నిర్మాణ్’ (పిఎం పోషణ్) పథకం అమలుపై బహిరంగ చర్చకు దారితీసింది. వీడియో చూసిన తర్వాత తన గుండె పగిలిపోయినంత పనయ్యిందన్న రాహుల్.. "నేను ఈరోజు మధ్యప్రదేశ్ వెళ్తున్నా. అక్కడి పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించిన తీరు నా గుండెను పిండేసింది. దేశ భవిష్యత్తుకు దక్కిన గౌరవం ఇదా?" అని ఎక్స్‌లో పేర్కొన్నారు. 20 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ ప్రభుత్వం చివరకు "పిల్లల ప్లేట్లను కూడా దొంగిలించింది. బీజేపీ(BJP)పాలనలో 'అభివృద్ధి' అనేది కేవలం భ్రమ. అధికారంలోకి రావడానికి అసలు రహస్యం ‘‘వ్యవస్థ " అని మండిపడ్డారు. మరీ రాహుల్ గాంధీ ఆ పాఠశాలకు వెళ్తారా లేదా? అన్నది తేలాల్సి ఉంది.

పీఎం పోషణ్ పథకం లక్ష్యాలు పిల్లలకు పోషకాహారం అందించడం, విద్యకు దూరం కాకుండా చూడడం. వెనుకబడిన వర్గాలు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడాన్ని ప్రోత్సహించేందుకు, అలాగే బడికి వచ్చిన పిల్లలకు పోషకాహారాన్ని అందించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

Read More
Next Story